ఈ కలెక్టర్‌ మాకొద్దు!

12 Oct, 2018 11:15 IST|Sakshi
కలెక్టర్‌తో సమావేశం అనంతరం బయటకు వస్తున్న రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : ఎన్నికల వేళ జిల్లా కలెక్టర్‌కు రెవెన్యూ విభాగంలోని అధికారులకు, ఉద్యోగులకు మధ్య ఏర్పడిన అగాథం వివాదాస్పదంగా మారింది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేసే క్రమంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భారతి హోళికేరి వ్యవహరిస్తున్న తీరు జిల్లా రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న ఉన్నతాధికారుల నుంచి వీఆర్‌ఓల వరకు ఎవరికీ రుచించడం లేదు. గ్రామాలు, మండలాల్లో భూములు, ఇతర రెవెన్యూ సంబంధమైన పనుల్లో నెలరోజుల క్రితం వరకు బిజీగా ఉన్న వీఆర్‌ఏలు, వీఆర్‌ఓలు, డీటీలు, తహసీల్దార్లతో పాటు మండల కార్యాలయాల్లో పనిచేసే సీనియర్, జూనియర్‌ అసిస్టెంట్ల వరకు ఈసీ ఆదేశాలతో ఓటర్ల నమోదు, సవరణ  పనుల్లో పడిపోయారు. ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కొద్దిరోజులుగా రెవెన్యూ ఉద్యోగులను ఉరుకులు పరుగులు పెట్టించారనడంలో అతిశయోక్తి లేదు.

ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫీల్ట్‌ పనులు, సాయంత్రం నుంచి రాత్రి వరకు మండల కార్యాలయాలు, కలెక్టరేట్‌లో సమావేశాలతో అధికారులు, ఉద్యోగులకు ఒత్తిడి పెరిగింది. అయినా ఓటర్ల జాబితా రూపకల్పనలో ఆశించిన ప్రగతి లేదు. మంచిర్యాల జిల్లాలో గత ఎన్నికల నాటికి గత నెలలో ప్రచురితమైన ఓటర్ల జాబితాకు మధ్య 72వేల ఓట్లు గల్లంతయినట్లు తేలింది. అనంతరం కొత్త ఓటర్ల నమోదులో భాగంగా ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు భారీగా ఆన్‌లైన్‌లో ఓటర్లుగా దరఖాస్తు చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో చేసుకున్న దరఖాస్తులను తహసీల్దార్ల ద్వారా ఆయా గ్రామాల్లో వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు పరిశీలించి ఆఫ్‌లైన్‌లో పేర్లను జాబితాలో ఎంట్రీ చేయాలి. ఈ ప్రక్రియలో జిల్లాలోని అనేక మండలాల్లో తేడా వస్తున్నట్లు కలెక్టర్‌ గుర్తించారు. శుక్రవారం నాటికల్లా ఓటర్ల జాబితాను ప్రచురించాల్సి ఉండగా, రెవెన్యూ అధికారుల వ్యవహారంపై ఆమె పలుమార్లు సీరియస్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం రెవెన్యూ సంఘాల నాయకులు కలెక్టర్‌ను కలిసి తమ నిరసన వ్యక్తం చేయాలని భావించారు. 

కథ అడ్డం తిరిగింది.. 
కలెక్టర్‌ను కలిసి తమ ఇబ్బందులను తెలియజేసేందుకు జిల్లా తహసీల్దార్ల సంఘం అధ్యక్షుడు ఎం.మల్లేష్, టీఆర్‌ఈఎస్‌ఏ అధ్యక్షుడు డి.శ్రీని వాస్‌రావు, టీఎన్జీవోస్‌ ప్రధాన కార్యదర్శి జి.శ్రీహరి, వీఆర్‌ఓ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఓంకార్‌ల నేతృత్వంలో సుమారు 150 మంది వరకు తహసీల్దార్లు, ఉద్యోగులు గురువారం కలెక్టరేట్‌కు వచ్చారు. కలెక్టరేట్‌ ఉద్యోగులు కూడా ఇందులో ఉన్నారు. తమ ఆవేదన చెప్పుకుందామని కలెక్టర్‌ అపాయింట్‌మెంట్‌ కోరితే కొందరు సంఘం నాయకులకు అనుమతిచ్చారు. కలెక్టర్‌ భారతి వద్దకు వెళ్లిన ఉద్యోగ సంఘాల నాయకుల పట్ల కలెక్టర్‌ సీరియస్‌ అయ్యారని సమాచారం. ‘పనిచేయాలంటే కష్టంగా ఉందా..? నేను కూడా మీతో పాటే పనిచేస్తున్నాను... రాత్రి వరకు పని చేస్తున్నామంటున్నారు... ఉదయం ఎన్ని గంటలకు ఆఫీసులకు వస్తున్నారో తెలియదా..?

నేను ఎవరి ముందు తెలంగాణ ఉద్యోగులు పనిచేయలేరని అన్నానో తీసుకురండి... నా వ్యక్తిగత అవసరాల కోసం పనిచేయమని చెప్ప డం లేదు... ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా 12న ప్రచురించాల్సిందే కదా...? ఆన్‌లైన్‌ దరఖాస్తులకు, ఆఫ్‌లైన్‌లో ఎంట్రీలకు తేడా ఎంతుందో మీరే చూడండి...’ అంటూ పలు అంశాలపై రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులకు క్లాస్‌ తీసుకున్నట్లు సమాచారం. ఉద్యోగులను దూషిస్తున్నారని, ఆత్మస్థైయిర్యాన్ని దెబ్బ తీస్తున్నారని చెప్పే ప్రయత్నం చేయగా... ఎవరిని ధూషించానో, ఎవరి పట్ల అవమానకరంగా మా ట్లాడానో తీసుకురండి... అనడంతో నాయకులు వెనుదిరిగారు. తన విధానం ఇలాగే ఉం టుందని, పనిచేయడం వీలుకాకపోతే వెళ్లిపోం డనీ అన్నట్లు ఉద్యోగ సంఘాల నాయకులే చెప్పారు. 

ఎన్నికల సంఘానికి, సీఎస్‌కు లేఖ
కలెక్టరేట్‌ నుంచి వచ్చిన రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు ఐబీ గెస్ట్‌హౌస్‌లో  సమావేశమై కార్యాచరణ రూపొందించుకున్నారు. శుక్రవారం ఓటర్ల జాబితా ప్రచురణ తరువాత సహాయ నిరాకరణ  చేపట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఓ లేఖ రాశారు. రెవెన్యూ ఉద్యోగులను కించపరిచేలా వ్యవహరిస్తూ, అవమానిస్తున్న కలెక్టర్‌ను మార్చాలని కోరారు. తాము వేదనకు గురవుతున్న తీరును పేర్కొన్నారు. కలెక్టర్‌ కింద పనిచేయలేమని, ఆమెను మార్చకుంటే మూకుమ్మడిగా సెలవుల్లోకి వెళ్తామని అల్టిమేటం ఇచ్చారు. ఎన్నికల వేళ రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. 

‘పనిచేయాలంటే కష్టంగా ఉందా...? నేను కూడా మీతో పాటే పనిచేస్తున్నాను... రాత్రి వరకు పని చేస్తున్నామంటున్నారు... ఉదయం ఎన్ని గంటలకు ఆఫీసులకు వస్తున్నారో తెలియదా...? నేను ఎవరి ముందు తెలంగాణ ఉద్యోగులు పనిచేయలేరని అన్నానో తీసుకురండి... నా వ్యక్తిగత అవసరాల కోసం పనిచేయమని చెప్పడం లేదు... ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా 12వ తేదీన ప్రచురించాల్సిందే కదా...? ఆన్‌లైన్‌ దరఖాస్తులకు, ఆఫ్‌లైన్‌లో ఎంట్రీలకు తేడా ఎంతుందో మీరే చూడండి...’ – కలెక్టర్‌

మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్న వీఆర్‌వోల నుంచి ఉన్నతాధికారుల స్థాయి వరకు రెవెన్యూ ఉద్యోగులపై కలెక్టర్‌ భారతి హోళికేరి అమర్యాదకరంగా వ్యవహరిస్తున్నారు. కలెక్టర్‌ ప్రవర్తన వల్ల మానసికంగా, శారీరకంగా తీవ్రంగా దెబ్బతింటున్నాం. వెంటనే ఆమెను మార్చండి.  – ఉద్యోగులు

∙జిల్లా తహసీల్దార్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎం.మల్లేష్, టీఆర్‌ఈఎస్‌ఏ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌రావు, టీఎన్జీవోస్‌ ప్రధాన కార్యదర్శి జి.శ్రీహరి, వీఆర్‌ఓ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఓంకార్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌కే.జోషి, ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌కు పంపిన లేఖ సారాంశమిది..

మరిన్ని వార్తలు