మానస కేసు : ఒకరికి ఉద్యోగం, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు, తక్షణ న్యాయం..

14 Dec, 2019 20:53 IST|Sakshi

ప్రభుత్వ హామీతో దీక్ష విరమించిన మాసన తల్లి

దీక్షస్థలికి వెళ్లి హామినిచ్చిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌

హన్మకొండ: మానస తల్లి గాదం స్వరూప శనివారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ బాలసముద్రంలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ స్మృతి వనం వద్ద 8 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టినా ప్రభుత్వం స్పందించక పోవడంతో స్వరూప 9వ రోజు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. నవంబర్‌ 27న పుట్టిన రోజు సందర్భంగా గుడికి వెళ్లిన మానస.. అత్యాచారం, హత్యకు గురైన విషయం విదితమే. అనంతరం హైదరాబాద్‌లో దిశ ఘటన చోటుచేసుకుంది. 


(చదవండి : పరిచయం.. ప్రేమ.. అత్యాచారం.. హత్య )

అయితే.. దిశకు జరిగిన న్యాయం తన కూతురు విషయంలో జరగడం లేదని స్వరూప ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగి 18 రోజులు అవుతున్నా.. ప్రభుత్వం నుంచి స్పందన లేదంటూ సర్కారు తీరుపై ఆమె మండిపడ్డారు. న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. స్వరూపతో పాటు గొల్ల కురుమల నవ నిర్మాణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసరి నగేష్‌ యాదవ్, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి రుషికేష్వర్‌ రాజు దీక్షలో పాల్గొన్నారు.

ప్రభుత్వం హామీతో దీక్ష విరమణ..
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌ హామీతో మానస తల్లి గాదం స్వరూప దీక్ష విరమించారు. తన కూతురు చావుకు కారణమైన దోషులకు శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ స్వరూప గత 9 రోజులుగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ స్మృతి వనం వద్ద దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.  దీక్షాస్థలికి చేరుకున్న దాస్యం వినయ్ భాస్కర్‌ ప్రభుత్వం తరపున పూర్తి భరోసా ప్రకటించారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా తక్షణ న్యాయం జరిగేలా కృషి చేస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు