మంథని సీఐపై వేటు

6 Apr, 2017 02:00 IST|Sakshi
మంథని సీఐపై వేటు

హెడ్‌ క్వార్టర్స్‌కు అటాచ్‌ చేసిన సీపీ దుగ్గల్‌
మధు మృతదేహానికి 7న రీ పోస్టుమార్టం
పోలీసుల అదుపులో ఆరుగురు అనుమానితులు
హోంమంత్రిని కలసిన మృతుడి తల్లిదండ్రులు
హైకోర్టు జడ్జి సమక్షంలో పోస్టుమార్టంకు వినతి
నేడు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌


సాక్షి, పెద్దపల్లి: ప్రేమ వ్యవహారం కారణంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్‌ శివారులో అనుమానాస్పదంగా శవమై కనిపించిన మధుకర్‌ సంఘటన మరో కీలక మలుపు తిరిగింది. ఏకంగా రామగుండం పోలీస్‌ కమిషనర్‌ విక్రంజిత్‌ దుగ్గల్‌ రంగంలోకి దిగారు. మంగళవారం మధుకర్‌ స్వగ్రామమైన ఖానాపూర్‌ను సందర్శించి, అతడి తల్లిదండ్రులతో మాట్లాడారు. మధుకర్‌ మృతికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. 10 గంటల్లోపే మంథని సీఐపై వేటు వేశారు. సీఐని హెడ్‌క్వార్టర్‌కు అటాచ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేసును పక్కదారి పట్టించేందుకు సీఐ ప్రయత్నిస్తున్నారంటూ మధుకర్‌ తల్లిదండ్రుల ఆరోపణల మేరకు సీఐని హెడ్‌క్వార్టర్‌కు అటాచ్‌ చేశామని దుగ్గల్‌ ప్రకటించారు. అయినా అంతర్గతంగా ఏదో జరిగిందనే అనుమానాలకు తావిస్తోంది. గోదావరిఖని డివిజన్‌ పోలీసులతో సంబంధం లేకుండా మధుకర్‌ మృతిపై పెద్దపల్లి ఏసీపీ సింధూశర్మతో ప్రత్యేకంగా దర్యాప్తు చేయిస్తున్నా.. మంథని సీఐని వీఆర్‌లో పెట్టడం పోలీస్‌శాఖలో చర్చనీయాంశంగా మారింది.

పోలీసుల అదుపులో ఆరుగురు
మంథని సీఐ ప్రభాకర్‌ స్థానంలో నటేష్‌గౌడ్‌కు బుధవారం పోస్టింగ్‌ ఇచ్చారు. ఈయన బాధ్యతలు చేపట్టిన వెంటనే మధుకర్‌ స్వగ్రామం ఖానాపూర్‌ వెళ్లి, మధుకర్‌ తల్లిదండ్రులు అనుమానిస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని పెద్దపల్లికి తరలించి డీసీపీ విజేందర్‌రెడ్డి సమక్షంలో విచారణ చేపడుతున్నట్లు సమాచారం. వీరిలో సర్పంచ్‌తో పాటు ఆయన కుమారుడు ఉన్నట్టు సమాచారం. ఈ ఆరుగురు కూడా మధుకర్‌ ప్రేమించిన యువతి బంధువులేనని తెలుస్తోంది. మధుకర్‌ మృతి కేసులో మంథని సీఐ ప్రభాకర్‌ మొదటి నుంచీ సరైన రీతిలో స్పందించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మృతదేహానికి పోస్టుమార్టం చేయడానికి ముందే మధుది ఆత్మహత్య అని బంధువులతో చెప్పాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. మరణంపై అనుమానాలు వ్యక్తం చేయగా ఎదురుప్రశ్నలతో నోరెత్తకుండా చేశాడని చెబుతున్నారు. మధుకర్‌ తల్లిదండ్రులు ఆరుగురిని అనుమానిస్తూ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సమాచారం. ప్రభాకర్‌ ఇక్కడ పని చేస్తున్నప్పటి నుంచి వివాదాస్పదుడిగానే ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు పలువురు చెబుతున్నారు.

7న రీ పోస్టుమార్టం
మధుకర్‌ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయాలని వివిధ సంఘాలు డిమాండ్‌ చేస్తుండటంతో పోలీసులు దిగొచ్చారు. రీ పోస్టుమార్టం జరపాలని మంథని తహసీల్దార్‌కు పోలీసులు లేఖ రాశారు. ఆయన కాకతీయ మెడికల్‌ కాలేజీకి లేఖ రాయడంతో ఈ నెల 7న రీ పోస్టుమార్టం చేసేందుకు తేదీ ఖరారైంది. అయితే మెడికల్‌ కాలేజీ వైద్యుల రీ పోస్టుమార్టంపై తమకు నమ్మకం లేదంటూ మృతుడి తల్లిదండ్రులు బుధవారం హైదరాబాద్‌లో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిశారు. హైకోర్టు జడ్జి సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించాలని కోరారు. దీనిపై గురువారం హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు వారు తెలిపారు.

మరిన్ని వార్తలు