కంటోన్మెంట్ రోడ్లు రాత్రి వేళల్లో తెరచి ఉంచాలి

28 Nov, 2014 01:55 IST|Sakshi
కంటోన్మెంట్ రోడ్లు రాత్రి వేళల్లో తెరచి ఉంచాలి

* రక్షణశాఖ మంత్రికి టీడీపీ ఎంపీ మల్లారెడ్డి విజ్ఞప్తి

సాక్షి, న్యూఢిల్లీ: భద్రత పేరిట సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని రోడ్లను మిలిటరీ సిబ్బంది మూసివేస్తుండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మల్కాజ్‌గిరి టీడీపీ ఎంపీ మల్లారెడ్డి పేర్కొన్నారు. గురువారం పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ సమస్యను రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ దృష్టికి తెచ్చినట్టు తెలిపారు.

విజయ్‌చౌక్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిజాం కాలం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ప్రజలకు అందుబాటులో ఉన్న రోడ్లను అకస్మాత్తుగా భద్రత పేరుతో మూసివేయడం సరికాదన్నారు. దీంతో సుమారు 12 లక్షల మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ‘రాత్రి వేళల్లో అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వెళ్లాలంటే 8 కిలోమీటర్లు అదనంగా తిరిగి రావాల్సి వస్తోంది. దీంతో ప్రజలకు ఎంతో ఇబ్బందిగా ఉందని రక్షణశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశా. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు’ అని మల్లారెడ్డి తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు