మాయావతి ప్రకటనపై మందకృష్ణ ఆవేదన

11 Dec, 2019 13:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘దిశ’ దుర్గటనలో నలుగురిని ఎన్‌కౌంట్‌ చేయడాన్ని ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి మాయావతి సమర్థించడం దురదృష్టకరమని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించడానికి జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఓయూ క్యాంపస్‌ దూరవిద్యాకేంద్రంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. మాదిగ విద్యార్థి సమాఖ్య (ఎంఎస్‌ఎఫ్‌) జాతీయ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి మాదిగ అధ్యక్షతన సభలో మంద కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా మౌనం వహించిన మాయావతి కేవలం ‘దిశ’ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని సమర్థించడం దురదృష్టకరమన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. కేవలం అగ్రకుల మహిళలపై దుర్గటనలు జరిగితేనే అగ్రకుల నేతలు ఆందోళన చేసి, పార్లమెంట్‌ వరకు చర్చించడం పాలక వర్గాలలో పక్షపాత ధోరణులకు నిదర్శనమని వివరించారు. ‘దిశ’ ఘటనకు ముందు టేకు లక్ష్మి, సుద్దాల శైలజ, కల్పన, ఇంకా అనేక మంది దళిత, బహుజన మహిళలు, బాలికలు అత్యాచారానికి గురై హత్య చేసినా ఇంత వరకు వారి కుటుంబాలను ఏ ఒక్క నేతా పలకరించలేదని, సత్వర న్యాయం కోసం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేసి నిందితులను శిక్షించలేదన్నారు. తప్పు ఎవరు చేసినా చట్టబద్ధమైన కఠిన శిక్షలు విధించాలని, జీవించే హక్కును వ్యక్తులు, సంస్థలు, రాజకీయ పార్టీలు హరించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.

కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ ఫ్రంట్‌ చైర్మన్‌ చనగాని దయాకర్‌గౌడ్, తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజియాదవ్, డీబీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు నలిగంటి శరత్, వీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌ ముదిరాజ్, రాష్ట్ర నాయకులు సలీంపాషా, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి రంజిత్, నాగరాజు, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు లక్ష్మణ్, టీడీవీఎస్‌ రాష్ట్ర నాయకులు భూపెల్లి నారాయణ తదితరులు ప్రసంగించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా