కేంద్రం కుట్రలను తిప్పికొట్టేందుకే ‘సింహగర్జన’ 

11 Jul, 2018 00:57 IST|Sakshi

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ  

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయని, ఆ కుట్రలకు కేంద్ర ప్రభుత్వం నాయకత్వం వహిస్తే దాన్ని సుప్రీంకోర్టు అమలు పరుస్తుందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. కేంద్రం కుట్రలను తిప్పికొట్టేందుకు దేశవ్యాప్తంగా ఉద్యమం వస్తుందని, అది తీవ్రరూపం దాల్చకముందే దిద్దుబాటుచర్యలు చేపట్టాలని ఆయన హితవు పలికారు. అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను తిప్పికొట్టేందుకు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 8న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద దళిత గిరిజనులతో ‘సింహగర్జన’నిర్వహించనున్నట్లు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పును వెంటనే సరిదిద్దుకోకపోతే రాబోయే ఎన్నికల్లో ఓటు రూపంలో కూడా మా నిరసన తెలుపుతామ ని హెచ్చరించారు. సింహగర్జనకు బీజేపీని మినహా అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులను ఒకే వేదికపైకి రప్పించే యత్నాలు చేస్తున్నామన్నారు.

తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడు, కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ.. చట్టం నిర్వీర్యం అయ్యాక దళితులపై దాడులు, హత్యలు పెరిగాయన్నారు. కొత్తగా చట్టాలు రూపొందించాల్సిన అవసరం లేదని ఉన్న చట్టాన్నే పటిష్టంగా అమలు చేసి దాన్ని 9వ షెడ్యూల్డ్‌లో పొందుపర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో లంబాడీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బెల్లయ్య నాయక్, ఎరుకల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు వలిగి ప్రభాకర్, మాల మహానాడు జాతీయ సెక్రటరీ జనరల్‌ జంగా శ్రీనివాస్, వివిధ సంఘాల నాయకులు జేబీ రాజు, బాలరాజు, తాటికొండ శ్యామ్‌లాల్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు