లాకప్‌డెత్‌పై ఎన్నెన్నో అనుమానాలు

9 Jul, 2015 04:08 IST|Sakshi

పట్టణ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం జరిగిన లాకప్‌డెత్‌పై పలు అనుమానాలకు తావిస్తోంది. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన అశోక్ వెంకట్ మృతిపట్ల పోలీసుల సమాధానాలు  అనుమానాలు కలిగిస్తున్నాయి. తిరుపతికి వెళ్లి తిరుగు ప్రయాణంలో మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌లో దిగిన వెంకట్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు ఎందుకు వెళ్లాడు? అనే విషయం ఇప్పటికీ మిస్టరిగానే ఉంది.  స్టేషన్‌కు వెళ్లిన వ్యక్తిని సాయంత్రం వరకు పోలీసులు ఎందుకు ఉంచారు? అనే విషయం అంతుచి క్కడం లేదు. ఇటీవల మూడు మా సాల క్రితమే దొంగతనం కేసులో అరెస్టు చేసిన వ్యక్తి వన్ టౌన్ పోలీసులు స్టేషన్‌లో ఉంచగా చనిపోయాడు.
 
  మూడు మాసాల కాలంలోనే ఇద్దరు వ్యక్తులు స్టేషన్‌లో చనిపోవడం పట్ల అనుమానాలు తావిస్తున్నాయి. మంగళవారం అశోక్‌వెంకటి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్నఎస్పీ దుగ్గల్ వెంటనే సందర్శించి కస్టోడియల్ డెత్‌గా భావిస్తున్నామని, విచారణ జరిపిస్తామని ప్రకటించారు. కాగా బుధవారం అశోక్ వెంకట్ మృ తిపై స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్‌పీ గంగారామ్, ఆర్డీఓ కిషన్‌రావులు విచారణ జరిపించారు. అశోక్ వెంకట్ సికింద్రాబాద్‌లో వంటలమేస్త్రీగా పని చేస్తాడని, కూతురి వివాహం అనంతరం తిరుపతికి వెళ్లి వస్తూ మార్గమధ్యంలో మిర్యాలగూడలో రై లు దిగినట్లు పేర్కొన్నారు. కానీ రైల్వే స్టేషన్ నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు ఎందుకు వెళ్లినట్లనే విషయం మాత్రం తెలియడం లేదు.  కాగా ఇదే విషయంపై గురువారం హైదరాబాద్ రేంజ్ డీఐజీ గంగాధర్ కూడా విచారణ చేయనున్నట్టు సమాచారం.
 
 వన్‌టౌన్ స్టేషన్‌కు ఎందుకు వెళ్లినట్లు?
 మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌లో కొంత మందితో తగాదా పడితే అశోక్‌వెంకటిని పోలీసులు తీసుకవచ్చినట్లు తెలిసింది. కానీ రైల్వేస్టేషన్‌లో తగాదా పడితే రైల్వే పోలీసులు సైతం అక్కడే ఉంటారు. కానీ రైల్వే పోలీసులు ఎందుకు తీసుకెళ్లలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైల్వే పోలీసులు తీసుకెళ్లకుంటే రూరల్ పోలీసులు తీసుకెళ్లాల్సి ఉంది. కానీ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు ఎందుకు తీసుకవచ్చారో తెలియడం లేదు. అశోక్‌వెంకటి మానసిక పరిస్థితి బాగా లేదని చెబుతున్న పోలీసులు ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సింది. కానీ ఆటోలో పంపిస్తే తిరిగి స్టేషన్‌కు వచ్చాడని చెబుతున్నారు. కానీ స్టేషన్ నుంచి బయటకు పంపిన వ్యక్తి తిరిగి స్టేషన్‌కు ఎలా వచ్చాడనే విషయంపై అనుమానాలకు తావిస్తోంది. స్టేషన్‌కు వెళ్తున్న వ్యక్తులను అక్కడ ఉండే గార్డ్ డ్యూటీ పోలీసులు విచారించిన తర్వాతనే లోనికి పంపుతారు. అనామకుడిగా వస్తే అశోక్ వెంకట్‌ను స్టేషన్‌లో ఎందుకు ఉంచారనే విషయం తెలియాల్సి ఉంది.
 
 ఇది రెండో ఘటన
 ఒక పక్క మైత్రి పోలీసులు అని కార్యక్రమాలు నిర్వహిస్తుంగా మరో పక్క స్టేషన్‌లో వ్యక్తులు మృతి చెందడంతో జిల్లా ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లోనే మూడు మాసాల కాలంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో పట్టణ ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు.పోలీసులు ప్రజలతో మమేకమై నేరాలను తగ్గించడానికి ఎస్పీ దుగ్గల్ వివిధ కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలో ఇలాంటి సంఘటనలు పోలీసు అధికారులనే సైతం ఆందోళన కలిగిస్తున్నాయి.
 
 లాకప్‌డెత్‌పై విచారణ
 మిర్యాలగూడ టౌన్ మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం జరిగిన లాకప్‌డెత్‌పై బుధవారం ఆర్డీఓ బి.కిషన్‌రావు, ఏఎస్పీ బి.గంగారాం ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సుమారు నాలుగు గంటల పాటు విచారణ జరిపారు. కాగా మృతుడు అశోక్‌వెంకట్ బంధువులతో పాటు వన్‌టౌన్ పోలీసులను విచారించారు. ఆర్డీఓ బి.కిషన్‌రావు మాట్లాడుతూ ప్రస్తుతం మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, పోస్టుమార్టం రిపోర్టు వస్తేనే ఎదైనా చెప్పగలుగుతామన్నారు. అదే విధంగా ఆర్డీఓ మృతదేహాన్ని  అన్ని కోణాలలో పరిశీలించారు. ఆయన వెంట సూర్యాపేట, మిర్యాలగూడ డీఎస్పీలు బషీర్, సందీప్‌గోనే, సీఐలు సురేందర్‌రెడ్డి, పార్థసారథి తదితరులున్నారు.  మృతుడికి భార్య తరాబాయి, కుమారులున్నారు. పోస్టుమార్టం అనంతరం  మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.  
 
 మా నాన్న ఆరోగ్యంగానే ఉన్నాడు
 మా నాన్న ఆరోగ్యంగానే ఉన్నాడని, మతిస్థితిమి తం కూడా బాగేనే ఉందని, వంటలలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి మిర్యాలగూడకు ఎందుకు వచ్చాడు అనేది అర్థం కావడం లేదన్నారు. తిరుపతికి వెళ్తున్నానంటూ ఇంట్లో నుంచి వెళ్లిన అశోక్‌వెంకటి మంగళవారం రాత్రి 7గంటలకు చనిపోయాడని పోలీసులు సమాచారం ఇచ్చారని పేర్కొన్నాడు. అతని వెంట బందువులు మాదవ మిట్టల్ పెటెవాల్, ప్రకాశ్‌వెంకటి, ఆనందం న్నారు.      -అశోక్, మృతుడి కుమారుడు
 

whatsapp channel

మరిన్ని వార్తలు