మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన భట్టి

27 Aug, 2019 16:00 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల: కాంగ్రెస్‌ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అధ్వర్యంలో మాజీ మంత్రి శ్రీధర్‌ బాబు, కొక్కిరాల సురేఖ మంగళవారం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. గత ప్రభుత్వాలు నిర్మించిన ప్రభుత్వ ఆస్పత్రులను, ఆరోగ్యశ్రీని ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండి పడ్డారు. 60 మంది వైద్యులు ఉండాల్సిన మంచిర్యాల ఆస్పత్రిలో కేవలం 20 మంది వైద్యులు మాత్రమే ఉన్నారన్నారు. అసలే అరకొర సేవలంటే దీనికి తోడు ఆసిఫాబాద్‌ జిల్లా నుంచి కూడా రోగులు ఇక్కడకే వస్తున్నారన్నారు. సరైన వసతులు లేకపోవడమే కాక రోగుల తాకిడి ఎక్కువగా ఉండటంతో మంచిర్యాల ఆస్పత్రి సిబ్బంది వారందరిని కరీంనగర్‌ ఆస్పత్రికి పంపుతున్నారన్నారు. ఫలితంగా మంచిర్యాల ఆస్పత్రి కేవలం రిఫరల్‌ ఆస్పత్రిగా మాత్రమే కొనసాగుతుందని తెలిపారు. ఆస్పత్రుల్లో శానిటేషన్‌ సిబ్బందికి 20 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని భట్టి విక్రమార్క ఆరోపించారు.

రాష్ట్రంలో ఆస్పత్రులకు డీఎంఎఫ్‌టీ కింద వందల కోట్ల నిధులు ఉన్నా ప్రభుత్వం వాటిని ఖర్చు చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు మాజీ మంత్రి శ్రీధర్‌ బాబు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందిస్తున్నామని గొప్పలు చెబుతోన్న ఈటెల దీనిపై శ్వేతం పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆరోగ్య శాఖను పటిష్టం చేసి మెరుగైన వైద్య సేవలు అందించకుంటే కాంగ్రెస్‌ పార్టీ తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని శ్రీధర్‌బారు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు