భార్య కాపురానికి రావడం లేదని.. టవర్‌ ఎక్కి..

28 Feb, 2020 09:03 IST|Sakshi
సెల్‌ టవర్‌ ఎక్కిన రాజు

సాక్షి, తిరుమలాయపాలెం(ఖమ్మం): భార్య కాపురానికి రావడం లేదని ఓ వ్యక్తి పురుగుమందు డబ్బాతో సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేసిన సంఘటన మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన పెంటా రాజుకు మండలంలోని కొక్కిరేణి గ్రామానికి చెందిన ఉమతో 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. దంపతులు కొక్కిరేణి గ్రామంలోనే ఉంటూ కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటున్నారు. మూడేళ్ల నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. కాగా కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో తండ్రికి సంబంధించిన ఉద్యోగం రావడంతో రాజు ఇటీవల కరీంనగర్‌ వెళ్లాడు.

రాజుతోపాటు అక్కడికి వెళ్లేందుకు భార్య నిరాకరించింది. ఈ విషయమై పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు కూడా జరిగాయి. అయినా ఫలితం లేదు. దీంతో విసిగి వేసారిన రాజు గురువారం తెల్లవారుజామున పురుగుల మందు డబ్బాతో కొక్కిరేణి గ్రామంలోని సెల్‌ టవర్‌ ఎక్కాడు. తన భార్య కాపురానికి రావాలని, లేకపోతే తాను మందు తాగి చనిపోతానని బెదిరించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రాజుతో మాట్లాడారు. భార్యను సంఘటన స్థలానికి పిలిపించి, నచ్చజెప్పి రాజును కిందకు దింపారు. అనంతరం పోలీసులు దంపతులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. రాజుతో కలిసి ఉండాలని ఉమకు చెప్పి ఇరువురిని పంపించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు