ఈ ఫోర్త్ అంపైర్.. 'సన్నీ' హితుడు

22 May, 2019 07:40 IST|Sakshi
ఇనార్బిట్‌ మాల్‌లో జరిగిన ఈవెంట్‌లో సచిన్‌తో సన్నీ (ఫైల్‌)

యాంకరింగ్‌లో దూసుకెళుతున్న సిటీవాసి 

కాలేజీలో మొదలై ఆకాష్‌ అంబానీ పెళ్లి వరకు అతడే

సన్నీ ప్రతిభకు ఫిదా అయిన సచిన్, ముఖేష్‌ అంబానీ

హిమాయత్‌నగర్‌: ఆ యువకుడు మైక్‌ పట్టుకుంటే స్టేడియంలోని క్రీడాభిమానుల్లో జోష్‌ పెరగాల్సిందే. వేడుకల్లో వేసే పంచ్‌లకు అతిథులు కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. కాలేజీలో జరిగిన చిన్న ఈవెంట్‌తో మొదలైన ప్రయాణం ముఖేష్‌ అంబానీ కొడుకు ఆకాష్‌ పెళ్లిలో యాంకరింగ్‌ చేసే స్థాయికి ఎదిగాడు. కాలేజీ క్రికెట్‌ కామెంట్రీనుంచి మొదలైన జర్నీ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టు తరఫున యాంకరింగ్‌ చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకునేంతగా ఎదిగాడు. అతడే ‘సన్నీ ఖండేల్‌వాల్‌’.. మన నగర యువకుడు. క్రికెటర్స్‌ బ్యాటింగ్, బౌలింగ్‌లో టెన్షన్‌గా ఉన్నప్పుడు వారికి నచ్చిన మ్యూజిక్‌ని ట్యూన్‌ చేస్తూ.. స్టెప్పులేస్తూ వారిని ఒత్తిడి నుంచి దూరం చేస్తూ ‘ది ఫోర్త్‌ అంపైర్‌’గా గుర్తింపు పొందాడు మన సిటీ కుర్రాడు.

నగరానికి చెందిన రమేష్‌ ఖండేల్‌వాల్, సీమ ఖండేల్‌వాల్‌ కుమారుడు సన్నీ ఖండేల్‌వాల్‌. అమీర్‌పేటలోని సిస్టర్‌ నివేదిత స్కూల్లో అక్షరాభ్యాసం చేసిన ఇతడు.. సెయింట్‌ మేరీస్‌లో కాలేజీ విద్యను పూర్తి చేశాడు. కాలేజీ రోజుల్లో నుంచే మంచి యాంకర్‌ అవ్వాలనే అభిలాష ఇతడిలో పెరిగింది. కాలేజీలో జరిగే చిన్నా, చితకా పార్టీలు, ఈవెంట్లకు సన్నీనే యాంకరింగ్‌ చేసేవాడు. కొడుకులోని తపనను చూసిన తండ్రి.. భవిష్యత్‌లో యాంకరింగ్‌కు మంచి అవకాశం ఉంటుందని భరోసా ఇవ్వడంతో సన్నీ ఈవెంట్స్‌ కోర్సు కూడా చేశాడు.

మిస్టర్‌ వలంటైన్‌ విన్నర్‌
ఏటా ప్రముఖ దినపత్రిక ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ నిర్వహించే ‘మిస్టర్‌ యూత్‌’ ప్రోగ్రాంకి కాలేజీ నుంచి సన్నీ పాల్గొన్నాడు. ఢిల్లీలో జరిగిన ఈవెంట్‌లో దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు పోటీ పడగా ‘వీజే హంట్‌’ విభాగంలో, ‘స్టేజ్‌ అప్పీరెన్స్‌’లో సౌత్‌ ఇండియా–20గా నిలిచాడు. అంతేకాదు.. హైదరాబాద్‌ నుంచి ‘మిష్టర్‌ వలంటైన్‌’ టైటిల్‌ని సొంతం చేసుకున్నాడు మన హైదరాబాదీ. 

దుబాయ్‌లో సైతం..
దుబాయ్‌లో నిర్వహించే టీ–10 క్రికెట్‌ పోటీలకు సైతం సన్నీ యాంకరింగ్‌ చేస్తుడండం గమనార్హం. ఇందుకోసం అక్కడి నిర్వాహకులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ యాంకర్లను ఆహ్వానించగా.. సన్నీ మాత్రమే ఎంపికయ్యాడు. దుబాయ్‌ లీగ్‌లో మన సన్నీ యాంకరింగ్‌ చూసిన అక్కడి అపర కుబేరుల్లో ఒకరైన రిజ్వాన్‌ నిజాన్‌ మంత్రముగ్ధుడై సన్నీని పొగడ్తలతో ముంచెత్తాడు.  

ఆటా.. పాటా.. మాటలతో మైమరపించే సన్నీ ఖండేల్‌వాల్‌, ప్రొ కబడ్డీ పోటీల్లో సుస్మితాసేన్‌తో..
సచిన్‌నే మైమరిపించాడు
మూడేళ్ల క్రితం నగరంలోని ఇనార్బిట్‌ మాల్‌లో జరిగిన ఓ ఈవెంట్‌కు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ హాజరయ్యాడు. ఆవేడుకను సన్నీనే యాంకర్‌. సచిన్‌ వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అభిమానులు ఈ ఈవెంట్‌కు పోటెత్తారు. వారందికీ ‘టైన్‌ టైంస్‌ సచిన్‌..సచిన్‌’.. అన్న నినాదాన్ని వారందరిలోకీ ఎక్కించాడు. సచిన్‌ వేదిక ఎక్కిన వెంటనే అభిమానులంతా ఒక్కసారిగా అదేవిధంగా స్పందించారు. ఆ కాంప్లిమెంట్‌కు ఫిదా అయిపోయాడు. ఐపీఎల్‌ సమయంలో యాంకరింగ్‌ చేస్తూ ముంబై ఇండియన్స్‌ను గెలుపుదిశగా ప్రోత్సహిస్తున్న తనపై సచిన్‌ చూపించే అభిమానాన్ని వర్ణించలేనంటూ సన్నీ తన ఆనందాన్ని వ్యక్తం పరిచాడు. సన్నీ ప్రొ కబడ్డీలోనూ అదే జోష్‌ చూపుతున్నాడు. బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌కు చెందిన కబడ్డీ టీమ్‌కి సన్నీ యాంకరింగ్‌ చేస్తూ తనకు మాత్రమే సొంతమైన చతురత.. చలోక్తులతో జట్టు సభ్యులను, యజమాని అక్షయ్‌ కుమార్‌ మన్ననలు అందుకున్నాడు.  

ఐపీఎల్‌లోకి అలా..
కాలేజీ ఈవెంట్‌లు, వేడుకల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సన్నీ.. ‘ఇండియన్‌ క్రికెట్‌ లీగ్‌’కు 2005–2006లో యాంకరింగ్‌ చేశాడు. ఇది చేస్తుండగా 2006లో ప్రారంభమైన ‘ఐపీఎల్‌’కి అనుకోకుండా యాంకరింగ్‌ చేసే అవకాశం దక్కింది. మూడేళ్ల పాటు రాజస్థాన్‌ రాయల్స్, అనంతరం పూణేకి ప్రాతినిధ్యం వహించాడు. వీటిలో సన్నీ ప్రతిభను గుర్తించిన ముంబై ఇండియన్స్‌ ఆరో సీజన్‌కు యాంకరింగ్‌ చేసేందుకు ఆహ్వానించింది. అప్పటి నుంచి ముంబై ఇండియన్స్‌కు యాంకరింగ్‌ చేస్తూ ముఖేష్‌ అంబానీ, నీతూ అంబానీల కుటుంబానికి ‘సన్ని’హితుడిగా మారిపోయాడు. ఆకాష్‌ అంబానీ వివాహాన్ని ఎంత అట్టహాసంగా చేశారో దేశమంతా తెలిసిందే. ఆ పెళ్లిల్లో నీతూ అంబానీకి ఇష్టమైన ‘కృష్ణ రాసలీల’ గురించి తెలుసుకున్న సన్నీ.. ఆ థీమ్‌ను ‘ఎయిర్‌–వాటర్‌–ఎర్త్‌’ రూపంలో కళాకారులతో ప్రదర్శించి ఆ పెళ్లి వేడుకకు వచ్చిన అతిథుల దృష్టిలో నిలిచిపోయాడు. ‘ఈ ప్రదర్శనకు ముఖేష్, నీతూ అంబానీలు సైతం ఆశ్చర్యంతో పులకించిపోయారు’ అంటూ చెప్పుకొచ్చాడు సన్నీ. 

మరిన్ని వార్తలు