క్యాన్సర్‌ సోకిందని కన్న తండ్రిని..

24 Jul, 2019 08:45 IST|Sakshi
మృతదేహాన్ని ఆటోలో ఇంటికి తీసుకెళ్తున్న కుటుంబ సభ్యులు

ఇంటి నుంచి బయట వదిలిపెట్టిన కుటుంబసభ్యులు

వ్యాధి ముదిరి మృత్యుఒడికి చేరిన వైనం

జడ్చర్ల: చిన్నప్పటి నుంచి ఆలనా పాలనా చూసిన తండ్రికి క్యాన్సర్‌ సోకితే వెన్నంటి ఉండి వైద్యం చేయించాల్సింది పోయి.. అవగాహన లేక ఇంటికి తమకూ ఆ వ్యాధి సోకుతుందంటూ ఇంటికి దూరంగా వదిలిపెట్టారు. ఓ వైపు జబ్బు.. మరో వైపు కుటుంబసభ్యులు ఎవరూ పక్కన లేరనే క్షోభతో చివరికి ఓ తండ్రి తనువు చాలించిన అమానవీయమైన సంఘటన మంగళవారం బాదేపల్లి పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. స్థానిక శ్రీరాంనగర్‌ కాలనీకి చెందిన వెంకటయ్య(65) క్యాన్సర్‌ వ్యాధికి గురయ్యాడు. ఇతని భార్య కొన్నేళ్ల క్రితమే మృతిచెందగా కుమారుడు రాజు, కోడలు పద్మ ఉన్నారు. వీరు మున్సిపల్‌ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. కాగా వెంకటయ్య మెడపై గల క్యాన్సర్‌ గడ్డ ఇటీవల పగలడంతో 15 రోజుల క్రితం ఇంటికి దూరంగా అతనిని స్థానిక ప్రభుత్వ గోదాముల దగ్గర గల పాడుబడిన కార్యాలయ గదిలో అతని కుమారుడు విడిచి వెళ్లాడు.

నిత్యం చుట్టుపక్కల వారు లేదా కుమారుడు అతనికి కావాల్సిన ఆహారం, బీడీలు ఇచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఆయన మృతిచెందాడు. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా తన తండ్రి క్యాన్సర్‌కు గురికావడంతో ఆ వ్యాధి తమకు సోకుతుందని చుట్టుపక్కల వారు అభ్యంతరం చెప్పడంతో ఇంటి నుంచి దూరంగా తీసుకెళ్లానని కుమారుడు రాజు ఈసందర్భంగా పేర్కొనగా.. కుటుంబసభ్యుల ఒత్తిడి మేరకు అతనే తన తండ్రిని దూరంగా పెట్టాడని కాలనీవాసులు తెలిపారు. ఏదిఏమైనా వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడం, చివరి సమయంలో కన్న తండ్రిని దూరంగా పెట్టడం అమానవీయమని పలువురు పేర్కొన్నారు. 
ఆర్థిక సహాయం అందజేత
మృతుడు వెంకటయ్య కుటుంబానికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సహకారంతో రూ.5వేలు ఆర్థిక సహాయాన్ని యార్డు చైర్మెన్‌ మురళి, నాయకులు పరమటయ్య, శేఖర్, చైతన్య, హరి, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు