వచ్చే ఏడాదికల్లా మల్లన్నసాగర్‌

7 Jun, 2017 02:38 IST|Sakshi
నర్సాపూర్‌ రైతులతో సీఎం కేసీఆర్‌ 
సాక్షి, హైదరాబాద్‌: మల్లన్న సాగర్‌ వచ్చే ఏడాదికల్లా పూర్తవుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఎన్ని దుష్ట శక్తులు అడ్డుకున్నా ప్రాజెక్టుల నిర్మాణం ఆగబోదని పేర్కొన్నారు. బ్రాహ్మణపల్లి, గుండ్లపల్లి మధ్యలో ఉన్న దొంతివాగు మీద చెక్‌డ్యాం నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని నీటిపారుదల మంత్రి హరీశ్‌రావుకు సీఎం సూచించారు. అందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఆదేశించారు. నర్సా పూర్‌ నియోజకవర్గం నుంచి వచ్చిన రైతులు కేసీఆర్‌ను మంగళవారం ప్రగతి భవన్‌లో కలిశారు.
 
ఈ సందర్భంగా రైతులతో సీఎం మాట్లాడారు. ‘కొద్ది రోజుల్లో వర్షాలు కురుస్తా యని అంటున్నారు. వర్షాలు తగ్గగానే అధికా రులతో కలసి నియోజకవర్గానికి వస్తాను. అక్కడే కలుస్తాను. గ్రామాల్లో రైతుల బాధలు నాకు తెలుసు. అందుకే ఎకరాకు ఒక్కో పంటకు రూ.4 వేల చొప్పున పంపిణీ చేసే పథకం అమలు చేస్తాం. దీంతో రైతులు ఎరువులు, విత్తనాలు కొనేందుకు ఆర్థిక ఇబ్బంది తీరుతుంది. ఐదారేళ్లు కాలం మంచి గా ఉంటే రైతులు బాగుపడుతారు. ఈ లోపు ప్రాజెక్టుల నీళ్లు వచ్చి భూములు సస్యశ్యామ లం అవుతాయి’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులతో పాటు గొల్ల, కుర్మలకు గొర్రెలిస్తున్నామని, మూడేళ్లలో రూ.20 వేల కోట్ల సంపద సమకూరుతుందన్నారు.
 
గొర్రెలకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌ వస్తుందని, చేపల పెంపకం కూడా చాలా లాభసాటి వ్యాపారమని, అందుకే చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్రం అనుకున్నంత అభివృద్ధి కావాలంటే అందరూ కలిసి మెలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. పేదరికాన్ని పారదోలేందుకు ప్రభుత్వం అమలు చేసిన పథకాలు వినియోగిం చుకోవా లని సూచించారు. ప్రతి గ్రామం ఒక యూనిట్‌గా పనిచేయాలని, నర్సాపూర్, గజ్వేల్‌ నియోజకవర్గాల అభివృద్ధికి కావాల్సి నన్ని డబ్బులు ఇస్తామని ఆయన భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పాల్గొన్నారు.
>
మరిన్ని వార్తలు