భార్యలేని జీవితం దేనికని..

20 Apr, 2017 10:37 IST|Sakshi

చేవెళ్ల: భార్య ఆత్మహత్యపై మనస్థాపం చెందిన ఓ వ్యక్తి.. ఆమె లేని జీవితం తనకూ వద్దని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన  చేవెళ్లలో  చోటు చేసుకుంది.  పోలీసులు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు(23)కు ఏడాది క్రితం వివాహమైంది. కుటుంబంలో వచ్చిన మనస్పర్థలతో పెళ్లైన కొన్ని రోజులకే భార్య ఆత్మహత్య చేసుకుంది. దీంతో అంజనేయులు తన తల్లి చంద్రమ్మతోపాటు కొన్ని రోజుల కిత్రం చేవెళ్లకు వచ్చి హౌసింగ్‌బోర్డు కాలనీలో అద్దెకు ఉంటున్నాడు.

తాపీమేస్త్రీ వద్ద  కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇదిలా ఉండగా మంగళవారం ఎప్పటిలాగే పనికి వెళ్లిన అతడు మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. అంతకుముందు రోజు గ్రామానికి వెళ్లిన అతని తల్లి మంగళవారం రాత్రి ఇంటికి వచ్చి చూడగా లోపలి నుంచి గడియ పెట్టి ఉంది.  దీంతో ఇరుగుపొరుగువారికి చెప్పటంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం  చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  భార్య మృతి చెందడాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాని సూసైడ్‌నోట్‌ మృతుడి జేబులో లభించిందని, మనస్థాపంతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు