వాతావ'రణం'.. పూతకు ప్రతికూలం

20 Feb, 2020 03:04 IST|Sakshi

లబోదిబోమంటున్న మామిడి రైతులు

ఉష్ణోగ్రతల తగ్గుదలతో రాలిపోతున్న పూత

మూడున్నర లక్షల ఎకరాల్లోని తోటలపై ప్రభావం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మామిడి రైతుకు కష్టాలు వచ్చి పడ్డాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా పూత రాలిపోతోంది.దీంతో ఈసారి దిగుబడులు భారీగా పడిపోయే పరిస్థితి నెలకొని ఉందని ఉద్యానశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.గతేడాది సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో అకాల వర్షాలు కురవడం, తర్వాత చలి నెలకొనడం తదితర కారణాల వల్ల ఈసారి పూత రావడమే ఆలస్యమైందని, ప్రస్తుత వాతావరణం కూడా పూత, పిందెలు నిలబడే స్థితి లేకుండా పోయిందని ఉద్యానశాఖ అధికారులు అంటున్నారు.దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.  

60 శాతం దిగుబడులు పడిపోయే ప్రమాదం... 
రాష్ట్రంలో 3.5 లక్షల ఎకరాల్లో మామిడి తోట లున్నాయి.అత్యధికంగా ఖమ్మం, మంచి ర్యాల, జగిత్యాల, నాగర్‌ కర్నూలు, సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్‌ జిల్లాల్లో అత్యధికంగా తోటలుండగా, మిగిలిన జిల్లాల్లో నామమాత్రంగా ఉన్నాయి. సాధారణంగా ఎకరాకు సరాసరి 4 టన్నుల వరకు మామిడి దిగుబడులు వస్తాయి.బాగా కాస్తే ఏడెనిమిది టన్నుల వరకూ దిగుబడి వస్తుందని అంటున్నారు.ఆ ప్రకారం రాష్ట్రంలో సుమారు 20 లక్షల టన్నుల వరకు మామిడి దిగుబడి వస్తుందని అంచనా. ఇక్కడి నుంచి వివిధ దేశాలకు కూడా మన మామిడి పంట ఎగుమతి అవుతుంది.

ఈసారి కాపు పరిస్థితి అధ్వాన్నంగా మారింది. సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో విపరీతమైన వర్షాలు కురవడంతో దాని ప్రభావం మామిడి పూతపై పడింది. సెప్టెంబర్‌ నెలలో సాధారణం కంటే 92 శాతం, అక్టోబర్‌ నెలలో సాధారణం కంటే 70% అధికంగా వర్షం కురిసింది. ఫిబ్రవరిలో ఇప్పటివరకు అంటే ఈ 12 రోజుల్లో ఏకంగా 279% అధికంగా వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ 12 రోజుల్లో 2.4 మిల్లీమీటర్ల (మి.మీ.) వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 9.1 మి.మీ నమోదైంది. అంటే మామిడి పూతకు అత్యంత కీలకమైన సమయాల్లో వర్షాలు కురిశాయి. మధ్యలో చలి వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితే మామిడి పూత, కాతపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని అంటున్నారు.  

ఫంగస్, చీడపీడలు... 
అక్టోబర్‌ నెల నుంచే మామిడి పూతకు అను కూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి. కానీ ఈసారి అక్టోబర్‌ వరకూ వర్షాలు విపరీతంగా కురిశాయి. ఈ దెబ్బ ఇప్పటివరకు కొనసాగుతోంది. జనవరిలో సంక్రాంతి నాటికి పూత పూర్తిస్థాయిలో రావాలి. ఉద్యానశాఖ వర్గాల అంచనా ప్రకారం నెల రోజులపాటు మామిడి పూత, కాతకు అంతరాయం ఏర్పడిందంటున్నారు. వాతావరణ  మార్పులతో మామిడిపై ఫంగస్‌ పంజా విసిరింది. చీడపీడలు విజృంభించాయి. దీంతో రైతులు తీవ్రమైన నష్టాలు చవిచూసే పరిస్థితి నెలకొంది. వాస్తవంగా పూతలో 98 % మగ పూతే ఉంటుంది. అది రాలిపోతుంది. ఇక మిగిలిన 2 శాతం ద్విలింగ (ఆడ, మగ) పూత ఉంటుంది. దాని నుంచే కాపు వస్తుంది. అందులో సాధారణంగా 0.5 శాతం మాత్రమే మామిడి కాయగా వస్తుంది. దానినే దిగుబడిగా లెక్కిస్తారు. ఇప్పుడు ఆ దిగుబడి కూడా 60 శాతం వరకు పడిపోయే ప్రమాదముందని ఉద్యాన శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత వాతావరణం పంటపై తీవ్రమైన వ్యతిరేక ప్రభావం చూపిందని ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మధుసూదన్‌ అభిప్రాయపడ్డారు. సాధారణంగా మార్చిలో మార్కెట్లోకి మామిడి కాయ రావాలి. జూన్‌ నెల వరకు వస్తూనే ఉంటుంది. ఈసారి ఏప్రిల్‌లో కాయలు మార్కెట్లోకి వచ్చే అవకాశముందని అంచనా.  

పూత నిలవడంలేదు 
పదేళ్ల కిందట 4 ఎకరాల్లో మామిడి తోట పెట్టాను. అప్పటినుంచి మంచి దిగుబడులు వచ్చేవి. ఈ ఏడాది పూతనే రాలేదు. బంగినపెల్లి మామిడి చెట్లకు పూత వచ్చినా నిలవడం లేదు. దస్రీ రకానికి ఇప్పుడిప్పుడే వస్తోంది. మామిళ్లు పూతకు వస్తే ఎండకాలంలో చెట్లకు కాయలెట్లా నిలుస్తది. ఈ ఏడాది మామిడి తోటలకు నష్టం వచ్చినట్లే. ఎండాకాలంలో నీళ్లు అందక కాయలు రాలిపోతాయి. 
– తిరుపతిరావు, గాంధీనగర్, హుస్నాబాద్‌ మండలం, సిద్దిపేట జిల్లా 

ఆరంభం నుంచే సమస్య
 వాతావరణ మార్పుల వల్ల పూత రాలిపోతుంది. ఈ ఏడాది ఆరంభం నుంచే ఈ సమస్య నెలకొంది. పూత రాలటంతో పంట దిగుబడులు తగ్గే అవకాశం కూడా ఉంది.   
– ఎనమల నారాయణరెడ్డి, బోడు, టేకులపల్లి మండలం, భద్రాద్రికొత్తగూడెం జిల్లా 

మరిన్ని వార్తలు