కరోనా టెస్ట్‌ చేయలేదని నానా హంగామా

24 Jun, 2020 10:01 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి : బాన్సువాడ పట్టణంలోని చైతన్య కాలనీకి చెందిన ఒక మహిళ(62) కరోనా బారిన పడింది. కాగా కరోనా పాజిటివ్‌ వచ్చిన మహిళ కుమారుడు బాన్సువాడ పోలీస్‌ స్టేషన్‌కు రావడంతో పోలీసులు ఆందోళన చెందారు. తనకు కరోనా వచ్చిందని, టెస్టులు చేయడం లేదని ఆమె కుమారుడు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి హంగామా సృష్టించాడు. దీనిపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తూ స్థానిక వైద్యులకు సమాచారం ఇచ్చి ఆమె కుమారుడిని పరీక్ష నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా బాన్సువాడ పోలీస్‌స్టేషన్‌ ఎదుట బారీకేడ్లు ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్‌ను మూసివేశారు.అయితే దీనిపై మహేశ్‌ గౌడ్‌ మాట్లాడుతూ..అనుమానితులు నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వస్తుండడంతో ప్రధాన ద్వారం వద్ద బారికేడ్లను ఏర్పాటు చేయించామన్నారు. పోలీస్‌స్టేషన్‌లో శానిటైజర్లను అందుబాటులో ఉంచామన్నారు. బాధితులు ఎవరు వచ్చినా మాస్కులు ధరించి, శానిటైజ్‌ చేసుకున్నాకే లోపలికి రావాలని సూచిస్తున్నామని పేర్కొన్నారు.
(భారత్‌: ఒక్కరోజే 15968 పాజిటివ్‌ కేసులు)

ఎలా వచ్చిందో.. 
కరోనా వచ్చిన మహిళ వారం క్రితం తన చిన్న కుమారుడికి వైద్యం నిమిత్తం హైదరాబాద్‌ సూరారంలోని ఓ ఆస్పత్రికి ఆర్టీసీ బస్సులో వెళ్లింది. అక్కడ ఆమెకు ఛాతీ నొప్పి రావడంతో వైద్యులు ఇన్‌పేషెంట్‌గా చేర్చుకుని చికిత్స అందించారు. కరోనా పరీక్షలు కూడా చేశారు. మంగళవారం ఉదయం ఆమె తన ఇద్దరు కుమారులు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కారులో బాన్సువాడకు వచ్చింది. మధ్యాహ్నం సూరారంలోని ఆస్పత్రి నుంచి వైద్యు డు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. వెంటనే పోలీస్‌ స్టేషన్‌లో, ఏరియా ఆస్పత్రిలో రిపోర్టు చేయాలని సూచించారు. పోలీసులకు ఈ విషయం తెలియడంతో ఆమె పెద్ద కుమారుడిని పట్టణంలోని పోలీ స్‌ స్టేషన్‌కు పిలిపించారు. స్థానిక వైద్యులకు సమాచారం ఇచ్చి, కుటుంబ సభ్యులను పరీక్ష నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా కరోనా వచ్చిన మహిళ బాన్సువాడలో ఎవరినీ కలవలేదని, కుటుంబ సభ్యులు మాత్రమే ప్రథమ కాంటాక్ట్‌లో ఉన్నారని అధికారులు గుర్తించారు. పాజిటివ్‌ వచ్చిన మహిళతో పాటు ఏడుగురు కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌లో ఉంచారు. (క‌రోనా లేద‌ని నిరూపించ‌లేక 965 కి.మీ‌..)

18 మందికి నెగెటివ్‌.. 
కాగా జిల్లాపై కరోనా పంజా విసిరింది. ఒకే రోజు పది మంది పాజిటివ్‌ వచ్చింది. దీంతో కోవిడ్‌ కేసుల సంఖ్య 34కు చేరింది. ఇందులో 12 మంది రెండు నెలల క్రితమే కోలుకుని ఇంటికి చేరారు. 22 మంది చికిత్స పొందుతున్నారు.  జిల్లాకేంద్రం నుంచి ఆదివారం 24 మంది రక్త నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. వాటి ఫలితాలు మంగళవారం వచ్చాయి. ఆరు పాజిటివ్‌ రాగా.. 18 నెగెటివ్‌ వచ్చాయి. కామారెడ్డి పట్టణంలోని అశోక్‌నగర్‌కాలనీలో నివసించే 72 ఏళ్ల వ్యక్తికి, వాసవినగర్‌లో నివసించే 37 ఏళ్ల వ్యక్తికి, ఆజంపురాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తికి, బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తికి, సదాశివనగర్‌ మండల కేంద్రానికి చెందిన 52 ఏళ్ల వ్యక్తితోపాటు 48 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌ తెలిపారు. వీరందరూ శనివారంనాటి పాజిటివ్‌ కేసుల ప్రైమరీ కాంటాక్ట్‌లని పేర్కొన్నారు. జనగామ కేసును హైదరాబాద్‌కు రిఫర్‌ చేయగా మిగతా వారిని హోం క్వారంటైన్‌లో ఉంచామన్నారు. కరోనా బాధితుల ప్రైమరీ కాంటాక్ట్‌ల వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు.  

ఆశోక్‌నగర్‌కాలనీలో మరొకరికి.. 
పట్టణంలోని అశోక్‌నగర్‌ కాలనీలో నివసించే ఓ వ్యక్తి హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగం  చేస్తున్నా రు. ఆయన అక్కడే ఉంటూ వారానికోసారి కామా రెడ్డి వచ్చి వెళ్తుంటారు. అనారోగ్యానికి గురికావడంతో ఆయన ఆదివారం హైదరాబాద్‌లో కరోనా పరీక్ష చేయించుకోగా.. మంగళవారం పాజిటివ్‌ వచ్చింది. ఆయన భార్య జిలాలో ఏఎన్‌ఎంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌లో ఉంచారు. 

మరిన్ని వార్తలు