మాన్‌సూన్‌... మారింది సీన్‌

2 Oct, 2019 08:54 IST|Sakshi

తొలకరి చినుకులలో కాసేపు తడవడానికి ఎంతగా తహతహలాడతామో... కాస్త వర్షాలు ముదరగానే పనులెక్కడ కావోనని అంతగా భయపడతాం. పనులుంటేనే బయటకు కదలడానికి భయపెట్టే రుతుపవనాల సీజన్‌లో జాలీగా జర్నీ చేసే సరదా ఉంటుందా? అంటే ఉండడమే కాదు ఆ సరదా పెరుగుతోంది కూడా అంటున్నారు ట్రావెల్‌ ఎక్స్‌పర్ట్స్‌.

సాక్షి, సిటీబ్యూరో:సాధారణంగా రుతుపవనాల సమయంలో ట్రెక్కర్స్, అడ్వంచర్‌ యాత్రికులు మాత్రమే తప్ప సాధారణ టూరిస్ట్‌ల సంఖ్య ఎక్కువ ఉండదనేది ట్రావెల్‌ సంస్థల అంచనా. అయితే గత కొంతకాలంగా వారి ఆ అంచనా తిరగబడిందని, ఈసారి 70 శాతం ట్రావెల్‌ ఎంక్వయిరీలు సాధారణ పర్యాటకుల నుంచే వచ్చాయని ట్రావెల్‌ సంస్థలు వెల్లడించాయి. గత కొంత కాలంగా ఉన్న ఈ ట్రెండ్‌ ఈ సారి మరింత స్పష్టంగా కనిపించిందని, గత ఏడాది కంటే సాధారణ పర్యాటకుల సంఖ్య 20 శాతం పెరిగిందని అంటున్నాయి. వర్షాల వల్ల వచ్చే ఇబ్బందులకు ఇప్పుడు అత్యాధునికమైన అన్ని రకాల పరిష్కారాలు అందుబాటులో ఉండడమే దీనికి కారణమని అంటున్న వీరు వెల్లడించిన మరికొన్ని విశేషాలు...

ఎంచుకుంటున్నారిలా...
ఈ సీజన్‌లో ట్రావెలర్స్‌ ప్రధానంగా రిసార్ట్స్‌కు దగ్గరలో ఉండే బీచ్‌ వెకేషన్స్, స్టేకేషన్స్, కొండ ప్రాంతాలకు సమీపంలోని జలపాతాలు, వీటితో పాటుగా మంచి ఆహారం ఉన్న ప్లేస్‌లనే ఎంచుకుంటున్నారు. మహారాష్ట్రలోని లోనోవాలా, సిల్వస్సా, లావాసా, సాప్యుటరా, మహాబలేశ్వర్, దమన్, నాసిక్‌లు ఈ సీజన్‌లో ఎక్కువ మంది ఎంచుకునే స్టేకేషన్స్‌గా వృద్ధి చెందుతున్నాయి. అలాగే ముస్సోరి, నైనిటాల్‌ వంటి హిల్‌ స్టేషన్లు ఎంచుకుంటున్నారు. జైసల్మీర్, జైపూర్, బికనీర్, జోథ్‌పూర్, ఉదయ్‌పూర్‌... వైపుగా రోడ్‌ ట్రిప్స్‌ నడుస్తున్నాయి. అడ్వంచరిస్టులు ఢిల్లీ టు లడఖ్‌కి బాగా రాకపోకలు సాగిస్తున్నారు. తీవ్రమైన వర్షపాతాన్ని ఆస్వాదించేవాళ్లు డార్జిలింగ్, అస్సాం, మేఘాలయ వంటి పచ్చని, పర్యావరణహిత వాతావరణాన్ని ఆస్వాదించడానికి. మాన్‌సూన్‌ ట్రావెలర్స్‌కు ప్రియమైనవిగా మున్నార్, వాయనాడ్, తెక్కడి, కూర్గ్, కబిని ప్రాంతాలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. అయితే వీటిలో దేశంలోని ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతానికి దగ్గర్లో ఉన్న వాటినే ఎంచుకుంటున్నారు.

మాన్‌సూన్‌ ట్రావెలింగ్‌ పెరిగింది...
గతంతో పోలిస్తే వర్షాల సమయంలో ప్రయాణాలు చేసేవారు బాగా పెరిగారు. మాకు వస్తున్న ఎంక్వయిరీల్లో అత్యధిక భాగం ఫ్యామిలీ సెగ్మెంట్‌వే కావడం విశేషం.  – కరణ్‌ ఆనంద్, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ 

మరిన్ని వార్తలు