నాన్నే నాకు స్ఫూర్తి..!

16 Jun, 2019 09:46 IST|Sakshi
మంచిర్యాల డీసీపీ రక్షిత కె మూర్తి

చిన్నప్పటి నుంచే చదువంటే చాలా ఇష్టం.. ఆడపిల్ల అనే ఆంక్షలు దరిదాపునకు కూడా రానీయని తల్లిదండ్రులు. అమ్మనాన్న ఇచ్చిన పూర్తి స్వేచ్ఛ ఉన్నత విద్యభ్యాసానికి దారితీసింది.  పుట్టింది.. పెరిగింది.. చదివింది అంతా బెంగళూరులోనే. అందుకే ఉన్నత విద్య మరింత చేరువైంది. నాన్నకు ఉద్యోగరీత్యా బదిలీ అయినా.. మా చదువు దెబ్బతినొద్దనే ఉన్నత ఆశయంతో బెంగళూరులోనే కుటుంబాన్ని ఉంచారు. ఆయన త్యాగంతోనే నా విద్యభ్యాసానికి ఎక్కడా ఎలాంటి ఆటంకమూ కలగలేదు. నాన్న పెట్టుకున్న అచంచల విశ్వాసం నన్ను ఐపీఎస్‌ స్థాయికి చేర్చింది.. అంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు మంచిర్యాల జిల్లా డీసీపీ రక్షిత కె.మూర్తి. ఉన్నత చదువు.. ఉన్నతస్థాయి ఉద్యోగం.. అత్యున్నత వ్యక్తిత్వంలో నాన్నే నాకు స్ఫూర్తి అంటున్న డీసీపీ..  ‘సాక్షి’ పర్సనల్‌ టైంలో మరిన్ని విశేషాలు పంచుకున్నారు.

సాక్షి, మంచిర్యాల/మంచిర్యాలటౌన్‌: మా నాన్న కృష్ణమూర్తి. సేల్స్‌ట్యాక్స్‌ విభాగంలో ఉద్యోగి. ఉద్యోగరీత్యా నాన్న తరచూ ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లేవారు. అయినా.. తనవల్ల కుటుంబం ఇబ్బంది పడొద్దని.. పిల్లల చదువుకు ఆటంకం కలగొద్దని కుటుంబాన్ని బెంగళూరు నుంచి కదలనీయలేదు. ఆయన మాత్రమే బదిలీ అయిన ప్రాంతాలకు వెళ్లే వారు. నాన్నకు మాపై నమ్మకం ఎక్కువ. మాకు పూర్తిస్వేచ్ఛ కల్పించారు. నాన్నకు నన్ను ఉన్నతంగా చూడాలని ఉండేది. ఇదే చదవాలని.. ఇదే చేయాలని ఏనాడూ పట్టుబట్టలేదు. చదువులో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అందుకే ఇష్టమైన చదువును ఎలాంటి ఇబ్బంది లేకుండా చదవగలిగాను. మా నాన్న బదిలీపై ఇతర ప్రాంతాల్లో ఉండాల్సి రావడంతో అమ్మ ఉష అన్నీ చక్కబెట్టేది. నాకు తమ్ముడు అర్జున్, చెల్లి రిషిక ఉన్నారు. మా ముగ్గురిలో నేనే చదువులో ముందుండేదాన్ని. ఇంటికి పెద్దదాన్ని కావడంతో చెల్లి, తమ్ముడికి చదువులో కొద్దిగా మెరుగయ్యేందుకు సాయం చేసేదాన్ని. మొదట చదువులో కొంత వెనుకబడి ఉన్న తమ్ముడు, చెల్లి ఇద్దరూ ఆ తరువాత ముందుకు దూసుకెళ్లారు. తమ్ముడు బీకాం పూర్తిచేసి యూఎస్‌లో మాస్టర్స్‌ చదువుతున్నాడు. చెల్లి బీటెక్‌ పూర్తిచేసి ఓ ప్రైవేట్‌ కంపెనీకి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. నేను ఐపీఎస్‌ పూర్తిచేసి డీసీపీగా పనిచేస్తున్న. అందుకే మా కుటుంబాన్ని చూస్తే నాకు ఎంతో ధైర్యంగా ఉంటుంది.

బెంగళూరులోనే విద్యాభ్యాసం
నా విద్యభ్యాసమంతా బెంగళూరులోనే సాగింది. బెంగళూరులోని బోల్డ్‌ విన్స్‌ గరల్స్‌ పాఠశాలలో చదువు ప్రారంభించి.. అక్కడే ఇంటర్‌ పూర్తి చేశాను. 2008లో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్‌లో బెంగళూరులోని ఎంఎస్‌ సిద్దరామయ్య ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తయ్యింది. 2012లో మొదటిసారి యూపీఎస్సీ రాశాను. 2013లో ఇండియన్‌ పోస్టల్‌ సర్వీస్‌కు ఎంపికై ఏడాదిపాటు శిక్షణ పూర్తి చేసుకున్న. 2013లో మరోసారి యూపీఎస్సీ రాసి.. రెవెన్యూ సర్వీస్‌ విభాగానికి ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న. 2014లో 117వ ర్యాంకుతో ఐపీఎస్‌కు ఎంపికయ్యా. 2015 ఐపీఎస్‌ బ్యాచ్‌లో నన్ను తెలంగాణకు కేటాయించారు. 2018 మార్చి 13న గోదావరిఖని ఏసీపీగా బాధ్యతలు స్వీకరించాను.

చదువు తప్ప మరో ధ్యాస లేదు
అమ్మ చెబుతూ ఉండడం వల్లనో.. చదువు కోవాలన్న కోరికతోనో తెలియదుగానీ.. నాకు చిన్ననాటి నుంచి బాగా చదువుకోవాలనే తాపత్రయం ఎక్కువ. నాకు చదువు తప్ప మరో ధ్యాసలేదు. వంట చేయడం అస్సలు రాదు. అన్ని అవసరాలూ అమ్మనే తీర్చేది. మేం కిచెన్‌లోకి వెళ్లింది తక్కువే. ఏ అవసరం ఉన్నా మా అమ్మనే చూసుకోవడంతో వంట చేయాల్సిన అవసరం రాలేదు. అమ్మ వండిన వంటలంటే చాలా ఇష్టం. ఎవరు వండినా తినేదాన్ని కాదు. అందుకేనేమో నాకు నేను వంట చేసుకోవాలనో.. నేర్చుకోవాలనో అనుకోలేకపోయి ఉంటాను. అందుకే నన్ను వంటవచ్చా అని ఎవరైనా అడిగితే నాకు చదువు ఒక్కటే వచ్చు.. వంట రాదు అని చెప్పేస్తా.

స్నేహితుల్లో నేనే పోలీస్‌
మా కుటుంబంలో ఎక్కువమంది పోలీస్‌శాఖలో పనిచేస్తున్నారు. అదే నాకు స్ఫూర్తినిచ్చి ఐపీఎస్‌ కావాలన్న ఆలోచన వచ్చిందో.. ఏమో తెలియదుగానీ.. మా స్నేహితుల్లో నేనొక్కదానే పోలీస్‌. నాతో పాటు చదువుకున్న స్నేహితులు వివిధ రంగాల్లో.. ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నారు. నేను పోలీసు కావడంతో మా స్నేహితులు కూడా నన్ను చూసి ఆనందిస్తుంటారు. పుట్టి పెరిగింది అంతా బెంగళూరులోనే కావడంతో స్నేహితులంతా అక్కడివారే. మొదటిసారి బెంగళూరును వదిలి గోదావరిఖనిలో ఉద్యోగంలో చేరడంతో మా కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. అమ్మ చేతి వంటనే నాకు అలవాటు. ఇక్కడ నేను ఏంతింటానో అనే బెంగ పట్టుకుంది. ఇక్కడ వంటవారికి మా అమ్మ అన్ని వంటకాలను దగ్గరుండి నేర్పించింది. ప్రతిరోజు నా యోగక్షేమాలను తెలుసుకుంటూ ఉంటారు. అన్నిరకాల వంటకాలను ఇష్టంగా తింటా. ఆటల్లో టెన్నీస్‌ అంటే ఎంతో ఇష్టం. స్కూల్‌ నుంచి కళాశాల వరకు ఎక్కువగా బాస్కెట్‌బాల్, ఖోఖో, త్రోబాల్‌ ఎక్కువగా ఆడేదాన్ని. అలా అని జిల్లాస్థాయి ప్లేయర్‌ను కాదు. ప్రయాణాలు చేయడం అంటే ఇష్టం. అందుకే బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేయడంలో ఎలాంటి ఇబ్బందులూ లేవు.

విద్యతోనే ఆత్మవిశ్వాసం
విద్యతోనే ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి ఒక్కరిలో చదువు ఉంటే వారిలో ఆత్మస్థైర్యం అధికంగా ఉంటుంది. నేను పోలీస్‌రంగాన్ని ఎంచుకున్న. నా ఉద్యోగ బాధ్యతను సమర్థవంతగా నిర్వహిస్తా. మరో ఉద్యోగంలోకి వెళ్లాలన్న ఆలోచన లేదు. నిందితులను పట్టుకోవడం.. బాలికలు, మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరగకుండా చూడడం నా ప్రధాన లక్ష్యం. దొంగతనాలు, నేరాల అదుపునకు ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చర్యలు తీసుకుంటా. ఉద్యోగ బాధ్యతలతో బిజీగా ఉండడంతో కుటుంబసభ్యులతో ఎక్కువగా గడపలేకపోతున్నాననే భావన ఉంది. ఉద్యోగాల్లో ఇవన్నీ సహజం. మహిళలు ధైర్యంగా ఉండాలి. కచ్చితంగా ప్రతి బాలికనూ చదివించడం ద్వారా వారి భవిష్యత్‌కు బాటలు వేయాలి. 

మరిన్ని వార్తలు