కరోనా భయం.. మానవత్వం దూరం

11 Jun, 2020 11:51 IST|Sakshi

ప్రయాణంలో అస్వస్థతకు గురై వ్యక్తి మృతి

చేగుంట(తూప్రాన్‌): కరోనా భయం..మానవత్వాన్ని దూరం చేసింది. కళ్ల ముందే గంట సేపు ఒక మనిషి ప్రాణాలకోసం విలవిలలాడుతున్నా ఒక్కరు కూడా దగ్గరకి వెళ్లలేదు. ఈ హృదయ విదారక సంఘటన మెదక్‌ జిల్లా చేగుంట ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రామాయంపేట నుంచి సికింద్రాబాద్‌కు ఆర్టీసీ బస్సులో వెళ్తున్న శ్రీనివాస్‌బాబు(50)కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో చేగుంట ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో బస్సులోంచి కిందికి దిగి అక్కడే పడిపోయాడు. (గాంధీ ఆస్పత్రిలో జూడాల ఆందోళన)

ఇది గమనించిన స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందికి సమాచారం అందించారు. డాక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో అతని వద్దకు ఎవరూ వెళ్లలేదు. దీంతో శ్రీనివాస్‌బాబు అక్కడే విలవిల్లాడుతూ మృతి చెందాడు. మృతుడికి కరోనా లక్షణాలు ఉండవచ్చుననే అనుమానంతో బస్సులోంచి దింపేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. అలాగే అతన్ని తరలించేందుకు 108 అంబులెన్స్‌ వచ్చినా తీసుకెళ్లేందుకు నిరాకరించారు. నేరెడ్‌మెట్‌కు చెందిన శ్రీనివాస్‌బాబు బంధువులకు సమాచారం అందిస్తే ఆయనకు ఆస్తమా ఉందని అప్పుడప్పుడూ అదేసమస్యతో బాధపడుతున్నాడని ఫోన్‌లో సమాధానం తెలిపారు. సాయంత్రం మృతుడి బంధువులు సంఘటనా స్థలానికి వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది మృతదేహాన్ని పంపించారు.

మరిన్ని వార్తలు