దేవలక్ష్మిని పెళ్లి చేసుకున్న రాజు

13 Jul, 2019 10:42 IST|Sakshi
దేవలక్ష్మి–రాజుకు పెళ్లి జరిపించిన గ్రామపెద్దలు

చిన్నబోనాల  ఘటనలో యువతికి న్యాయం 

శుక్రవారం వివాహం జరిపించిన గ్రామపెద్దలు 

సాక్షి, సిరిసిల్ల: సమాజంపై సరైన అవగాహన లేని పిచ్చితల్లిని లోబర్చుకుని గర్భవతిని చేసిన ప్రబుద్ధుడు తన తప్పు తెలుసుకున్నాడు. ఐదురోజులుగా పిచ్చితల్లి పడుతున్న బాధను గ్రామపెద్దలు అర్థం చేసుకుని న్యాయం చేయడానికి ముందుకొచ్చారు. శుక్రవారం ఇరువురికి పెళ్లి జరిపించారు. చిన్నబోనాలలో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగించే ఇండ్ల నర్సయ్య–వజ్రవ్వలకు కూతురు దేవలక్ష్మి(22) ఉంది. చిన్ననాటి నుంచి దేవలక్ష్మి కాస్త మతిస్థిమితం కోల్పోయి ఉండేది.

ప్రతిరోజు ఇంటిలో వారందరూ కూలీ పనులకు వెళ్లడం గమనించి స్థానికంగా ఉండే రాజు ఆమె పై కన్నేశాడు. మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. గర్భం దాల్చడంతో విషయం బయటకు రాకుండా జాగ్రత్త తీసుకున్నాడు. ఈనెల 7న దేవలక్ష్మి బాతురూం వెళ్లిన క్రమంలో వచ్చిన నొప్పులకు శరీరంలో పాపను తానే బయటకు తీసుకుంది. గర్భం అంటే ఏందన్న విషయం కూడా అవగాహన లేని దేవలక్ష్మి చేష్టలతో పురిట్లోనే శిశువు మృతిచెందింది. విషయం బయటకు రావడంతో పోలీసులు విచారణ చేపట్టగా.. గ్రామ పెద్దలు సైతం ముందుకొచ్చారు. రాజుతో మాట్లాడి శుక్రవారం ఇద్దరికి పెళ్లి చేసి ఒక్కింటివారిని చేసి ఆశీర్వదించారు. దేవలక్ష్మికి వివాహం జరిపించి, న్యాయం చేసిన సిరిసిల్ల మాజీ వైస్‌ ఎంపీపీ చల్ల హరికృష్ణ, ఏఎంసీ డైరెక్టర్‌ బండారి శ్యాంకు ఆమె తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.  

మరిన్ని వార్తలు