చంపేస్తే అప్పు తప్పుతుందని..

4 Mar, 2020 10:00 IST|Sakshi
వరంగల్‌ ప్రెస్‌క్లబ్‌లో రోదిస్తున్న సునీల్‌రెడ్డి తల్లి

నమ్మించి ఇంటికి తీసుకెళ్లాక హత్య

పోలీసుల అదుపులో బేకరీ యజమాని?

గోవిందరావుపేట: అప్పు తీసుకున్న డబ్బు ఇప్పుడే ఇవ్వాలంటూ కూర్చున్న దేవేందర్‌రెడ్డిని హత్య చేస్తే మిగతా చిన్నచిన్న అప్పులను తీర్చేయవచ్చని.. ఇదేక్రమంలో హత్య చేశాక మృతదేహాన్ని రాత్రి మాయం చేయాలని భావించాడు.. ఇదే ఆలోచనతో బేకరీ లోపలికి తీసుకెళ్లిన దేవేందర్‌రెడ్డిని తీవ్రంగా కొట్టాక చనిపోయాడనుకుని బయటకు వచ్చాక సునీల్‌రెడ్డి కనిపించాడు.. అంతసేపటి వరకు ఒకటే హత్య చేయాలని అనుకున్న నిందితుడు.. రెండో హత్యకు కూడా సిద్ధమయ్యాడు. దీంతోనే సునీల్‌ను నమ్మించి ఇంటికి తీసుకెళ్లి హత్యకు పాల్పడ్డాడు. ఇదీ ములుగు జిల్లా పస్రాలో సోమవారం రాత్రి జరిగిన హత్యకు సంబంధించి నిందితుడు, బేకరీ యజమాని దయానంద్‌ అలియాస్‌ దయ పన్నాగంగా తెలుస్తోంది. ఈ మేరకు నిందితుడు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.

రూ.6లక్షల అప్పు..
కర్ణాటకకు చెందిన దయానంద్‌ తన మామ ప్రభుతో కలిసి పస్రాలో కొన్నేళ్ల క్రితం బేకరీ ప్రారంభించారు. అయితే, అప్పులు ఎక్కువ కావడంతో కొద్దికాలం క్రితం ఊరు వదిలేసి వెళ్లిపోయారు. మళ్లీ ఆరునెలల క్రితం వచ్చిన వారు పస్రాలోనే కొత్తగా బేకరీ తెరిచారు. అప్పటికే ఉన్న అప్పులకు తోడు మరికొన్ని అప్పులు చేశారు. ఈ క్రమంలో దయకు రూ.6లక్షలు అప్పు ఇచ్చిన దేవేందర్‌రెడ్డి నుంచి ఒత్తిడి పెరిగింది. సోమవారం కూడా దేవేందర్‌రెడ్డి తన స్నేహితుడైన ఫొటో జర్నలిస్ట్‌ సునీల్‌రెడ్డితో కలిసి పస్రా వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మంతనాలు సాగించినా డబ్బు తిరిగి ఇవ్వడంలో ఎలాంటి పురోగతి కానరాలేదు. తనకు స్థానిక వ్యాపారి ఒకరు డబ్బు ఇవ్వాల్సి ఉందని చెప్పగా.. దేవేందర్, సునీల్‌ ఆయన వద్దకు వెళ్లి ఆరా తీశారు. అయితే, దయకు తాను డబ్బు పెద్దగా ఇచ్చేది లేదని.. కొంతమొత్తమే ఉన్నా తనకు కుమార్తె వివాహం ముగిశాక ఇస్తానని చెప్పాడు. (ఫొటో జర్నలిస్ట్‌ దారుణ హత్య)

ఇస్తావా.. ఇవ్వవా?
వ్యాపారి మొండిచేయి చూపడంతో దేవేందర్, సునీల్‌ మళ్లీ దయ బేకరీ వద్దకు వచ్చారు. దేవేందర్‌రెడ్డి తనకు ఇవ్వాల్సిన రూ.6లక్షల విషయమై మళ్లీ ప్రశ్నించాడు. ఉదయం నుంచి నచ్చచెప్పినా వినడం లేదని భావించిన దయ.. తొలుత దేవేందర్‌రెడ్డిని హత్య చేసి అప్పు వదిలించుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. ఇదే భావనతో పక్కనే ఉన్న మామ ప్రభుకు కూడా అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. రాత్రి 7–30 గంటలకు బేకరీకి వచ్చిన దేవేందర్‌రెడ్డిని బేకరీలో వెనక ఉన్న బట్టీ వద్దకు తీసుకెళ్లి విచక్షణా రహితంగా తలపై దాడి చేశాడు. ఈ ఘటనలో చనిపోయాడని భావించి శవాన్ని రాత్రికి మాయం చేయాలనే ఆలోచనతో బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అలా రాగానే సునీల్‌రెడ్డి కనిపించడంతో దయా తన ఆలోచన మార్చుకున్నాడని సమాచారం. ‘ఇంటికి పోయి మాట్లాడుకుందాం.. అక్కడ నీకు అన్ని విషయాలు, నా ఇబ్బందులు చెబుతా’ అంటూ సునీల్‌రెడ్డిని తీసుకుని ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో దయ మామ, భార్య బేకరీలో ఉన్నారు. ఈ మేరకు ఇంటికి వెళ్లగానే అక్కడ ఉన్న కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన సునీల్‌రెడ్డి అక్కడికక్కడే మరణించాడు.

రక్తపు మడుగులో దేవేందర్‌..
దయ, సునీల్‌రెడ్డి ఇంటికి వెళ్లాక పనిపై ప్రభు బేకరీలోని బట్టీ వద్దకు వెళ్లాడు. అక్కడ రక్తపు మడుగులో దేవేందర్‌రెడ్డి కనిపించడంతో ప్రమాదాన్ని పసిగట్టిన ఆయన స్థానికుల సాయంతో 108లో ములుగు ఆస్పత్రికి చేర్చాడు. ఇంతలోనే దయ భార్య బేకరీ నుంచి ఇంటికి వెళ్లగా లోపలి నుంచి గొడవ వినిపించినట్లు సమాచారం. ఉదయం నుంచి అప్పు విషయమై జరుగుతున్న గొడవగానే ఆమె భావించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత దయ రక్తపు మరకలు కడుక్కుంటూ ఇంటి నుంచి బయటకు రావడాన్ని చూసిన ఆమె ఏదో జరిగిందని ఊహించినట్లు సమాచారం. ఆ తర్వాత దయా రోడ్డుపైకి రావడాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. ఇంతలోనే దయ నేరుగా పోలీసులకు లొంగిపోయినట్లు  సమాచారం.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా