ఇంజక్షన్‌ వికటించి వ్యక్తి మృతి

7 Feb, 2019 09:18 IST|Sakshi
మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి వద్ద మృతుని బంధువుల ఆందోళన శివకుమార్‌ (ఫైల్‌)

మారేడుపల్లి : ఛాతి నొప్పితో ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తికి చేసిన ఇంజక్షన్‌ వికటించి మృతి చెందాడు. ఈ సంఘటన మారేడుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. మారేడుపల్లి సీఐ శ్రీనివాసులు తెలిపిన మేరకు.. అడ్డగుట్ట వడ్డెర బస్తీకి చెందిన శివకుమార్‌ (33) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు చైత్ర (6), రితిక్‌సాయి (4) ఉన్నారు.  బుధవారం ఉదయం 8:30 గంటల సమయంలో ఛాతీలో నొప్పితో పాటు కడుపులో మంటగా ఉందని వెస్ట్‌ మారేడుపల్లిలోని చెందిన గీతా మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి (గీతానర్సింగ్‌హోమ్‌)కు వచ్చాడు. శివకుమార్‌ను పరీక్షించిన డ్యూటీ డాక్టర్‌ స్రవంతి ఈసీజీ పరీక్షల అనంతరం ఇంజక్షన్‌ ఇచ్చింది. ఇంజక్షన్‌ ఇచ్చిన కొద్దిసేపటికే శివకుమార్‌ మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న మృతుని బంధువులు ఆస్పత్రికి తరలివచ్చి వైద్యుల నిర్లక్ష్యంతోనే శివకుమార్‌ మృతిచెందాడని ఆరోపిస్తూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.  దీంతో ఆస్పత్రి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు  మొహరించారు.  మహంకాళి ఏసీపీ వినోద్‌కుమార్‌ యాదవ్, మారేడుపల్లి సీఐ శ్రీనివాసులు, డీఐ పద్మలు మృతుని బంధువులతో చర్చించారు. మృతునికి నష్టపరిహారం చెల్లించాల్సిందిగా మృతుని బంధువులతో పాటు స్థానిక నాయకులు డిమాండ్‌ చేశారు. దీంతో మృతుని బంధువులు ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు