హోం క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి మృతి

6 Apr, 2020 12:16 IST|Sakshi
అంత్యక్రియల కోసం మృతదేహాన్ని వాహనంలో తరలిస్తున్న వైద్య సిబ్బంది

మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌): హోం క్వారంటైన్‌లో ఉన్న ఓ వ్యక్తి (48) శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు. మోపాల్‌ మండలంలోని కంజర్‌ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు, వైద్యాధికారుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వ్యక్తి ఉపాధి కో సం గతంలో గల్ఫ్‌కు వెళ్లాడు. మార్చి 23వ తేదీన స్వగ్రామమైన కంజర్‌కు తిరిగి వచ్చాడు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అతడు గ్రామానికి చేరుకున్నాడన్న విషయం తెలుసుకున్న వైద్యాధికారులు 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

ప్రతి రోజు వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లు వచ్చి అతడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం తనకు ఛాతిలో నొప్పి వస్తుందని ఇంటికి వచ్చిన వైద్య సిబ్బందితో చెప్పగా, వారు మాత్రలను అందజేశారు. అదేరోజు అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. వాస్తవానికి ఆదివారంతో ఆయనకు విధించిన 14 రోజుల హోం క్వారంటైన్‌ గడువు ముగియనుంది. అయితే చివరి రోజు మరణించడంతో కరోనా సోకి మృతి చెంది ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు కరోనా సోకిన వారి మాదిరిగానే మృతదేహాన్ని కవర్లతో చుట్టేసి, రసాయనాలు చల్లి అంత్యక్రియలు నిర్వహించడం వారి అనుమానాలకు బలం చేకూర్చింది. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

గుండెపోటుతోనే మృతి..
హోం క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి గుండెపోటుతోనే మృతి చెందినట్లు వైద్యాధికారి డాక్టర్‌ నవీన్‌ తెలిపారు. ప్రతిరోజు వైద్య సిబ్బంది ఆయన ఆరోగ్య పరిస్థితిని పరీక్షించే వారని, ఎలాంటి కరోనా లక్షణాలు కన్పించలేవని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాలనుసారం హోం క్వారంటైన్‌లో ఉండటం వల్ల కరోనా సోకిన వారికి ఎలాగైతే అంత్యక్రియలు నిర్వహిస్తారో అలాగే పూర్తి చేశామని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల రక్త నమూనాలు సేకరించాలని ఉన్నతాధికారులు ఆదేశించారని తెలిపారు. 

మరిన్ని వార్తలు