‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను మేనిఫెస్టోలో చేర్చండి’

1 Nov, 2018 01:44 IST|Sakshi
సమీకృత ఎన్నికల ప్రణాళిక–2018ను ఆవిష్కరిస్తున్న పురుషోత్తమ్‌రెడ్డి, దిలీప్‌రెడ్డి, నరసింహా రెడ్డి, లీలా లక్ష్మారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, కేశవ్‌ రెడ్డి తదితరులు

హైదరాబాద్‌: అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దిష్టంగా పొందుపర్చి ఆ మేరకు నడుచుకోవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశం, రాష్ట్రంలో కాలుష్యం ప్రధాన సమస్యగా మారిందని, పర్యావరణ పరిరక్షణకు ఏ రాజకీయ పార్టీ కూడా తగిన నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమన్నా రు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రివల్యూషన్‌ (సీజీఆర్‌) ఆధ్వర్యంలో ‘ప్రిపేరింగ్‌ తెలంగాణ ఫర్‌ ఎ గ్లోబల్‌ ఛేంజ్‌’పేరుతో 17 అంశాలతో రూపొందించిన సమీకృత ఎన్నికల ప్రణాళిక–2018ను ఆవిష్కరించారు.

ఇండిపెండెట్‌ పాలసీ ఎక్స్‌పర్ట్‌ డాక్టర్‌ నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్‌ పురుషోత్తమ్‌రెడ్డి, సాక్షి జర్నలిజం స్కూల్‌ ప్రిన్సిపాల్‌ దిలీప్‌రెడ్డి, సీజీఆర్‌ చైర్మన్‌ లీలా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రూపొందించిన 17 అంశాల్లో ఒక్కో అంశంపై ఆయా రంగాల నిపుణులు ప్రసంగించారు. మేనిఫెస్టోలో ప్రధానంగా జీవావరణ సంబంధమైన జీవనోపాధి, హరిత నైపుణ్యం, పర్యావరణ సుస్థిరాభివృద్ధి, ఇంధనాలు, ఆహార భద్రత వంటి అంశాలను పొందుపర్చినట్లు తెలిపారు. ఈ మేనిఫెస్టోను అన్ని పార్టీల అధినాయకులకు అందిస్తామని చెప్పారు. సీజీఆర్‌ ఆధ్వర్యంలో నవంబర్‌ 17న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతో ఢిల్లీలో రౌండ్‌టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో శాస్త్రవేత్త డాక్టర్‌ టి.ఇంద్రసేనారెడ్డి, పర్యావరణ ఇంజనీర్‌ డాక్టర్‌ కేశవరెడ్డి, పర్యావరణ వేత్తలు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు