వెంకటేశ్‌ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి

2 Sep, 2017 02:17 IST|Sakshi
వెంకటేశ్‌ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి

హోం మంత్రి, డీజీపీకి మంద కృష్ణ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్‌: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రిమాండ్‌ ఖైదీ కడమంచి వెంకటేశ్‌ మృతికి కారకులైన ఎల్లారెడ్డిపేట సీఐ రవీందర్‌గౌడ్, ఎస్సై శ్రీనివాస్‌గౌడ్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఎమార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ, మానవ హక్కుల కమిషన్‌కు వేరువేరుగా వినతిపత్రం ఇచ్చారు. బప్పాపూర్‌ గ్రామంలో గత నెల 5న మంత్రి కేటీఆర్‌ సభ జరుగుతున్న సమయంలో జేబు దొంగతనాలు జరుగుతున్నాయని సభికులు ఫిర్యాదు చేయడంతో సీఐ రవీందర్, ఎస్సై శ్రీనివాస్‌గౌడ్, పోలీసు సిబ్బంది కడమంచి వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. పోలీసులు వెంకటేశ్‌ను అక్రమంగా నిర్భందించారని చెప్పారు. చేయని నేరాలను చేసినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు.

వెంకటేశ్‌ భార్య రేణుక పిల్లలను తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి భర్తను చూపించాలని కోరగా, అరెస్టు చేయలేదని ఎస్సై చెబుతూ ఆమెను పరుష పదజాలంతో దూషించారని పేర్కొన్నారు. తప్పుడు కేసులు పెట్టి జూలై 13న అరెస్టు చేసినట్లు చూపి కోర్టులో హాజరుపరిచి, జైలుకు పంపించారన్నారు. రిమాండ్‌ రిపోర్టులో వెంకటేశ్‌ శరీరంపై గాయాలున్నట్లు స్పష్టంగా ఉందని, ఆ తర్వాత రెండో రోజే తీవ్ర అనారోగ్యానికి గురికాగా, జూలై 15, 21న ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేశారని చెప్పారు. జూలై 24న ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారని, ఈ వ్యవధిలో వెంకటేశ్‌ను రేణుక కలవగా తనపై జరిగిన అకృత్యాలను తెలిపాడని, ఈ విషయాన్ని కూడా మంత్రికి వివరించినట్లు చెప్పారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్‌ గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా, 26న వెంకటేశ్‌ మృతి చెందాడన్నారు. ఎస్సీ బుడగ జంగాల కులానికి చెందిన వెంకటేశ్‌ మృతికి ఎల్లారెడ్డిపేట సీఐ, ఎస్సై, పోలీసు సిబ్బంది బాధ్యులని స్పష్టమవుతోందన్నారు. కారకులపై హత్యానేరం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధిత కుటుంబానికి తగిన నష్టపరిహారం చెల్లించాలన్నారు. మందకృష్ణతో పాటు మాదిగ విద్యార్థి ఫెడరేషన్‌ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి తదితరులున్నారు.

మరిన్ని వార్తలు