మాలీలను ఎస్టీ జాబితాలో వెంటనే చేర్చాలి

8 Oct, 2019 12:04 IST|Sakshi
మహాపాదయాత్ర నిర్వహిస్తున్న మాలీ కులస్తులు

హామీని విస్మరించిన కేసీఆర్‌

మాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్‌ పెట్కులే

సాక్షి, వాంకిడి(ఆసిఫాబాద్‌): మాలీలను ఎస్టీ జాబితాలో చేర్చుతామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చి విస్మరించారని మాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్‌ పెట్కులే తెలిపారు. మాలీలను ఎస్టీలో చేర్చాలని డిమాండ్‌ చేస్తూ నిర్వహిస్తున్న మహాపాదయాత్ర సోమవారం వాంకిడికి చేరుకుంది. ఈ సందర్భంగా వాంకిడి మండల కేంద్రంలోని జ్యోతిబా ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాగానే మాలీలను ఎస్టీలో కలిపే బిల్లుపై తొలి సంతకం పెడతామని సీఎం కేసీఆర్‌ 2009లో కాగజ్‌నగర్‌లో జరిగిన ఉద్యమ సభలో ప్రకటించారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక చెల్లప్ప కమిషన్‌ ద్వారా సర్వే చేయించేందుకు జాప్యం ప్రదర్శిస్తూ ద్వంద వైఖరీని అవలంభిస్తున్నారని మండిపడ్డారు. మాలీల పట్ల చిన్నచూపు చూస్తూ నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోయారు. మాలీల బలనిరూపణకు బెజ్జూర్‌ నుంచి జైనూర్‌ వరకూ దాదాపు 150 కిలోమీటర్ల మేర మహాపాదయాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికైనా మాలీల స్థితిగతులపై చెల్లప్ప కమిషన్‌ ద్వారా సర్వే చేయించి కేంద్రానికి రిపోర్ట్‌ పంపాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ పాదయాత్రలో మాలీ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాలీలకు ఎస్టీ హోదా కల్పన కమిటీ వ్యవస్థాపకుడు నారాయణ వాడై, జిల్లా అధ్యక్షుడు నాగోసె శంకర్, డివిజన్‌ అధ్యక్షుడు మెంగాజీ, మండల అధ్యక్షుడు నారాయణ, తదితరులు పాల్గొన్నారు. 

11న మాలీల మహాసభ.. 
జైనూర్‌(ఆసిఫాబాద్‌): ఈనెల 11న జైనూర్‌లో నిర్వహించే మాలీల మహాసభను విజయవంతం చేయాలని మాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్‌ పేట్కులే కోరారు. జైనూర్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాలీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 2న బెజ్జూర్‌ నుంచి జైనూర్‌ వరకూ మహాపాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. మహాసభలో మాలీల సమస్యలపై చర్చించనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా నుంచి మాలీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్, నాగోసే, ఆదిలాబాద్‌ జిల్లా కార్యదర్శి నందకుమార లేండుగురే, జైనూర్‌ మండల అధ్యక్షుడు హుస్సేన్‌ పేట్కులే, నాయకులు జేంగటే రాందాస్, వాటగురే హరి, దీపక్, శివాజీ, నానేశ్వర్‌ తదితరులున్నారు.     

మరిన్ని వార్తలు