ధార లేని మంజీర

5 Aug, 2019 10:19 IST|Sakshi
మంజీర నదిపై జహీరాబాద్‌ నీటి పథకం వద్ద నీరు లేని దృశ్యం

ఎగువన వానలు లేక నేటికీ ఎడారిలానే..

వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలైనా గడ్డుకాలమే 

ఖేడ్, అందోల్, జహీరాబాద్‌ నీటి పథకాలన్నీ మూత

ఇప్పటికే తాగునీటికి కష్టాలు పడుతున్న జనం

గత ఏడాది ఈపాటికి భారీగా వరద నీరు

సాక్షి, నారాయణఖేడ్‌: జిల్లా జీవ నది మంజీర ఇంకా వెలవెలబోతోంది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా నదిలో నీటి జాడలే లేవు. ఇప్పటికే నీటితో కళకళలాడాల్సిన నదిలోకి నీరు రాకపోవడంతో జిల్లావాసులు కలవర పడుతున్నారు. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నా మంజీరా నదిలో ఆ జాడలు మాత్రం కానరావడం లేదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నా దానికి ఉప నదిగా ఉన్న మంజీరలో మాత్రం నీరే లేదు.

గత ఏడాది ఈ సమయం వరకే మంజీరా నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు ఎండిపోయే కన్పిస్తోంది. కర్ణాటకలో నెల క్రితం కురిసిన భారీ వర్షంతో మంజీరా నదిలోకి వరద వచ్చింది. అప్పటికే వేసవి కాలంలో నది పూర్తిగా ఎండిపోయి ఉండడంతో వచ్చిన వరద నీరు కాస్త భూమిలోకి ఇంకిపోయింది. నది తిరిగి యథా పరిస్థితికి వచ్చి చేరింది. కర్ణాటక రాష్ట్రంలో పుట్టి ప్రవహించే మంజీరా నది జిల్లాలోని నాగల్‌గిద్ద మండలం గౌడ్‌గాంజన్‌వాడ వద్ద  ప్రవేశిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నది ప్రవేశ ప్రాంతం నుండి ఎక్కడా నీరు రాలేదు. కర్ణాటక రాష్ట్రంలో కురిసే భారీ వర్షాలు, వరదలతో నదిలోకి నీరు వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయి.

కర్ణాటక రాష్ట్రం బీదర్‌ ప్రాంతంలో కూడా వర్షాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కర్ణాటకలో కురిసిన వర్షం వల్ల మంజీరాకు ఎగువన బీదర్‌ జిల్లా హుమ్నాబాద్‌ ప్రాంతంలో ఉన్న కరంజా ప్రాజెక్టులోకి కొంత నీరు వచ్చి చేరింది. ఈ ప్రాజెక్టు నుండి నీటిని కిందకు వదలడం లేదు. కరంజా ప్రాజెక్టులోకి భారీగా వరదలు వచ్చి చేరినప్పుడే ఈ ప్రాజెక్టు నుండి దిగువకు వరద నీరు వదిలే అవకాశం ఉంది. అప్పుడే నదిలోకి  నీరు వస్తుంది. మంజీరా నదిపై ఉన్న సింగూరు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.91టీఎంసీలు కాగా ఇప్పటివరకు ప్రాజెక్టులో ఉన్న నీరు 0.44 టీఎంసీలు మాత్రమే. 

తాగునీటికి కష్టకాలమే..
మంజీరాపై ఆధారపడి నారాయణఖేడ్‌తోపాటు జహీరాబాద్, అందోల్‌ నియోజకవర్గాల నీటి పథకాలు పని చేస్తున్నాయి. నదిలో నీరు లేని కారణంగా మూడు నెలలుగా నీటి పథకాలు వట్టిపోయాయి. రెండు నెలల క్రితం వరకు సింగూరు సమీపంలోని పెద్దారెడ్డిపేట్‌ నుండి నారాయణఖేడ్, అందోల్, జహీరాబాద్, మెదక్‌ నియోజకవర్గాలకు కలిపి మిషన్‌ భగీరథ అధికారులు 953 గ్రామాలకు తాగునీటిని అందించారు. రెండు నెలలుగా ప్రాజెక్టులో చుక్కనీరు లేని కారణంగా నీటి పథకాలన్నీ వృథాగానే మారాయి. ఫలితంగా వందల గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తింది. చాలా గ్రామాల్లో బోర్లను కిరాయికి తీసుకోవడం, ట్యాంకర్లను ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తున్నారు. ఈ నీరు కూడా గ్రామీణులకు అవసరమైన మేర సరిపోవడం లేదు. 

వృథాగా నీటి పథకాలు.. 
నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని మెజార్టీ గ్రామాలకు మంజీర నది నుండే తాగునీరు వెళ్తుంది. బోరంచ ఎన్‌ఏపీ పథకం ఫేజ్‌ 1 కింద 18 గ్రామాలకు గాను 12 గ్రామాలకు తాగునీరు వెళ్తుంది. ఫేజ్‌ 2 కింద 75 గ్రామాలకు గాను 66 గ్రామాలకు, శాపూర్‌ పథకం ద్వారా 40 గ్రామాలకు గాను 20గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. గూడూరు నాబార్డు పథకం ద్వారా నాగల్‌గిద్ద, కంగ్టి మండలాల్లోని 66 గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుంది. ఈ నీటి పథకాల ఇన్‌టెక్‌ వెల్‌లు అన్నీ మంజీర నదిపైనే ఉన్నాయి. నది ఎండిపోవడంతో సమీప గ్రామాలతోపాటు నారాయణఖేడ్‌ పట్టణంలోని పలు బోర్లు కూడా గ్యాప్‌ ఇస్తున్నాయి. జహీరాబాద్, అందోల్‌ నియోజకవర్గాలకు తాగునీటి సరఫరా జరిగే ఇన్‌టెక్‌ వెల్‌లు కూడా మంజీర నదిపైనే ఉన్నాయి. వీటివద్ద కూడా నీరు ఎండిపోయింది. నది ఎండడంతో బోర్లు కూడా ఎండిపోయి గ్యాప్‌ ఇస్తున్నాయి.  

మరిన్ని వార్తలు