పొట్టకూటి కోసం వెళ్లి..

26 Jan, 2019 11:34 IST|Sakshi
సింగం రాములు (ఫైల్‌)

నమ్ముకున్న కులవృత్తి ఆసరా కాలేదు.. ఆర్థిక ఇబ్బందులతో పూటగడవమే దైన్యంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో భార్యాబిడ్డలను పోషించుకునేందుకు ఆ నేతన్న మరో పని చేయాలని నిర్ణయించుకున్నాడు. పొట్టకూటి కోసం లారీ క్లీనర్‌గా వెళ్లిన మరుసటి రోజే అనుకోని ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు. దీంతో మునుగోడులో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. 

మునుగోడు : మండల కేంద్రానికి చెందిన సింగం రాములు(45) వృత్తిరీత్యా చేనేత కార్మికుడు. మగ్గం నేస్తూ భార్యాబిడ్డలను పోషించుకునేవాడు. కులవృత్తికి ఆదరణ తగ్గడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. పూట గడవడమే గగనంగా మారింది. భార్యాపిల్లలను పస్తులుంచలేక లారీ క్లీనర్‌గా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. 

వెళ్లిన మరుసటి రోజే..
రాములు గత సోమవారం తెలిసిన వారి లారీపై క్లీ నర్‌గా కుదిరాడు. లారీపై ఖమ్మంజిల్లాకు వెళ్లాడు. అక్కడ  గత మంగళవారం చెరుకును లోడ్‌ చేసుకుని ఓ ఫ్యాక్టరీలో అన్‌లోడ్‌ చేసేందుకు బయలుదేరారు. మార్గమధ్యలో లారీని ఆపి డ్రైవర్‌తో పాటు క్లీనర్‌ రాములు కలిసి కిరోసిన్‌ స్టౌవ్‌పై భోజనం వండుకుంటున్నారు.ఈక్రమంలో స్టౌవ్‌లో గాలికొ డుతుండగా అకస్మాత్తుగా కిరోసిన్‌ రాములు ఒంటిపై పడడంతో మంటలంటుకుని తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన డ్రైవర్, చుట్టుపక్కల వారి సహాయంతో ఖమ్మం జిల్లాలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. రాములు అక్కడ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృత్యువాత పడ్డాడు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న రాములు మృతిచెందడంతో ఆ కుటుంబం వీధినపడింది. పిల్లలను సాకేదెట్టా దేవుడా అంటూ రాములు భార్య గుండెలవిసేలా రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.

మరిన్ని వార్తలు