ఆడవారు..ఐతే..!

7 Oct, 2014 01:10 IST|Sakshi

 గోదావరిఖని (కరీంనగర్) : సింగరేణి సంస్థ తొలినాళ్లలో పురుషులతో సమానంగా మహిళా కార్మికుల నియామకాలుండేవి. కాలక్రమంలో మహిళా కార్మికులు బొగ్గు ఉత్పత్తి పనులు చేయలేరని భావించిన యాజమాన్యం కొన్నేళ్ల క్రితమే వారి నియామకాలను నిలిపివేసింది. కేవలం పురుషులకు మాత్రమే వివిధ రకాల పరీక్షలు నిర్వహించి నియామకాలు చేసేవారు.

అరతే కార్మికులు అనుకోని విధంగా ప్రమాదాలకు గురైతే వారి కుటుం బాలు రోడ్డున పడకుండా నెలకు కొంత డబ్బు  ఇవ్వడం, లేక ఉద్యోగావకాశం కల్పించడం చేశారు. ఇలా తమ పిల్లలను పోషించుకునేందుకు మహిళలు సింగరేణిలో ఉద్యోగాల్లో చేరారు. మొదట వారిని కార్యాలయాల్లో ఫ్యూన్లుగా తీసుకోగా ఆ తర్వాత ఎస్‌అండ్‌పీసీ విభాగం కిందకు మరికొంత మందిని తీసుకుని గనులు, డిపార్ట్‌మెంట్ల వద్ద రక్షణ బాధ్యతలు అప్పగించారు. మరికొంత మందిని గుట్కాల (గనుల్లో వాడే మట్టివద్దలు) తయారీ కోసం వినియోగిస్తున్నారు.

ఇలా సాగుతున్న క్రమంలో కొందరు మహిళలను సీఎస్‌పీలలో బెల్ ్టపైనుంచి పడిన బొగ్గును ఏరివేసే పని అప్పగించారు. మొదట్లో ఈ పని సులువని భావించిన చాలా మంది మహిళలు సీఎస్‌పీలలో విధులు నిర్వహించారు. కానీ రానురాను ఈ పని వల్ల మహిళా కార్మికుల ప్రాణాలకే ముప్పు ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. కోల్ స్క్రీనింగ్ లేదా కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లలో బొగ్గుతో కూడిన బెల్ట్ నడుస్తున్న క్రమంలో ఏర్పడే దుమ్ము వారి ఊపిరితిత్తులలోకి వెళ్లి అనారోగ్యానికి గురిచేస్తున్నది. ఇదంతా ఒక ఎత్తయితే బెల్ట్ కింద పడిన బొగ్గును చెమ్మాస్ ద్వారా పైకి ఎత్తి బెల్ట్‌పై పోయాలని అధికారులు ఆదేశించడంతో వారు ఆ పనిచేయలేక సతమతమవుతున్నారు.

 సత్తువను కూడగట్టుకుని మగవారిలాగే మహిళా కార్మికులు బొగ్గు దుమ్ములో పనిచేయూల్సిన పరిస్థితి ఏర్పడింది. దుమ్ము నుంచి రక్షించుకోవడానికి కనీసం వారికి మాస్కులు కూడా యాజమాన్యం ఇవ్వడం లేదు. ఇదిలా ఉండగా దుమ్ములో పనిచేసే కార్మికురాళ్ళకు ప్లేడే కూడా యాజమాన్యం కల్పించకుండా వారి పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నది. ఐఈడీ నిబంధనల ప్రకారం సీఎస్‌పీలలో కార్మికుల సంఖ్య పెంచాలని ఉన్నప్పటికీ యాజమాన్యం ఆ మేరకు కార్మికులను భర్తీ చేయడం లేదు. ఈ కారణం వల్లనే మహిళా కార్మికులతో పురుషులు చేసే పనులు చేరస్తున్నట్లు తెలుస్తున్నది.

ఇప్పటికైనా మహిళా కార్మికురాళ్ళను మానవతా దృక్పథంతో ఆలోచించి వారిని కార్యాలయాల్లో లేక ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తించేలా చూడాలని పలువురు కోరుతున్నారు. లేదంటే కోల్‌ఇండియాలో అమలు చేస్తున్నట్లుగా వీఆర్‌ఎస్ ఇచ్చి తమ వారసులకు ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని మహిళా కార్మికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు