తినాలని ఉంది..కానీ

28 May, 2019 08:44 IST|Sakshi

మామిడి ధరలకు రెక్కలు

కిలో మామిడి రూ.90 నుంచి రూ.150 

భారీగా తగ్గిన దిగుమతి  

ఎగుమతులకే సరిపోతున్న మేలురకాలు

సాక్షి సిటీబ్యూరో: మామిడి పండు చేదెక్కింది. తినాలని ఉన్నా వాటి ధర చూసి వెనక్కు తగ్గాల్సి వస్తోంది. వేసవిలో వచ్చే మామిడిపండ్లను తినాలని ప్రతి ఒక్కరూ ఆశ పడుతుంటారు. మధుర ఫలం కోసం వేసవి వరకు ఎదురు చూసి తీరా వచ్చిన తరువాత వాటి ధర కారణంగా నామమాత్రంగా తింటున్నారు.  ఈఏడాది సాధారణ రకం మామిడి పండ్ల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఏరకం మామిడి పండ్లను చూసినా సామాన్యుడికి అందుబాటులో లేవు. దీంతో మధుర ఫలాన్ని కొనేందుకు అవస్థలు పడుతున్నారు.  

  • కరువుకు తోడు ఆంధ్రప్రదేశ్‌ నుంచి రావాల్సిన మామిడి రకాలు అక్కడి అవసరాలకే వినియోగిస్తుండటంతో నగర మార్కెట్లకు వచ్చే మామిడి సరఫరా అనూహ్యంగా పడిపోయింది. గత సంవత్సరం ఇదే సమయంలో మార్కెట్లన్నీ మామిడి దిగుమతులతో ముంచెత్తగా ఈ సారి మాత్రం వాటి సరఫరా తగ్గిపోయింది.  
  • అక్కడక్కడా వస్తున్న మేలు రలకాలను ఢిల్లీ, లక్నో వ్యాపారులు డైరక్టుగా కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. 
  • గత ఏడాది కంటే ధరలు ఎక్కువ దీంతో సాధారణ మార్కెట్లో మామిడి పండ్ల ధర గత సంవత్సరంతో పోలిస్తే రెండింతలు అయ్యింది. హోల్‌ సేల్‌ మార్కెట్లో క్వింటాల్‌ గత సంవత్సరం రూ. 5 వేలు మోడల్‌ ధర కాగా అది ఈ సంవత్సరం రూ. 7 వేలకు చేరింది. రిటైల్‌ మార్కెట్లో కిలో మామిడి కాయలు ( సైజు బట్టి మూడు నుంచి నాలుగు మాత్రమే వస్తాయి) రూ. 90 నుంచి 150 వరకు పలుకుతున్నాయి. ప్రతి సంవత్సరం మార్చి నుం చి జులై వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మామిడి రకాలు ఇక్కడే లభ్యం అయ్యేవి. 
  • అయితే ప్రస్తుతం అన్ని రకాలు అందుబాటులో లేవు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా కేవలం కొన్ని రకాల మామిడి మాత్రమే నగర మార్కెట్లో లభిస్తున్నాయి. గడిచిన ఏడాది వరకు బెనీషా,ఆలంపూర్, తొతపూరి, బంగినపల్లి, ఆల్ఫోన్సో, హిమసాగర్, తదితర రకాలు అందుబాటులో వుండగా ఈ ఏడాది మాత్రం బెనీషా, రకం ఒక్కటే మార్కెట్లోకి అధికంగా వస్తోంది. గత సంవత్సర మార్చి ,ఏప్రిల్, మేమాసాల్లో గడ్డి అన్నారం మార్కెట్‌కు 92,40,239 క్వింటాళ్ళ మామిడి రాగా ఈ సంవత్సరం మాత్రం 74, 406 క్వింటాళ్ళు మాత్రమే రావడాన్ని బట్టి చూస్తే మామిడి సరఫరా తగ్గిపోయిందడానికి నిదర్శనం.   
మరిన్ని వార్తలు