గుడికోసం ట్యాంక్‌ ఎక్కి నిరసన

27 Jun, 2019 11:36 IST|Sakshi
వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి నిరసన తెలుపుతున్న యువకులు

నాలుగు గంటల పాటు ఉద్రిక్తత

తహసీల్దార్, ఎంపీడీవోల హామీతో ఆందోళన విరమణ

సాక్షి, భిక్కనూరు (కామారెడ్డి): తాతముత్తాతల కాలంనుంచి పెద్దమల్లారెడ్డి చౌరస్తాలో ఉన్న హనుమాన్‌ దేవాలయం తమ గ్రామానిదేనని, ఇప్పుడు కొత్తగా బస్వాపూర్‌కు చెందిన కొందరు ఆలయంపై పెత్తనం చేయాలని చూస్తున్నారని శ్రీ సిద్ధరామేశ్వరనగర్‌కు చెందిన పలువురు యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. గుడి తమ గ్రామానిదేనని ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం గ్రామంలోని వాటర్‌ ట్యాంక్‌పైకి ఎక్కి నిరసన తెలిపారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఐదుగురు యువకులు వాటర్‌ ట్యాంక్‌ పైకి ఎక్కి తహసీల్దార్, ఎంపీడీవోలు ఆలయం శ్రీ సిద్దరామేశ్వరనగర్‌కే చెందుతుందని లిఖిత పూర్వకంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ వెంకన్న, ఎంపీడీవో అనంత్‌రావు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులు తహసీల్దార్, ఎంపీడీవోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ గ్రామానికి చెందిన పుట్టకొక్కుల వెంకటేశం, బోయిని లక్ష్మవ్వలు 16 గుంటల భూమిని శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి విరాళంగా ఇచ్చారని, ఆ స్థలం శ్రీ సిద్ధరామేశ్వరనగర్‌ గ్రామానికి చెందిందే అని పేర్కొన్నారు. ఇటీవల భూ రికార్డులను బస్వాపూర్‌కు చెందిన కొందరు తారుమారు చేయించారని ఆరోపించారు. దేవాలయ భూమి, దేవాలయ ప్రాంగణం, శ్రీ సిద్ధరామేశ్వనగర్‌కు చెందిందేనని లిఖితపూర్వకంగా రాసివ్వాలని డిమాండ్‌ చేశారు. నాలుగు గంటల పాటు ఆందోళన కొనసాగింది. తహసీల్దార్, ఎంపీడీవోలు ఉన్నతాధికారులతో మాట్లాడి హనుమాన్‌ ఆలయం శ్రీ సిద్ధరామేశ్వరనగర్‌కే చెందేవిధంగా చూస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ సరిహద్దులను కూడా శ్రీ సిద్ధరామేశ్వరనగర్‌లో భాగంగానే చూపిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు.

మరిన్ని వార్తలు