తండ్రి కాటికి.. తల్లి ఆసుపత్రికి..

3 Apr, 2018 10:21 IST|Sakshi
తల్లి మృతదేహాన్ని చూసి రోదిస్తున్న కుమార్తెలు, బంధువులు

 మిన్నంటిన రోదనలు

 తీవ్ర గాయాలతో కడచూపు  కోసం వచ్చిన భార్య

 భర్త మృతదేహం వద్ద విలపిస్తున్న శారద

సాక్షి,వేమనపల్లి(బెల్లంపల్లి): ఆదివారం సాయంత్రం సిరొంచలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. హైదరాబాద్, వరంగల్‌లో పట్టణాల్లో ఉండి చదువుకుంటున్న కూతురు సుష్మ, కుమారుడు ప్రణీత్‌కు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. లైన్‌మెన్‌గా పనిచేస్తున్న వేమునూరి రమేశ్‌రెడ్డి మృతి చెందగా, ఆయన భార్య శారదను స్థానికులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేర్చారు. దహన సంస్కారాలకు ఆయన మృతదేహాన్ని స్వగ్రామం నీల్వాయికి తరలించారు.

శారద నడవలేని స్థితిలో ఉండి కూడా ఆసుపత్రి నుంచి భర్త కడచూపు కోసం నీల్వాయికి వచ్చింది. భర్త మృతదేహం పక్కనే గాయాలతో ఆమె కదల్లేని స్థితిలో విలపించడం పలువురిని కలచివేసింది. నిత్యం ఫోన్‌లో యోగక్షేమాలు తెలుసుకునే తమ తండ్రి ఇకలేడనే విషయం తెలిసిన చిన్నారులు గుండెలవిసేలా రోదించారు. ఆ దృశ్యాలు అక్కడున్న జనం గుండెలను పిండేశాయి.

తొమ్మిదో తరగతి చదువుతున్న కుమారుడు ప్రణీత్‌ తండ్రికి అంతిమ సంస్కారాలు చేశాడు. అనంతరం శారదను ఉన్నత వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. జెడ్పీటీసీ ఆర్‌.సంతోశ్‌కుమార్, ఏఎమ్‌సీ వైస్‌చైర్మన్‌ కోళి వేణుమాధవ్, ఎంపీపీ కుర్రువెంకటేశ్, సర్పంచ్‌లు మల్లిక, కుబిడే వెంకటేశ్‌ తదితర నాయకులు, సహచర ఉద్యోగులు, బంధుమిత్రుల అశ్రు నయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. రమేశ్‌రెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటామని డీఈ నాగేశ్వర్‌రావు తెలిపారు.

 

మరిన్ని వార్తలు