ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం

8 Oct, 2019 11:21 IST|Sakshi

ప్రభుత్వ ఉద్యోగులంతా జేఏసీగా ముందుకు రావాలి

ప్రభుత్వ విధానంతోనే ఆర్టీసీకి నష్టాలు

టీపీసీసీ ఉపాధ్యక్షుడు శ్రీధర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు

కార్మికులకు సంఘీభావంగా నిరసన

సాక్షి, మంథని: ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడంతోనే సమ్మెలోకి వెళ్లారని, వారి పోరాటానికి కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మంథని ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబు, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సమస్యల సాధన కోసం మూడు రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మంథనిలో శ్రీధర్‌బాబు, పెద్దపల్లిలో విజయరమణారావు సోమవారం సంఘీభావం తెలిపారు. కార్మికులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూ.60 వేల కోట్ల ఆర్టీసీ ఆస్తులను పక్కదారి పట్టించే కుట్ర జరుగుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చిన్నచిన్న తప్పిదాలు ఉండేవని, రాష్ట్రం వస్తే అలాంటి సమస్యలను పరిష్కారమవుతాని సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్తోందని పేర్కొన్నారు. సమ్మెతో ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని తెలిసినా గత నెల కార్మిక సంఘాలు నోటీస్‌ ఇస్తే సమస్యలకు పరిష్కారం చూపకుండా ముగ్గురు అధికారులతో కమిటీ వేస్తారా అని ప్రశ్నించారు. ప్రజాసామ్య బద్ధంగా ప్రజలతో ఎన్నుకోబడిన మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి చొరవ చూపకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. ఆర్టీసీలో పనిచేస్తున్న 48 వేల మంది కార్మికులను తీసేసినట్లు ముఖ్యమంత్రి ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. సకల జనుల సమ్మె సమయంలో 27 రోజులు సమ్మె చేసినా ఒక్క కార్మికుడిని కూడా సస్పెండ్‌ చేయలేదన్నారు. కార్మికులను ఒక్క రోజులో విధుల నుంచి తీసేస్తే చూస్తూ ఉరుకోమని హెచ్చరించారు.  

కార్మికులకు అన్యాయం జరిగితే రాష్ట్రంలో ప్రళయమే వస్తుంది హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల వేతనం కేవలం రూ.13 వేల నుంచి రూ.30 వేలు దాటడం లేదని, సీఎం మాత్రం రూ.50 వేలు తీసుకుంటున్నారనడం సరికాదని పేర్కొన్నారు. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో డీజిల్‌ ధర రూ.70.25 ఉండగా మన రాష్ట్రంలో రూ.73.00 ఉందన్నారు. డీజిల్‌పై జీఎస్‌టీ, వ్యాట్‌ 27 శాతం మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌లో 21 శాతం ఉందన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులంతా ఏకతాటిపైకి రావాలన్నారు. అన్ని ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడి ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలుపాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు 42 రోజులు సకలజనుల సమ్మెలో పాల్గొని జీతాన్ని కోల్పోయిన కార్మికులు ఇప్పుడు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ప్రశ్నిస్తే రాజరిక వ్యవస్థను కేసీఆర్‌ గుర్తు చేస్తున్నారన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రజలంతా సహృదయంతో అర్థం చేసుకుని సహకరించాలన్నారు. కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా నిలవలేదని గుర్తుచేశారు. కార్యక్రమాల్లో మున్సిపల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వొడ్నాల శ్రీనివాస్, కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌ శశిభూషణ్‌కాచే, జిల్లా కార్యదర్శి సెగ్గెం రాజేశ్, ఎస్సీసెల్‌ అధ్యక్షుడు మంథని సత్యం, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తొట్ల తిరుపతి, మాజీ జెడ్పీసీసీ చొప్పరి సదానందం, ఆరెల్లి కిరణ్, జంజర్ల శేఖర్, ఆర్టీసీ సంఘం నాయకులు ఐలయ్య, కేకే.రెడ్డి, రాజయ్య,  నూగిళ్ల మల్లయ్య, వేముల రామ్మూర్తి, జగదీష్, సురేశ్‌గౌడ్, బొడ్డుపల్లి శ్రీను, రాజమల్లు, రాజు, ఎంఏ.ఖయ్యూం, ఎస్‌కే.అహ్మద్, నర్సింగం, కొమురయ్య, ఎంఏ. అలీం, బాబా  తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు