జర భద్రం!

8 Jun, 2020 10:44 IST|Sakshi

నేటి నుంచి మాల్స్, హోటళ్లు, మందిరాలు ఓపెన్‌

అంతటా ‘ఎస్‌ఎంఎస్‌’తోనే లోనికి అనుమతి

స్వీయ నియంత్రణ లేకపోతే అందరికీ ముప్పు

గుంపులుగా చేరితే వైరస్‌ వ్యాప్తి పెరిగే ప్రమాదం

ఇప్పటికే..నగరంలో భారీగా కేసుల వరద

సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్‌ దెబ్బతో మూతపడ్డ మాల్స్, హోటళ్లు, ప్రార్థనా మందిరాలన్నీ సోమవారం నుంచి తెరుచుకోన్నాయి. అయితే ఎస్‌ఎంఎస్‌ (శానిటైజర్, మాస్క్, సోషల్‌ డిస్టెన్స్‌)ను తప్పనిసరిగా అమలు చేయాలని, అవి ఉల్లంఘించే వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే గడిచిన వారం రోజులుగా నగరంలో భారీగా కరోనా పాజిటివ్‌ కేసులు–మరణాలు నమోదవుతున్న నేపథ్యంలో మాల్స్, హోటళ్లు, మందిరాలు తిరిగి ప్రారంభిస్తుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో ఎన్నారైలు, తబ్లిగీల  కుటుంబాలు, ఏరియాలు దాటి మహా నగరమంతా వైరస్‌ స్వైర విహారం చేస్తున్న నేపథ్యంలో భారీగా జనం పోగయ్యే ప్రాంతాలు తిరిగి ప్రారంభిస్తుండటం ఒక విధంగా రిస్క్‌తోనే కూడుకున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

‘దూరం..దూరం..’ ఏరాట్లు
సోమవారం ఉదయం నుంచి కీసర, దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా, నౌబత్‌పహడ్‌ వెంకటేశ్వరస్వామి దేవాలయాలు మొదలుకుని చారిత్రక మక్కా మసీదు, సెయింట్‌ ఆన్స్‌ చర్చి తదితరాలన్నీ యథావిధిగా ఓపెన్‌ అవుతాయి. ఇక్కడ కూడా తప్పనిసరిగా మాస్క్, భౌతికదూరం పాటించే నిబంధనతో పాటు అన్ని చోట్ల గేటు బయటే శానిటైజర్‌ ఇచ్చే ఏర్పాట్లను ఆయా సంస్థలే చేపడుతున్నాయి. ఇక మాల్స్‌–హోటళ్లకు సంబంధించి నగరంలో 20 వేల వరకు ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, 110 వరకు ఉన్న స్టార్‌ హోటళ్లలో కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా రక్షణ ఏర్పాట్లు చేసుకున్నారు. రెస్లారెంట్లలో ఇంతకు ముందు సీట్లలో యాభై శాతాన్ని, అంటే..ప్రతి టేబుల్‌పై ఇద్దరిని మాత్రమే అనుమతించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే మరో వైపు రెస్టారెంట్లు, హోటళ్లకు నరిపోను సిబ్బంది కూడా లేకపోవటంతో పూర్తి సర్వీసులు అందజేయలేని పరిస్థితి ఉంది. 

భయపెడుతున్న కోవిడ్‌ రక్కసి..   
కోవిడ్‌ రక్కసి పంజా జోరుగా విసురుతోంది. నగరంలో  ప్రతి నెలా కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. మార్చిలో నగరంలో 64 పాజిటివ్‌ కేసులు, 6 మరణాలు సంభవిస్తే, ఏప్రిల్‌లో 537 కేసులు, 15 మరణాలు, మేలో 1054 కేసులు, 50 మరణాలు, జూన్‌లో తొలి 7 రోజుల్లోనే 635 కేసులు, 39 మరణాలు చోటు చేసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో  ప్రభుత్వం, అధికారులు ఎంత చెప్పినా.. స్వీయ నియంత్రణే అల్టిమేట్‌ రక్షణ చర్య అని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంటోంది. తాము ఎన్ని ఏర్పాట్లు చేసి, పర్యవేక్షించినా నగర వాసులు తాము వెళుతున్న ప్రదేశాల్లో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే సంస్థలు, ప్రాంతాలపై వెంటనే 100 ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని కోరింది. ఇదే విషయంలో తెలంగాణ హోటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎస్‌.వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ తమకు ప్రజల నుండి కూడా సహకారం కావాలని, తాము ఎన్ని ఏర్పాట్లు చేసినా, వచ్చే వారిలో స్వీయ నియంత్రణ ఉండాలని అన్నారు.

భౌతిక దూరంతో నమాజ్‌ పాటించాలని ఫత్వా 
నగరవ్యాప్తంగా సోమవారం నుంచి మసీదులు పూర్తి స్థాయిలో ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నమాజ్‌లు చేసుకునేవారు భౌతిక దూరం పాటించాలని జామియా నిజామియా ఫత్వా జారీ చేసింది. అలాగే ప్రతి మసీదును ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయాలని నిర్ణయించారు.  నమాజ్‌ల కోసం పరిచే జానీమాజ్‌లను తీసి..నేల పైనే నమాజ్‌ చేసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. ప్రవేశ ద్వారా వద్ద శానిటేషన్‌ ఏర్పాట్లు చేపట్టారు. ప్రముఖ మత గురువు ముఫ్తీ అజీముద్దీన్‌ మాట్లాడుతూ కరోనా వ్యాపించకుండా ఉండాలంటే భౌతిక దూరం తప్పనిసరి అని, మసీదు కమిటీలు కూడా ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కోరారు.  

ఈ లెక్కలు చూసి..అడుగేయండి..
నగరంలో కోవిడ్‌ విస్తరణ..జెట్‌ స్పీడ్‌ వేగంతో జరుగుతోంది.అందుకే సోమవారం నుండి ఇంటి నుండి బయల్దేరే వారు ఈ లెక్కలు చూసి..జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.. నగరంలో కేసులు, మరణాలు ఇలా..

రోజు    పాజిటివ్‌ కేసులు  
జూన్‌ 1    79
జూన్‌ 2    70
జూన్‌ 3    108
జూన్‌ 4    110
జూన్‌ 5    116
జూన్‌ 6    152
జూన్‌ 7    132

మరిన్ని వార్తలు