మామిడి 'మిడే'

28 May, 2020 08:55 IST|Sakshi

నగరానికి భారీగా తగ్గిన పండ్ల దిగుమతులు

సొంత ప్రాంతాల్లోనే అమ్ముకుంటున్న రైతులు

గడ్డిఅన్నారం మార్కెట్‌ కోహెడకు తరలింపు

సమస్యగా మారిన రవాణా, మార్కెట్‌ వసతులు

కోవిడ్‌ కారణంగా కొన్ని రోజులు మూసివేత

అన్ని విధాలుగా పండ్ల మార్కెట్‌పై ప్రభావం  

గత ఏడాది మామిడి 8.42 లక్షల క్వింటాళ్లు రాగా.. ఈసారి 4.96 లక్షల క్వింటాళ్లే..

మిగతా పండ్ల దిగుమతులదీ ఇదే పరిస్థితి

సాక్షి, సిటీబ్యూరో: కర్ణుడి మరణానికి సవాలక్ష కారణాలు అన్నట్లు.. అటు కోవిడ్‌ వైరస్‌.. ఇటు మార్కెట్‌ తరలింపు.. ఆపై రవాణా వసతులు సరిగా లేకపోవడంతో నగరానికి పండ్ల దిగుమతులు భారీ స్థాయిలో పడిపోయాయి. ఒకవైపు రైతులు పండించిన పంట చేతికి అందినా సరుకును మార్కెట్‌లో విక్రయించుకునేందుకు సరైన వసతులు లేకపోవడంతో వెనుకంజ వేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక సొంత ప్రాంతాల్లోనే అమ్ముకుంటున్నారు. మరోవైపు గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ కోహెడకు తరలింపుతోనూ వ్యాపారులకు, రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. తెలంగాణలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్‌ గడ్డిఅన్నారం మార్కెట్‌. రాష్ట్రవ్యాప్తంగా రైతులు తమ పండ్ల దిగుబడులు ఇక్కడికే ఎక్కువగా తీసుకువస్తారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఈ మార్కెట్‌లో విక్రయిస్తే ఆశించిన ధరలు వస్తాయని రైతులు నమ్మకం. కానీ ఈ ఏడాది మామిడితో పాటు పుచ్చకాయ, బత్తాయి దిగుబడులు బాగానే ఉన్నా.. కరోనాకారణంగా మార్కెట్‌ కొన్ని రోజులు బంద్‌.. కొన్ని రోజులుతెరిచి ఉండడంతో రైతులు స్థానికంగానే పండ్లను విక్రయించుకున్నారు. గత ఏడాది వేసవిలో మామిడి, బత్తాయి, పుచ్చకాయలు నిత్యం గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు రికార్డు స్థాయిలో దిగుమతి అయ్యాయని మార్కెట్‌ కమిటీ లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాది మామిడి 8.42 లక్షల క్వింటాళ్లు దిగుమతి కాగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు 4.96 లక్షల క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. పుచ్చకాయ, బత్తాయి, ద్రాక్ష, దానిమ్మ దిగుమతులు సైతం సగానికి సగం పడిపోయాయి.  

ఎక్కడికక్కడే విక్రయాలు..  
ఈ ఏడాది నీటి లభ్యత ఎక్కువగా ఉండడంతో పండ్ల సాగు అనుకున్న స్థాయికంటే ఎక్కువగానే ఉంది. కానీ ముందస్తుగా మార్కెటింగ్‌ శాఖ ఉన్నత అధికారులు ప్రణాళికలు చేయకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పుచ్చకాయ, మామిడి, బత్తాయి దిగుబడులు చేతికి వచ్చినా.. లాక్‌డౌన్‌తో పాటు కోహెడకు మార్కెట్‌ తరలింపు, అది కొన్ని రోజులు మూసివేయడంతో కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేక మార్కెట్‌ను కోహెడకు తరలించారు. అయినా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటూ పండ్ల అక్కడికి తరలించారు. ఈదురు గాలులు, భారీ వర్షాలతో మార్కెట్‌లోని షెడ్డులు నేలకూలాయి. అంతేకాదు అక్కడ ప్లాట్‌ఫాంలు కూడా లేకపోవడంతో మామిడి కాయలు వర్షానికి కొట్టుకుపోయాయి. దీంతోనూ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోహెడలో పూర్తి స్థాయిలో మార్కెట్‌ పనులు కాకపోయినా ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి కారణంగా మార్కెట్‌ను అక్కడికి తరలించాల్సి వచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా తొందరపాటు నిర్ణయాలతో అటు రైతులకు, ఇటు వ్యాపారులకు కోలుకోలేని నష్టం జరిగిందని హోల్‌సేల్‌ వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికీ గడ్డిఅన్నారం మార్కెట్‌కు తీసుకొచ్చే కాయలను నేలపై పోసేందుకు రైతులకు అనుమతి లేదు. లారీలు, ఇతర వాహనాల్లోనే పండ్లు పెట్టి విక్రయించాల్సిన పరిస్థితి ఉందని ఓ మామిడి రైతు ఆవేదన వెలిబుచ్చారు. ఈ ఏడాది పండ్ల మార్కెట్‌ మూడు ప్రాంతాల్లో తరలించడంతోనూ పుచ్చకాయ రైతులు వాహనాల్లోనే సరుకును ఉంచి వచ్చిన ధరలకు అమ్ముకున్నారు. 

మార్కెట్‌ ఆదాయానికి భారీగా గండి..
గడ్డిఅన్నారం మార్కెట్‌ కమిటీకి మార్చి నుంచి మే వరకు మామిడి, పుచ్చకాయ, బత్తాయి, ద్రాక్షతో పాటు ఇతర పండ్ల సీజన్‌. ఇందులోనూ మామిడి సీజన్‌తో మార్కెట్‌కు కాసుల పంట ఉంటుంది. కానీ ఈ ఏడాది మామిడి దిగుమతులు విపరీతంగా పడిపోవడంతో మార్కెట్‌ ఆదాయానికి గండి పడింది. మార్కెట్‌ లెక్కల ప్రకారం గత ఏడాది మార్చిలో రూ.89.32 లక్షలు ఆదాయం రాగా.. ఈ ఏడాది రూ.90.91 లక్షలు సమకూరాయి. గత ఏడాది ఏప్రిల్‌లో రూ.1.13 కోట్లు రాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ. 49.28 లక్షలు మాత్రమే వచ్చాయి. గత సంవత్సరం మే నెలలో రూ.1.49 కోట్లు రాగా.. ఈ ఏడాది మే 27 వరకు రూ.71.17 లక్షల ఆదాయం వచ్చింది. ఏడాది పాటు వివిధ రకాల పండ్లు మార్కెట్‌కు దిగుమతి అయినా వేసవిలో మామిడి సీజన్‌లతో ఎక్కువ ఆదాయం వస్తుంది. కానీ మార్కెటింగ్‌ శాఖ, కమిటీ  అనాలోచిత నిర్ణయాలతో మార్కెట్‌ ఆదాయం భారీగా తగ్గిందని ఈ ఏడాది చివరి వరకు ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకోనుంది.  

మరిన్ని వార్తలు