ఉద్యోగాల పేరుతో రూ.40 లక్షలకు టోపీ

19 Feb, 2016 19:34 IST|Sakshi

హిమాయత్‌ నగర్ (హైదరాబాద్) : ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగ యువకులను నమ్మించి రూ.40 లక్షల మేర మోసం చేసిన వ్యక్తి కటకటాల పాలయ్యాడు. ఇందుకు సంబంధించి నారాయణగూడ ఇన్‌స్పెక్టర్ భీమ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా గుళ్లపల్లి గ్రామానికి చెందిన కొత్త శ్రీనివాసరావు నగరంలోని న్యూ బాకారంలో నివాసం ఉంటున్నాడు. విలాసాలకు అలవాటు పడిన శ్రీనివాసరావు గత కొన్నేళ్లుగా ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు విప్రో, టీసీఎస్, కాగ్నిజెంట్లలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థులు, నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి నమ్మించేవాడు. దీనికోసం  నారాయణగూడలో 4 జాబ్ ప్లేస్మెంట్ కన్సల్టేన్సీలను కూడా ప్రారభించాడు. కొందరికి ఫేక్ ఆఫర్ లెటర్లు కూడా ఇచ్చాడు.  

ఇలా సుమారు 150 మంది నుంచి రూ.40 లక్షల మేర వసూలు చేసి ఆ డబ్బుతో జల్సాలు చేసేవాడు. ఎంతకీ అతడు ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని 420, 406, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.

 

మరిన్ని వార్తలు