పింఛన్లలో ‘వంచన’!

9 Feb, 2020 01:38 IST|Sakshi

ఆసరా వృద్ధాప్య పింఛన్ల పంపిణీలో భారీగా అవకతవకలు

అక్రమంగా తీసుకుంటున్న దాదాపు 15 వేల మంది గుర్తింపు

ఒకే కుటుంబంలోని దంపతులిద్దరూ పొందుతున్నట్లు నిర్ధారణ

సెర్ప్‌ విచారణలో బహిర్గతం..పింఛన్‌ సొమ్ము రికవరీకి ఆదేశాలు

ఇటు మృతిచెందిన వారి పేరిట పింఛన్లు డ్రా చేసినట్లు గుర్తింపు

బాధ్యులైన కార్యదర్శుల నుంచి సొమ్ము రాబట్టేందుకు యత్నాలు

సాక్షి, హైదరాబాద్‌: ‘ఆసరా’పింఛన్ల పంపిణీలో భారీగా అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. నిబంధనలకు విరుద్ధంగా పింఛన్లను కొల్లగొట్టినట్లు తేల్చింది. పండుటాకులకు ఆపన్నహస్తం అందించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ పథకంలో 14,975 మంది అక్రమంగా పింఛన్లను పొందుతున్నట్టు పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) విచారణలో వెల్లడైంది. సామాజిక భద్రత పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు బీడీ, చేనేత, గీత కార్మికులు, ఫైలేరియా, ఎయిడ్స్‌ బాధితులకు రూ.2,016, వికలాంగులకు రూ.3,016 చొప్పున నెలవారీగా పింఛన్‌ను పంపిణీ చేస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో 39,29,753 మంది లబ్ధిదారులకు పింఛన్లను ఇస్తుండగా, ఇందులో 60 ఏళ్లు పైబడిన 12,86,363 మంది వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లను ప్రభుత్వం అందజేస్తోంది. వీటి మంజూరులో అక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు రావడం తో క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన సర్కారు.. కొన్ని చోట్ల కుటుంబంలోని దంపతులిద్దరికీ వృద్ధాప్య పింఛన్లు అందుతున్నట్లు గుర్తించింది. నిబంధనల ప్రకారం ఇద్దరిలో ఒకరికి మాత్రమే పింఛన్‌ ఇవ్వాల్సి ఉంది. కానీ, ఇందుకు భిన్నంగా రాష్ట్రవ్యాప్తంగా 14,975 మంది గత కొన్నేళ్లుగా పింఛన్‌ సొమ్ము పొందుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేల్చింది. దీంతో ఇలా అక్రమంగా పింఛన్‌ తీసుకున్న లబ్ధిదారుల నుంచి సొమ్ము రికవరీ చేయాలని ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

క్షేత్రస్థాయిలో విచారణ
ఆధార్, ఇతరత్రా డాక్యుమెంట్ల ఆధారంగా డబుల్‌ పింఛన్‌ పొందిన లబ్ధిదారుల జాబితాను సేకరించిన ప్రభుత్వం.. దీని ఆధారంగాక్షేత్రస్థాయిలో నిగ్గు తేల్చడానికి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తోంది. ఈ నెల 10 వరకు గుర్తించిన లబ్ధిదారుల ఇంటికి వెళ్లి విచారణ జరపాలని ఆదేశించింది. విచారణ బాధ్యతలను గ్రామ పంచాయతీ కార్యదర్శి, బిల్‌ కలెక్టర్, గ్రామ రెవెన్యూ అధికారులకు అప్పగించింది. విచారణ అనంతరం అనర్హుల వివరాలను అందజేయాలని, వారి నుంచి సొమ్ము రికవరీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

‘కాటి’కి వెళ్లిన వారివీ లూటీ! 
పోస్టాఫీసులు, బ్యాంకు ఖాతాల ద్వారా పంపిణీ చేస్తున్న పింఛన్లు కూడా పక్కదారి పడుతున్నట్లు ప్రభుత్వ అంతర్గత విచారణలో తేలింది. చాలాచోట్ల లబ్ధిదారుల జాబితాలో నుంచి మృతుల పేర్లు తొలగించకపోవడంతో.. వీరి పేరిట జమవుతున్న సొమ్ము నొక్కేస్తున్నట్లు గుర్తించింది. బయోమెట్రిక్‌ సంతకంతో గ్రామ పంచాయతీ కార్యదర్శులే ఈ డబ్బు లు స్వాహా చేస్తున్నట్లు తేల్చింది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 91,442 మందికి సంబంధించిన పింఛన్లను పరిశీలించిన అధికారులు.. ఇందులో 1,792 మంది చనిపోయినట్లు నిర్ధారించారు. వీరిలో 522 మంది పేరిట పింఛన్‌ డబ్బులు డ్రా అయినట్లు గమనించారు. మరణించిన లబ్ధిదారుల పేరుతో గ్రామపంచాయతీ కార్యదర్శులు మొత్తం రూ.94.96 లక్షలు విత్‌డ్రా చేసినట్లు గుర్తించారు. ఈ నిధులను కార్యదర్శుల నుంచి వసూలు చేయడమేగాకుండా శాఖాపరమైన చర్యలు తీసు కోవాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.

రిక‘వర్రీ’ 
ప్రభుత్వ తాజా ఆదేశాలతో కుటుంబంలో ఇద్దరు పింఛన్లు తీసుకుంటున్న వృద్ధుల్లో కొత్త ఆందోళన ప్రారంభమైంది. ఇద్దరిలో ఒకరే తీసుకోవాలనే నిబంధనపై అవగాహన లేకపోవడంతో పాటు ప్రభుత్వం ఇస్తోంది కదా అని తీసుకున్న లబ్ధిదారులు.. ఇప్పుడు సొమ్ము వాపస్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుండటంతో కలవరానికి గురవుతున్నారు. ఈ అక్రమ బాగోతంలో అధికారుల పాత్ర కూడా ఉన్నప్పటికీ, వారిని పక్కనపెట్టి కేవలం లబ్ధిదారులనే బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.

రాష్ట్రంలో వివిధ కేటగిరీల కింద అందజేస్తున్న ఆసరా పింఛన్ల వివరాలు..
వృద్ధులు: 12,86,363
వికలాంగులు: 4,98,565
వితంతువులు: 14,52,545
చేనేత కార్మికులు : 37,569
గీత కార్మికులు: 63,162
హెచ్‌ఐవీ బాధితులు: 33,229
బోదకాలు వ్యాధిగస్తులు: 14,403
బీడీ కార్మికులు: 4,08,755
ఒంటరి మహిళలు: 1,35,162

>
మరిన్ని వార్తలు