పోలీసులకు 'దృశ్యం' చూపిస్తున్నాడు

17 Oct, 2015 18:19 IST|Sakshi
పోలీసులకు 'దృశ్యం' చూపిస్తున్నాడు

బంజారాహిల్స్ : పెళ్లి చేసుకోమని నిలదీసిందనే కోపంతో సహజీవనం చేస్తున్న యువతిని ముక్కలుగా నరికి పారేసినట్లు నిందితుడు చెబుతున్నా పోలీసులకు ఒక్క ఆధారం కూడా దొరకటం లేదు. దీంతో నిందితుడి మాటలను నమ్మాలో వద్దో తెలియక పోలీసులు నానాతంటాలు పడుతున్నారు. ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే...బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లోని ఇందిరానగర్‌లో ఆగస్టు 4వ తేదీన రమణకుమారి అనే యువతిని హత్య చేసి దేహాన్ని ముక్కలుగా చేసి నగరంలో వివిధ ప్రాంతాల్లో పడేసినట్లు దుర్గా విజయ్‌బాబు అనే వ్యక్తి పోలీసులకు వెల్లడించిన విషయం తెలిసిందే.

అయితే గత నాలుగు రోజులుగా విజయవాడ పోలీసులు నగరానికి వచ్చి అతడు చెప్పినట్లుగా జానకమ్మ తోట, గుట్టల బేగంపేటలో యువతి అవశేషాల కోసం గాలిస్తున్నా ఒక్క ఆధారమూ దొరకలేదు. గుట్టల బేగంపేటలో మొండెం ఉంచిన సూట్‌కేస్‌ను పడేసినట్లు నిందితుడు పేర్కొనగా అక్కడ ఎలాంటి సూట్‌కేస్ కనిపించలేదు. ఇక తల, కాళ్లూ,చేతులు ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి జానకమ్మ తోటలో పడేసినట్లు చెప్పగా శుక్రవారం రాత్రంతా జూబ్లీహిల్స్ పోలీసుల బందోబస్తు మధ్య విజయవాడ పోలీసులు జేసీబీల సాయంతో రాళ్లను పక్కకు జరిపించి కనీసం ఎముకలైనా దొరుకుతాయేమోనని జల్లెడ పట్టినా ఎలాంటి క్లూ దొరకలేదు.

అసలు రమణకుమారి హత్యకు గురైందా? విజయ్‌బాబు కథలు అల్లుతున్నాడా? అన్నది సస్పెన్స్‌గా మారింది. నిందితుడు విజయవాడ పోలీసులను, బంజారాహిల్స్‌ పోలీసులను అయోమయానికి గురి చేస్తున్నట్లు సమాచారం. ఇంతకీ రమణకుమారి ఏమైందన్న దానిపై పోలీసులకు అంతు చిక్కకుండా ఉంది.

ఈ కేసులో ముందుకు తీసుకెళ్లాలంటే మృతదేహం లేకుండా దర్యాప్తు ప్రారంభించడం(కార్పస్ డెలిక్టి) ఒక్కటే విజయవాడ పోలీసుల ముందున్న మార్గం. ఒకవేళ బాధితుడు కోర్టును ఆశ్రయిస్తే తప్పనిసరిగా రమణకుమారి వివరాలను పోలీసులు కోర్టుకు వెల్లడించాల్సి ఉంటుంది. ఏ ఒక్క ఆధారం లేకుండా ఏం చేయాలో పోలీసులకు పాలుపోవడం లేదు. నిందితుడు ఈ కేసు నుంచి తప్పించుకోవడానికే పోలీసులకు 'దృశ్యం' సినిమా కథను చవిచూపిస్తున్నట్లు పోలీసులే అనుమానిస్తున్నారు. ఇక ఈ కేసు ఎటు వైపు నుంచి ఎటు వెళ్తుందో వేచి చూడాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు