‘ధర్మయుద్ధం’ విజయవంతం చేయండి

22 Nov, 2016 03:01 IST|Sakshi

♦  పలు పార్టీల నాయకుల పిలుపు
♦  వర్గీకరణ జరిగితేనే  దళితుల అభివృద్ధి సాధ్యం: సర్వే  


హైదరాబాద్‌: మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 27న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరగనున్న ధర్మయుద్ధం మహా సభను విజయవంతం చేయాలని పలు పార్టీలకు చెందిన నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం హైద రాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎంఆర్‌పీఎస్‌ ఆధ్వర్యంలో మంద కృష్ణమాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ మాల, మాదిగల పంచాయితీ ఆం ధ్రా, తెలంగాణ లాంటిదని, రెండు రాష్ట్రాలుగా విడిపోయి అన్నదమ్ముల్లా కలసి ఉంటామన్నట్లే, ఎస్సీ రిజర్వేషన్‌ చేస్తేనే దళితులంతా అభివృద్ధి చెందుతారని అన్నారు. సీఎం కేసీఆర్‌ గంజిలో ఈగను తీసేసినట్లు రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేశారని, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే మాదిగ ధర్మయుద్ధం సభకు హాజరు కావాలని అన్నారు. ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి రాజ య్య మాట్లాడుతూ తాను ఎంఆర్‌పీఎస్‌ కార్యకర్తగా ఉండి ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని అన్నారు. మాదిగలంతా వర్గీకరణ కోసం ఐక్యంగా పోరాడాలని అన్నారు. మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ 23 ఏళ్లుగా వర్గీకరణ ఉద్యమం జరుగుతుందని, 59 ఉప కులాలకు సమన్యాయం జరిగేందుకే వర్గీకరణ అని అన్నారు. బీజేపీ వర్గీకరణ చేసేందుకు సిద్ధంగా ఉందని.. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఈ సమస్యను భుజాన వేసుకున్నారని అన్నారు.

వర్గీకరణ కోసం అంతిమ పోరాటమిది
ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధన దిశ గా జరిగే అంతిమ పోరాటమే ఈ ధర్మయుద్ధం అని అన్నారు. వర్గీకరణకు అన్ని రాజకీయ పార్టీల పూర్తి మద్దతు ఉందన్నారు. కేంద్రంలో కూడా అన్ని పార్టీలు సుముఖంగానే ఉన్నాయని అన్నారు. కేవ లం మాలల్లోని కొంతమంది స్వార్థపరులు రెండు సార్లు వర్గీకరణను అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  వర్గీకరణ లేకపోవడంవల్లే తాము వెనక బడి ఉన్నామని చెప్పేందుకే ఈ ధర్మ యుద్ధమని అన్నారు. దళితులే కాకుండా ధర్మం పక్షాన నిలబడే అందరూ పార్టీలకతీతంగా ధర్మయుద్ధాన్ని విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభకు కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ,  లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ తదితరులు పాల్గొంటారని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, బీజేపీ నాయకులు రాములు, సాంబమూర్తి,  బొట్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు