తీన్‌మార్‌!

17 Nov, 2018 14:46 IST|Sakshi

నియోజకవర్గం ఏర్పడిన నుంచి త్రిముఖ పోటీనే.. 

ఐదు నియోజకవర్గాలు విడిపోయి.. 

2009లో ఏర్పడిన మానకొండూర్‌(ఎస్సీ)..

ప్రస్తుతం మూడు జిల్లాలతో అనుబంధం 

తలోమారు పీఠం అధిష్టించిన కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ 

ఈ సారి అదృష్టం ఎవరిని వరించేనో..? 

మానకొండూర్‌(ఎస్సీ) నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఇదివరకు కమలాపూర్, హుజూరాబాద్, ఇందుర్తి, నేరెళ్ల, కరీంనగర్‌ నియోజకవర్గాల్లో ఉన్న శంకరపట్నం, మానకొండూర్, తిమ్మాపూర్, ఇల్లంతకుంట, బెజ్జంకి(గన్నేరువరం) మండలాలను కలుపుకుని ఈ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గం ఏర్పడకముందు పలువురు మహామహులు పాలించిన ఇప్పటి మానకొండూర్‌లో 2009నుంచి త్రిముఖ పోరు ఉంది. తొలిఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ నుంచి ఆరెపల్లి మోహన్‌ గెలిచారు. 2014లో టీఆర్‌ఎస్‌ తరఫున రసమయి బాలకిషన్‌ ఎన్నికయ్యారు. బీజేపీ నుంచి గడ్డం నాగరాజు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.                  

ఐదు నియోజకవర్గాల మానకొండూర్‌
2009 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు మానకొండూర్‌ మండలంలోని 9 గ్రామాలు కమలాపూర్‌ నియోజకవర్గంలో ఉండేవి. 16 గ్రామాలు కరీంనగర్‌ నియోజకవర్గంలో ఉన్నాయి. శంకరపట్నం మండలంలోని 13 గ్రామాలు కమలాపూర్‌లో, 7గ్రామాలు హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఉండేవి. తిమ్మాపూర్‌ మండలంలోని మొగిలిపాలెం ఇందుర్తి నియోజకవర్గంలో ఉండేది. మిగితా 19గ్రామాలు కరీంనగర్‌ నియోజకవర్గంలో ఉన్నాయి. (పూర్వపు) బెజ్జంకి మండలం మొత్తం ఇందుర్తి నియోజకవర్గంలో, ఇల్లంతకుంట మండలం నేరెళ్ల నియోజకవర్గంలో కలిసి ఉండేది. 

ప్రముఖులు ఏలిన ప్రాంతం.. 
ప్రస్తుత మానకొండూర్‌ గత ఐదు నియోజకవర్గాల్లో ఉన్నప్పుడు ప్రముఖుల చేత పాలించబడింది. కరీంనగర్‌ నుంచి చొక్కారావు, ఆనందరావు, ఎం.సత్యనారాయణరావు, కఠారి దేవేందర్‌రావు, నలుమాచు కొండయ్య మానకొండూర్, తిమ్మాపూర్‌ మండలాలకు ప్రాతినిథ్యం వహించారు. మానకొండూర్‌లోని 9 గ్రామాలు, శంకరపట్నంలోని 13 గ్రామాలను కమలాపూర్‌ నియోజకవర్గం నుంచి కేవీ. నారాయణరెడ్డి, పి. జనార్ధన్‌రెడ్డి రెండుసార్లు పాలించారు. టీడీపీ ఎమ్మెల్యేగా ముద్దసాని దామోదర్‌రెడ్డి 20ఏళ్లు ఈ ప్రాంతాలను ఏలారు. తాజా మాజీ హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కమలాపూర్‌ నుంచి రెండు పర్యాయాలు సేవలందించారు. గత ఇందుర్తి నియోజకవర్గంలో ఉన్న పూర్వపు బెజ్జంకి మండలం, తిమ్మాపూర్‌ మండలం లోని మొగిలిపాలెం గ్రామానికి సీపీఐ నుంచి దేశిని చినమల్లయ్య నాలుగుసార్లు ప్రాతినిథ్యం వహించగా, చాడ వెంకటరెడ్డి 2004లో గెలుపొందారు. కాంగ్రెస్‌ నుంచి బొమ్మా వెంకటేశ్వర్లు, బొప్పరాజు లక్ష్మీకాంతారావు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నేరెళ్ల నియోజకరవర్గానికి అనుబంధంగా ఉన్న ఇల్లంతకుంట మండలానికి గొట్టె భూపతి, సుద్దాల దేవయ్య, కాసీపేట లింగయ్య ఎమ్మెల్యేలుగా సేవలందించారు. 

మూడు జిల్లాల పరిధిలో.. 
2009 పునర్విభజనలో భాగంగా మానకొండూర్‌ నియోజకవర్గం ఏర్పంది. తెలంగాణ ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్‌ జిల్లాల పునర్విభజన చేశారు. ప్రస్తుతం మానకొండూర్‌ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో ఉంది. మానకొండూర్, శంకరపట్నం, తిమ్మాపూర్, గన్నేరువరం మండలాలు కరీంనగర్‌ పరిధిలో ఉన్నాయి. బెజ్జంకి మండలం సిద్దిపేట జిల్లాలో ఉంది. ఇల్లంతకుంట మండలం రాజన్నసిరిసిల్ల పరిధిలోకి వెళ్లింది. 2018 ఎన్నికలు మాత్రం కరీంనగర్‌ జిల్లా అధికారుల పర్యవేక్షణలో జరుగనున్నాయి. 

ఆరెపల్లి.. సర్పంచ్‌ నుంచి విప్‌ వరకు 
మానకొండూర్‌ నియోజకవర్గ తొలి ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌ సర్పంచ్‌ నుంచి ప్రభుత్వ విప్‌ వరకు అనేక పదవులు అధిష్టించారు. 1988 నుంచి 2001 వరకు 19ఏళ్లు సర్పంచ్‌గా కొనసాగారు. తిమ్మాపూర్‌ నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొంది, 2007 నుంచి 2009 వరకు జెడ్పీ చైర్మన్‌గా పని చేశారు. 2009లో జరిగిన ఎన్నికల్లో మానకొండూర్‌ ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలి ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. 2014లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రసమయి చేతిలో ఓటమిపాలయ్యారు. 

ఎప్పుడూ త్రిముఖపోరే... 
మానకొండూర్‌ నియోజకవర్గం ఏర్పడిన 2009 నుంచి ప్రతీ ఎన్నికల్లోనూ ఇక్కడ త్రిముఖపోరు ఉంటోంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి ఆరెపల్లి మోహన్, టీఆర్‌ఎస్‌ నుంచి ఓరుగంటి ఆనందర్, పీఆర్‌పీ నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ పోటీ చేయగా ఆరెపల్లి మోహన్‌ విజయం సాధించారు. 2014లో కాంగ్రెస్‌ నుంచి ఆరెపల్లి మోహన్, టీఆర్‌ఎస్‌ నుంచి రసమయి బాలకిషన్, టీడీపీ నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ పోటాపోటీగా నిలవగా... రసమయి బాలకిషన్‌ విజయం సాధించారు. ఈ సారి ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ నుంచి ఆరెపల్లి, బీజేపీ నుంచి గడ్డం నాగరాజు ఇప్పటికే నామినేషన్‌ వేశారు. రసమయి బాలకిషన్‌ త్వరలో నామినేషన్‌ వేయనున్నారు. దీంతో ఈ 2018 ఎన్నికల్లోనూ మానకొండూర్‌లో ‘త్రిముఖ’పోరు ఉండనుందని ఇక్కడి ఓటర్లు చర్చించుకుంటున్నారు.

రసమయి.. ఉపాధ్యాయుడి నుంచి..  
రసమయి బాలకిషన్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుడి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. తెలంగాణ ఉద్యమకాలంలో ధూం ధాం కళాకారుడిగా పేరు సంపాదించి, ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. గుర్తించిన కేసీఆర్‌ రసమయిని 2014 ఎన్నికల్లో మానకొండూర్‌(ఎస్సీ) నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. భారీమెజార్టీతో గెలుపొంది, కేబినెట్‌ హోదాలో పనిచేశారు. 

తిరుగుబాటు గడ్డ.. 
మానకొండూర్‌ నియోజకవర్గం సాయుధ పోరాటాల వీరులకు నిలయంగా ఉంది. అనభేరి ప్రభాకర్‌రావు స్వగ్రామం తిమ్మాపూర్‌ మండలం పోలంపల్లి. బద్ధం ఎల్లారెడ్డి స్వగ్రామం ఇల్లంతకుంట మండలంలోని గాలిపల్లి. ఇదే మండలంలో 9.20లక్షల ఎకరాలకు సాగునీరందించే  24టీఎంసీ సామర్థ్యం ఉన్న ఎల్‌ఎండీ ప్రాజెక్టు ఉంది. బెజ్జంకి లక్ష్మినృసింహుడు, గట్టుదుద్దెనపల్లి ప్రసన్నాంజనేయస్వామి వారు ఇక్కడివారికి ప్రత్యేకం. 

మరిన్ని వార్తలు