మలేసియాలో మనోళ్ల పాట్లు

12 Jan, 2015 03:46 IST|Sakshi
మలేసియాలో మనోళ్ల పాట్లు
  • నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌కు చెందిన 300 మంది  
  •  వేతనం అడిగితే దాడులు చేస్తున్నారని ఆవేదన
  • భీమ్‌గల్: ఏజెంట్ల చేతిలో మోసపోయిన నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన 300 మంది మలేసియాలో అష్టకష్టాలు పడుతున్నారు. ఏజెంటు ఇచ్చిన టూరిస్టు వీసా గడువు ముగిసి మలేసియా పోలీసులకు చిక్కి పరిహారం చెల్లించిన కొందరు స్వదేశం చేరుకోగా, మిగిలిన వారంతా అక్కడ బిక్కుబిక్కుమంటున్నారు. స్వదేశానికి వచ్చిన వారిలో నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌కు చెందిన ఇద్దరు ఉన్నారు.

    వారి కథనం మేరకు.. భీమ్‌గల్‌కు చెందిన పొలాస నడ్పి భూమేశ్వర్, తొగర్ల గంగాధర్‌లను కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన గల్ఫ్ సబ్ ఏజెంట్ మధుగౌడ్.. వేములవాడకు చెందిన ప్రధాన ఏజెంట్ జోరిగ దేవరాజ్ వద్దకు తీసుకెళ్లాడు. ఆయన ఒక్కొక్కరి వద్ద రూ. 1.20 లక్షలు తీసుకొని మలేసియా పంపించాడు. అక్కడ పవర్‌ప్లాంట్‌లో నెలకు రూ. 30 వేల జీతంతో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పారు. తొలుత టూరిస్టు వీసాపై అక్కడికి వెళ్తే.. మూడు నెలల్లో కంపెనీ వీసా ఇప్పిస్తానని, లేనిపక్షంలో డబ్బులు తిరిగి ఇస్తానని హమీపత్రం రాసిచ్చాడు. దీంతో వీరు నమ్మి ఏజెంట్ చేతిలో పాస్‌పోర్టు పెట్టారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత వీరి కష్టాలు ప్రారంభమయ్యాయి.

    పవర్‌ప్లాంట్ నిర్మాణంలో ఉందని చెప్పి నెలరోజులు ఖాళీగా ఉంచాడు. ఓ చిన్న గదిలో 40 మందిని ఉంచారు. మరోనెలలో సిమెంట్ ప్యాక్టరీలో పనికి కుదిర్చాడు. అక్కడి నుంచి సూపర్ మార్కెట్‌లో పనికి కుదిర్చాడు. అందులో మూడు నెలలు పని చేసినా వేతనాలు ఇవ్వకపోవడంతో ఇదేమని అడిగితే.. ఏజెంటును తీసుకురమ్మని గదమాయించారు. ఏజెంటుకు ఫోన్ చేస్తే పత్తాలేకుండా పోవడంతో వారి పరిస్థితి దిక్కుతోచకుంది.
     
    వీసా గడువు ముగియడంతో ఇక్కట్లు

    ఇక్కడ ఏజెంట్ చెప్పినట్లుగా మూడు నెలల తర్వాత కంపెనీ వీసా ఇవ్వలేదు. విజిట్ వీసా గడువు ముగియడంతో ఏజెంట్‌ను ప్రశ్నించగా, కుదరదనడంతో పాటు ‘మీ ఇష్టం వచ్చినట్లు చేసుకో’మని బెదిరించాడు. దీంతో వీరు ఇక్కడి బంధువులను ఆశ్రయించగా, టికెట్లు కొనిపంపించారు. అక్కడి ప్రభుత్వం తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని దేశం విడిచి వెళ్లేందుకు అవకాశమిస్తూ గడువు ఇవ్వడంతో ఊపిరిపీల్చుకొని బయటపడ్డారు. వీసా గడువు నిబంధనలు ఉల్లంఘించినందుకు అక్కడి ప్రభుత్వం విధించిన రూ. 400 రింగిట్లు(ఇండియన్ కరెన్సీలో రూ. 8 వేలు జరిమానా)ను ఇంటినుంచి పంపడంతో చెల్లించి బయటపడ్డారు. 

మరిన్ని వార్తలు