పంట నష్ట పరిహారం చెల్లింపులో అవకతవకలు

21 Sep, 2014 00:35 IST|Sakshi

దోమ: పంట నష్ట పరిహారం మంజూరులో అధికారులు అవినీతికి పాల్పడ్డారని, అర్హులకు అన్యాయం జరిగింద ని ఆగ్రహిస్తూ మండల పరిధిలోని మైలారం గ్రామానికి చెందిన రైతులు శనివారం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. 2013 నవంబరులో భారీ వర్షాల కారణంగా మండలంలో వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. అప్పట్లో వీఆర్‌ఓలు, వ్యవసాయాధికారులు గ్రామాల్లో పర్యటించి పంట నష్టపోయిన రైతుల వివరాలను ప్రభుత్వానికి పంపించారు.

అధికారులు అందించిన వివరాల మేరకు ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం సంబంధిత రైతులకు పంట నష్టపరిహారం డబ్బులు విడుదల చేసింది. మైలారం గ్రామంలో 57మందిని అర్హులుగా ఎంపిక చేసి నష్టపరిహారం మంజూరు చేశారు. అయితే నిజంగా పంట నష్టపోయిన రైతులకు కాకుండా అనర్హులకు పరిహారం మంజూరు చేశారంటూ గ్రామానికి చెందిన వందలాది మంది రైతులు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పక్కనే ఉన్న వ్యవసాయ కార్యాలయాన్ని మూసి వేయించారు.

వ్యవసాయ విస్తరణ అధికారి వెంకటయ్యను చుట్టు ముట్టి అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం భూమి కూడా లేనివారికి, వ్యవసాయం అంటే ఏమిటో కూడా తెలియని వారికి పరిహారం మంజూరైందని ఆరోపించారు. పైరవీలు చేసి ఎంతో కొంత ముట్టజెప్పిన వారికే అధికారులు పరిహారం మంజూరు చేయిం చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే సర్వే నెంబరుపై నలుగురైదుగురికి పరిహారం ఎలా వస్తుందంటూ ప్రశ్నించారు.

అవినీతికి పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు అర్హులైన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనికి తహసీల్దార్ జనార్దన్ స్పందిస్తూ రైతుల ఆందోళన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని వారికి నచ్చజెప్పారు.  అయితే రెండు, మూడు రోజుల్లో తమకు న్యాయం చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో ఎంపీటీసీ సుశీలతో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు