మానుకోటకు రాష్ట్ర మంత్రి పదవి దక్కేనా..!

7 Nov, 2018 11:31 IST|Sakshi

ఇప్పటివరకు కాంగ్రెస్‌ ఏడు సార్లు , కాంగ్రెస్‌ (ఐ) ఒక సారి

సీపీఐ, టీడీపీ చెరో రెండు సార్లు,ఒక్కోసారి టీఆర్‌ఎస్, పీడీఎఫ్, ఎస్‌సీఎఫ్‌

ఎక్కువ పర్యాయాలు కాంగ్రెస్‌ కైవసం

1994 నుంచి రెండోసారి ఎన్నిక కాని పరిస్థితి

రసవత్తరం మానుకోట రాజకీయం

సాక్షి,మహబూబాబాద్‌ :1952 నుంచి 2014 వరకు మానుకోట నియోజకవర్గానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందగా ఒక సారి కాంగ్రెస్‌ (ఐ), సీపీఐ, టీడీపీ చెరో రెండు సార్లు, టీఆర్‌ఎస్, పీడీఎఫ్, ఎస్‌సీఎఫ్‌ ఒక్కోసారి గెలుపొందాయి. ఎక్కువ పర్యాయాలు కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. 1994 నుంచి 2014 వరకు రెండోసారి అభ్యర్థులకు వివిధ కారణాలతో అవకాశం దక్కలేదు. ఇప్పటివరకు మానుకోట నియోజకవర్గానికి మంత్రి పదవి కూడా రాలేదు. ఆ అంశాలపైనే ఈ ఎన్నికల్లో చర్చ కొనసాగుతుంది. మానుకోట రాజకీయం రసవత్తరంగా మారింది.

ముఖచిత్రం ఇలా..
1952లో చిల్లంచెర్ల నియోజకవర్గంగా ఆవిర్భవించింది. ఆ సమయంలో డోర్నకల్‌ నియోజకవర్గం ఏర్పడలేదు. 1957, 1962 చిల్లంచెర్ల నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించారు. 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉంది. 1967లో మానుకోట నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. 2009లో పునర్విభజనలో భాగంగా మానుకోట నియోజకవర్గం ఎస్టీకి రిజర్వు కావడంతో పాటు పార్లమెంట్‌ కేంద్రంగా ఏర్పాటు చేశారు.

1994 నుంచి రెండోసారి దక్కని అవకాశం...
1972 నుంచి 1989 వరకు ఐదు పర్యాయాలు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా జెన్నారెడ్డి జనార్దన్‌రెడ్డి గెలుపొందారు. ఆ తరువాత 1994 నుంచి 2014 వరకు రెండోసారి గెలుపొందిన అభ్యర్థులు లేరు. 1994లో కాంగ్రెస్‌ అభ్యర్థి జనార్దన్‌రెడ్డిపై సీపీఐ అభ్యర్థి బండి పుల్లయ్య గెలుపొందారు. 1999లో టీడీపీ అభ్యర్థి శ్రీరాం భద్రయ్య గెలుపొందారు. 2004లో ఆయనకు పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతో మరోసారి అవకాశం టేకుండా పోయింది. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి వేం నరేందర్‌రెడ్డి గెలుపొందారు. 2009లో ఎస్టీకి రిజర్వు కావడంతో వేం నరేందర్‌రెడ్డికి మళ్లీ పోటీ చేసే అవకాశం దక్కలేదు. 2009లో మాలోత్‌ కవిత కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అజ్మీరా చందులాల్‌పై గెలుపొందారు. 2014లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి మాలోత్‌ కవితకు టికెట్‌ ఇచ్చినా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బానోత్‌ శంకర్‌నాయక్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. అలా వివిధ కారణాలతో కొంత మందికి టికెట్‌ రాకపోవడం టికెట్‌ వచ్చినా ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వకపోవడం మూలంగా రెండోసారి గెలిచే అవకాశం లేకుండా పోయింది.
 
చరిత్ర తిరగరాసేనా..
2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరుపున బానోత్‌ శంకర్‌నాయక్‌ గెలుపొందారు. ఈ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో శంకర్‌నాయక్‌ గెలుపొందితే చరిత్రను తిరగరాసినట్టే. దానిపైనే మానుకోట నియోజకవర్గంలో సర్వత్రా చర్చ కొనసాగుతుంది.
 
మంత్రి పదవి దక్కేనా...!
నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరగగా ఎక్కువ పర్యాయాలు కాంగ్రెస్‌ గెలుపొందింది. వారిలో కూడా ఎవరికీ మంత్రి పదవి దక్కలేదు. ఇంత వరకు మానుకోట నియోజకవర్గం నుంచి గెలిచిన అభ్యర్థులకు మంత్రి పదవి రాకపోవడం పట్ల నియోజకవర్గ ప్రజలు నిరాశతో ఉన్నారు. ఈసారైనా గెలుపొందిన అభ్యర్థులకు మంత్రి పదవి దక్కుతుందా అని చర్చించుకుంటున్నారు.
 
రసవత్తరంగా రాజకీయం...
టీఆర్‌ఎస్‌ పార్టీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించడంతో బానోత్‌ శంకర్‌నాయక్‌ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. మహాకూటమి నుంచి నేటికీ అధికారికంగా జాబితా ప్రకటించకపోవడంతో అభ్యర్థి ఖరారు కాక ఆశావాహులంతా ఢిల్లీకి పరిమితమయ్యారు. కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌ పేరు ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఆశించిన జాటోత్‌ హుస్సేన్‌నాయక్‌ టికెట్‌ రాదని భావించి ఈ నెల ఆరో తేదీన బీజేపీలో చేరారు. టీడీపీ నుంచి టికెట్‌ ఆశించిన బానోత్‌ మోహన్‌లాల్‌ బీఎల్‌ఎఫ్‌ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నెల తొమ్మిదో తేదీన బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించనున్నారు. మహాకూటమి అభ్యర్థి ఎవరనే విషయంపైన ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మానుకోట నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ ఉండే పరిస్థితి కన్పిస్తుంది.  బీజేపీ నుంచి హుస్సేన్‌ నాయక్‌తో పాటు మరికొంత మంది ఆశావాహులు ఉన్నారు. బీజేపీ నుంచి అధికారికంగా అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. హుస్సేన్‌నాయక్‌ అణుచరులు మాత్రం హుస్సేన్‌నాయక్‌కే టికెట్‌ వచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు