హత్య కేసులో అనుమానితుడు బలవన్మరణం

18 Jun, 2015 17:44 IST|Sakshi

మెదక్ (జోగిపేట) : మెదక్ జిల్లా జోగిపేటలో గత నెల జరిగిన హత్య కేసులో అనుమానితుడుగా ఉన్న హతుడి సోదరుడు నర్రా పెంటయ్య(35) గురువారం చెట్టుకు వేలాడుతూ కనిపించడం స్థానికంగా సంచలనం రేపింది. గత నెల 29వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు నర్రా ఆంజనేయులు(30)ను నిద్రస్తున్న చోటనే కిరాతకంగా నరికి హత్య చేసారు. ఆంజనేయులుకు సంబంధించిన వ్యక్తులు.. ఆంజనేయులు సోదరుడు పెంటయ్యకు హత్య ఎవరు చేసారో తెలుసునని, అతడిపై అనుమానం ఉందని పోలీసులకు తెలుపడంతో గత శని, ఆదివారం రోజుల్లో పెంటయ్యను స్టేషన్‌కు పిలిపించి హత్యకు సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే చెప్పాలని ప్రశ్నించి వదిలేశారు. అయితే పెంటయ్య ఈనెల 15వ తేదిన ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. కాగా గురువారం ఇంటికి దగ్గరలోని చింతచెట్టుకు పెంటయ్య మృతదేహం వేలాడుతూ కనిపించింది. గురువారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో మృతుడి తల్లి రత్నమ్మ పశువుల పాక వద్దకు వెళ్లగా పెంటయ్య చెట్టుకు వేలాడుతూ కనిపించడంతో ఆమె వెంటనే ఇరుగు, పొరుగు వారికి తెలియజేసింది. పోలీసులకు కూడా సమాచారం తెలియడంతో సీఐ వి.నాగయ్య, ఎస్‌ఐ శ్రీనివాస్‌లు సంఘటనాస్థలం  వద్దకు చేరుకున్నారు. సంఘటన స్థలంలో ఖాళీ బీరు బాటిల్, సీల్‌తో ఉన్న గుళికల పాకెట్‌ను గుర్తించారు.

అప్పుల బాధతోనే నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు :  భార్య ఫిర్యాదు

గత నెల పెద్ద కూతురు వివాహాం చేయడంతో ఆర్ధిక ఇబ్బందులు, అదే నెలలో సోదరుడు ఆంజనేయులు మృతితో మానసికంగా వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య సుశీల జోగిపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పులు పెరిగిపోవడంతో ప్రతి రోజు ఆలోచించి ఆందోళనకు గురయ్యేవాడని ఫిర్యాదులో పేర్కొంది. సోదరుడి మరణం కూడా ఆయనను బాగా ఇబ్బందులకు గురి చేసిందని తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా