నేడో, రేపో పరిషత్‌ షెడ్యూల్‌

19 Apr, 2019 05:34 IST|Sakshi

కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సమీక్ష 

కొత్తగా 4 మండలాలు,4 జెడ్పీటీసీలు

 మంగపేట జెడ్పీటీసీఎన్నిక వాయిదా 

మూడు విడతల్లో ఎన్నికలు..22న తొలి నోటిఫికేషన్‌

 ఎన్నికల ఏర్పాట్లు పూర్తి: నాగిరెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌ శుక్ర లేదా శనివారాల్లో విడుదల కానుంది. కొన్ని జిల్లాల గెజిట్‌లు గురువారం రాత్రికి, శుక్రవారం ఉదయం ప్రచురించే అవకాశాలున్నాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ, ఏర్పాట్లు దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో షెడ్యూల్‌ జారీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) సన్నాహాలు చేస్తోంది. శుక్రవారం ప్రభుత్వ సెలవు దినం కారణంగా షెడ్యూల్‌ విడుదలకు అవకాశం లేకపోతే శనివారం వెలువడనుంది. రాష్ట్రంలోని మూడు జిల్లాల పరిధిలో కొత్తగా నాలుగు మండలాలు చేర్చడంతో, మండలాలు, జెడ్పీటీసీ స్థానాల సంఖ్య 539కు చేరింది.

అయితే ములుగు జిల్లా మంగపేట జెడ్పీటీసీ స్థానం రిజర్వేషన్‌ వివాదం కారణంగా హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఎన్నికలు జరగడం లేదు. 538 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం 32 జిల్లాల పరిధిలో 1.57 కోట్ల ›గ్రామీణ ఓటర్లున్నా రు. పరిషత్‌ నోటిఫికేషన్‌ వెలువడే వరకు ఓటర్ల జాబితాలో పేర్లు నమోదయ్యే వారిని కూడా ఓటర్లుగా పరిగణనలోకి తీసుకోనున్నారు. దీంతో ఈ సంఖ్య 1.60 కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయి. 32 జిల్లాల పరిధిలో 32,007 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్‌ఈసీ ఏర్పాట్లు చేసింది. 

కలెక్టర్లు, ఎస్పీలతో నాగిరెడ్డి సమీక్ష... 
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఏర్పాట్లపై గురువారం మ్యారియట్‌ హోటల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీ సీఈవోలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి నిర్వహించిన సమావేశానికి సీఎస్‌ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, పీఆర్‌ ముఖ్యకార్యదర్శి (ఎప్‌ఏసీ) సునీల్‌శర్మ, పీఆర్‌ కమిషనర్‌ నీతూకుమారి ప్రసాద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై ఎస్‌ఈసీ సంతృప్తి వ్యక్తం చేసింది. తమ జిల్లాల పరిధిలో 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలంటూ నాగిరెడ్డిని పలువురు ఎస్పీలు కోరినట్లు సమాచారం. దీంతో 26 జిల్లాల్లో 3 విడతల్లో, 5 జిల్లాల్లో 2 విడతల్లో, కేవలం ఒక్క జిల్లాలో (మేడ్చల్‌–మల్కాజిగిరి) మాత్రం ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు.  

కొత్తగా 4 మండలాలు, 4 జెడ్పీటీసీలు... 
రాష్ట్రంలోని 3 జిల్లాల పరిధిలో కొత్తగా 4 మండలాలు అంటే 4 జెడ్పీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. నిజామాబాద్‌ జిల్లాలో వర్ని మండలం పరిధిలోని కొన్ని గ్రామాలను విడదీసి విడిగా మోస్రా, చండూరు మండలాలుగా ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట రూరల్‌ మండలం నుంచి కొన్ని గ్రామాలను విడదీసి నారాయణరావుపేట, మేడ్చల్‌ జిల్లాలో శామీర్‌పేట మండలంలోని కొన్ని గ్రామాలతో మూడు చింతలపల్లి మండలం ఏర్పాటు చేశారు. ఈ 4 చోట్ల జెడ్పీటీసీ స్థానాలను కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ 4 ఎంపీపీ స్థానాలకు ఫలితాలు వెలువడ్డాక పరోక్ష పద్ధతిలో మండలాధ్యక్షులను ఎన్నుకుంటారు. మూడు చింతలపల్లి జెడ్పీటీసీ స్థానాన్ని జనరల్‌ స్థానానికి రిజర్వు చేయగా... ఎంపీపీ స్థానాన్ని బీసీ జనరల్‌కు కేటాయించారు.  

మంగపేట జెడ్పీటీసీ ఎన్నిక వాయిదా... 
ములుగు జిల్లా మంగపేట జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ జెడ్పీటీసీ స్థానం షెడ్యూల్డ్‌ ఏరియాలోకి వస్తుందా లేదా అన్న వివాదం నేపథ్యంలో హైకోర్టు దీని ఎన్నిక విషయంలో స్టే ఇచ్చింది. ఈ స్థానాన్ని ఎస్టీగానా లేదా జనరల్‌గానా ఎలా పరిగణించాలన్న వివాదంపై కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ స్థానంలో ఎన్నిక నిర్వహించాలా? వద్దా? అన్నది ఎస్‌ఈసీని ములుగు కలెక్టర్‌ స్పష్టత కోరారు. హైకోర్టు స్టే విధించినందున ఇక్కడ ఎన్నిక నిర్వహించరాదని నిర్ణయించారు.  

ఎన్నికల ఏర్పాట్లు భేష్‌: వి.నాగిరెడ్డి 
జిల్లాల వారీగా ఎన్నికల ఏర్పాట్లు, సన్నద్ధతపై చర్చించాం. జిల్లాల్లో పరిషత్‌ ఎన్నికల ఏర్పాట్లు బాగున్నాయి. ఎన్నికల నిర్వహణకు అన్ని జిల్లాల యంత్రాంగం పూర్తి సన్నద్ధతతో ఉంది. తాము చేసిన ఏర్పాట్ల గురించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వివరించారు. త్వరలోనే షెడ్యూల్‌ విడుదల చేస్తాం. పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎక్కడా ఇబ్బందులు లేవన్నారు. భద్రతాపరమైన అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించాం. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. కొద్ది రోజుల క్రితమే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగడంతో ఈ ఎన్నికల్లో ఎడమ చేతి మధ్య వేలికి సిరా గుర్తు వేయాలని నిర్ణయించామన్నారు.

22న తొలి నోటిఫికేషన్‌
పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యాక... ఈ నెల 22న జిల్లా పరిషత్, మండల పరిషత్‌ ఎన్నికల తొలి నోటిఫికేషన్‌ను ఎస్‌ఈసీ విడుదల చేయనుంది. దీనికి అనుగుణంగా వచ్చే నెల 6న మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలుంటాయి. 26న రెండో నోటిఫికేషన్‌ను విడుదల చేశాక.. మే 10న ఎన్నికలు జరుగుతాయి. ఈనెల 30న తుది విడత నోటిఫికేషన్‌ను జారీచేయనుంది. వచ్చేనెల 14న తుది విడత ఎన్నికలతో పోలింగ్‌ ముగియనుంది. మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ప్రకటించాకే పరిషత్‌ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాతే 32 జెడ్పీ చైర్‌పర్సన్లు, 5,187 ఎంపీపీ అధ్యక్షులను పరోక్ష పద్ధతుల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎన్నుకుంటారు.

మరిన్ని వార్తలు