మంజీర పానీ... మచిలీ కా మజిలీ

22 Jun, 2014 23:41 IST|Sakshi

మెదక్: మెతుకుసీమలోని మంజీర నది చేపల సంపదకు నిలయంగా మారింది. చుట్టూరా ప్రవహించే మంజీర నీరు ఆధారంగా ఏర్పాటు చేసిన మత్స్య బీజ క్షేత్రంలో ఈ సంవత్సరం మూడు కోట్ల చేప పిల్లల ఉత్పత్తి లక్ష్యంగా అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. తెలంగాణలోని ఐదు జిల్లాలకు మెదక్‌లో ఊపిరి పోసుకున్న చేప పిల్లలనే పంపిణీ చేయనున్నారు. 38 వేల మంది మత్స్య కార్మికులకు ఉపాధి కల్పించే ఈ మత్స్య బీజ క్షేత్రం ఏడాదికి సుమారు రూ.13.36 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఇప్పటికే రెండు టన్నుల తల్లి చేపలు సిద్ధంగా ఉండగా.. పిల్లలను ఉత్పత్తి చేసేందుకు మంజీర వరదల కోసం ఎదురుచూస్తున్నారు.
 
 తెలంగాణ రాష్ట్రంలో మెదక్, పోచంపాడు, కరీంనగర్ పట్టణాల్లో మత్స్య బీజక్షేత్రాలున్నాయి. ఇందులో మెదక్ 3 కోట్లు, పోచంపాడు 3.5 కోట్లు, కరీంనగర్‌లో 1.5 కోట్ల చేప పిల్లలు ఉత్పత్తి కానున్నాయి.
 
 మెదక్ కేంద్రం నుంచి రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మేడ్చల్, మోమిన్‌పేట, ఇబ్రహీంపట్నం, హైదరాబాద్ జిల్లాలోని రాజేంద్రనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ, మెదక్ జిల్లాలకు చేప పిల్లలను పంపిణీ చేయనున్నారు.  జిల్లాలో మొత్తం 455 మత్స్య సహకార సంఘాలు, 45 మత్స్యకార మహిళా సంఘాలు ఉన్నాయి.
 
 జిల్లాలోని వంద ఎకరాల ఆయకట్టు పైబడ్డ 686 చెరువులకు ఇక్కడి నుంచే సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేస్తారు. ఇవికాక చిన్న కుంటలు, చెరువులకు కూడా చేప పిల్లలను పంపిణీ చేస్తారు. చెరువుల లీజు ద్వారా రూ.9 లక్షలు, చేప విత్తనాల ద్వారా రూ.2.26 లక్షలు, లెసైన్స్ రెన్యువల్ ద్వారా రూ.2.10 లక్షలు ఆదాయం వస్తుంది. జిల్లాలో మొత్తం 1200 మంది మత్స్యకారులకు లెసైన్స్‌లు ఉన్నాయి.  కాగా మెదక్‌లోని మహబూబ్‌నహర్ కెనాల్ ఒడ్డున మత్స్య బీజ క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ నిర్మించిన విశాలమైన తొట్లలోకి మంజీర నీరు వచ్చేటట్లుగా ఏర్పాటు చేశారు. చేప విత్తనాల ఉత్పత్తికోసం ఇప్పటికే రెండు టన్నుల తల్లి చేపలను పెంచుతున్నారు. వాటికి ఫీడింగ్‌కు కూడా ఇస్తున్నారు. మెదక్ కేంద్రంలో కట్ల, రోహు, మ్రిగాల, బంగారుతీగ చేప పిల్లలను ఉత్పత్తిచేస్తారు. కట్ల రకం ఫ్రైసైజ్ (2 నుంచి 2.5.సె.మి.) చేపపిల్లలను  లక్షకు రూ.750లకు విక్రయిస్తారు. రోహురకం రూ.5వేలు, మ్రిగాల రకం రూ.4వేలు, బంగారు తీగరకం రూ.3,500ల చొప్పున విక్రయిస్తారు. వీటి రవాణా కోసం అవసరమైన ఆక్సీజన్‌తో కూడిన పాలిథిన్ కవర్లలో చేప పిల్లలను నిలువ ఉంచి మత్స్యకారులకు సరఫరా చేస్తారు.
 
 జిల్లాలోని పోచారం ప్రాజెక్ట్ పరిధిలో గల బూర్గుపల్లి, పోచారం, శెట్‌పల్లి సంగారెడ్డి, రాజిపేట, పరమళ్ల, పొల్కంపేట, హల్దివాగు పరిధిలోని చిన్నశంకరంపేట, చందంపేట, మాసాయిపేట, వెల్దుర్తి, తూప్రాన్, కొప్పులపల్లి, కొంతాన్‌పల్లి, దొంతితోపాటు సింగూర్ ప్రాజెక్ట్ పరిధిలోని పది కిలోమీటర్ల పరిధిలోపల మత్స్యకారులకు చేపలు పట్టుకునేందుకు లెసైన్సులు ఇస్తారు. అయితే ఈసారి వర్షాలు ఇంకా ప్రారంభం కానందువల్ల చేపపిల్లల ఉత్పత్తి ప్రారంభం కాలేదు.
 
 మత్స్యకారులకు ఉపాధి
 జిల్లాలోని 38 వేల మంది మత్స్యకారులకు చేపల విక్రయం ద్వారా యేటా సుమారు రూ.10 కోట్ల ఆదాయం వస్తుంది. మత్స్యకారుల ఉపాధి దృష్ట్యా సబ్సిడీపైనే చేప పిల్లలను విక్రయిస్తున్నాం. కనిష్టంగా సొసైటీకి 12,500 చేప పిల్లలను అందిస్తాం. ప్రమాద బీమా పథకం కింద మత్స్యకారులకు రూ.2 లక్షల సహాయాన్ని అందజేస్తున్నాం. సభ్యులందరికీ ప్రమాదబీమా కల్పిస్తున్నాం. వర్షాలు పడగానే చేప పిల్లల ఉత్పత్తి ప్రారంభిస్తాం. మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తాం.
 - ఆర్.లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ డెరైక్టర్
 

మరిన్ని వార్తలు