మామిడి మధురం.. చేదు నిజం..!

23 May, 2014 02:55 IST|Sakshi

మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ :  మామిడి, అరటి, బొప్పాయి, సపోట, ద్రాక్ష, దానిమ్మ ఇలా అనేక రకాల పండ్లు కాలాలకు అనుగుణంగా ఆరగిస్తే ఆరోగ్యానికి మంచిది. శరీర ఎదుగుదలకు, పరిపుష్టికి దోహదపడుతాయి. అన్ని కాలాలలో దొరికేది అరటి. వేసవి కాలంలో దొరికేది మాత్రం మామిడి. అయితే పండ్ల వ్యాపారులు కాసులకు కక్కుర్తి పడి చెట్టుమీద కాయలు పండకుండానే కోసి మాగపెడుతున్నారు. తొందరగా పండటం కోసం కాల్షియం కార్భైట్, పొగబెట్టి మాగబెట్టడం వంటి చర్యలతో కాయలను పండ్లుగా మారుస్తున్నారు. అనంతరం బహిరంగ మర్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

 సహజ సిద్ధంగా పండిన పండ్లలో ప్రక్టోజ్, గ్లూకోజ్, కొవ్వు, ప్రొటీన్లు ఉంటాయి. శరీరం నీరసించిపోయినప్పుడు ఇవి ఉత్తేజాన్ని కలిగిస్తాయి. మలబద్ధకం, ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడుతాయి. కృత్రిమంగా మాగబెట్టిన పండ్లలో ఇవి ఉండవు. కాగా, ఆరోగ్యానికి హానికరం. జిల్లాలో ప్రధానంగా మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, చెన్నూర్, కాగజ్‌నగర్ ప్రాంతాల్లో మామిడి వ్యాపారం జరుగుతాయి. ఏటా రూ.11 కోట్ల మామడి పండ్ల వ్యాపారం జరుగుతుంది.

 మామిడిని ఎలా మాగ పెడతారంటే..
 మామిడి పండ్లను కొనుగోలు చేయడం వ్యాపారులకు ఆర్థికంగా పెట్టుబడి ఎక్కువ కావడంతో కాయలను ఎంచుకుంటున్నారు. మామిడి తోటల్లో కాయలు, గాలి దుమారంకు కింద పడిన కాయలను తక్కువ ధరకు కొనుగోలు చేసి గోదాములకు తరలిస్తారు. గ్యాస్ వెల్డింగ్‌కు వినియోగించే కాల్షియం కార్బైట్‌ను కొనుగోలు చేస్తారు.

ఈ రసాయనాన్ని పొట్లాలుగా మారుస్తారు. 20 కిలోల మామిడి కాయల బాక్స్‌లలో, నేలపై రాశులుగా వేసిన కాయల మధ్య ఐదు నుంచి 50 వరకు కార్బైట్ పొట్లాలను మధ్య మధ్యన పెడతారు. ఆ కార్బైట్ గుళికలు పౌడర్‌గా మారి వేడి పుట్టిస్తుంది. ఆ రసాయనాల ప్రతిచర్యతో ఉష్ణోగ్రత పెరిగి కాయలు పండ్లుగా మారుతాయి. నాలుగు రోజులపాటు బాక్స్‌లలో, నేల మీద రాశులుగా ఉన్న మామిడికాయలు పండ్లుగా మారతాయి. పూర్తి పచ్చదనంలోకి వచ్చి మామిడి ప్రియుల నోర్లు ఊరించేలాగా మారుతాయి. అలా తయారైన మామిడి పండ్లను మార్కెట్లోకి రిటైల్ అమ్మకం దారులకు విక్రయిస్తారు. అలా చేతులు మారిన మామిడి పండ్లు మామిడి ప్రియుల చేతికి చేరి కడుపులోకి వెళ్లి అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయి.

 గ్యాస్ ద్వారా పండ్లుగా మార్చడం మరో పద్ధతి
 గ్యాస్ ద్వారా కూడా మామిడి కాయలను పండ్లుగా మార్చడం కొత్త పద్ధతి. గతేడాది మంచిర్యాలలో ప్రారంభమైంది. కాల్షియం కార్బైట్ తక్కువ ఖర్చుతో పండ్లుగా మార్చే వీలున్నప్పటికి పెద్ద మొత్తంలో పండ్లుగా మారడం సాధ్యం కాదు. దాంతో కూలింగ్ స్టోర్ విధానం ద్వారా కాయలను పండ్లుగా మారుస్తున్నారు. ఒకేసారి 8 వేల కిలోల వరకు కాయలను పండ్లుగా మార్చే సౌలభ్యం కూలింగ్ స్టోర్‌లో ఉంటుంది. ఇథిలేన్ అనే గ్యాస్‌ని కూలింగ్ స్టోరేజ్‌లోకి పంపుతారు. పగలంతా కూలింగ్, రాత్రి వేళ మాత్రమే గ్యాస్‌ను స్టోర్‌లోకి విడుదల చేస్తారు. అలా రసాయనాల ప్రభావంతో నాలుగు రోజుల్లోనే కాయలు పండ్లుగా మారతాయి. ఒక మామిడిపండే కాకుండా అరటికాయలను కూడా పండ్లుగా మారుస్తున్నారు. పండ్లను మాగ పెట్టడానికి కూలింగ్ స్టోరేజ్‌లు పెట్టడానికి రూ.25 లక్షల నుంచి రూ.30 వరకు వ్యయం చేస్తున్నారంటే లాభాలు ఎలా ఉన్నాయో తేట తెల్లం అవుతుంది.

 అమలు కాని నిషేధం
 బహిరంగ మార్కెట్‌లో కార్బైట్ విచ్చలవిడిగా దొరుకుతోంది. కిలో విలువ రూ.80 ఉంటుంది. దీనిని స్టీలు రంగు మార్చేందుకు, వెల్డింగ్ కోసం ఉపయోగిస్తారు. పండ్లపై వీటి వాడకాన్ని నిషేధించిన అమలుకావడం లేదు. వ్యాపారులు గోదాముల్లో కార్బైన్‌ను వినియోగించి మాగబెడుతున్నా పట్టించుకోవడం లేదు. వీటి వాడకాన్ని తగ్గిస్తే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన వారు అవుతారు. అధికారుల నిర్లిప్తతను ఆసరాగా చేసుకుని వ్యాపారులు ఏటా రూ.కోట్ల వ్యాపారం చేస్తున్నారు.      

మరిన్ని వార్తలు