ఈ యువతకేమైంది! 

15 Oct, 2018 01:58 IST|Sakshi

మానసిక ఒత్తిడిలో చాలా మంది.. నిరుద్యోగం, పోటీతత్వమే కారణాలు

భారతీయ యువత ఇంతకు ముందు  ఏ తరమూ లోను కానంతటి ఒత్తిళ్లకు లోనవుతోంది. మానసిక అనారోగ్యం బారిన పడే యువత సంఖ్య అంతకంతకూ హెచ్చుతోంది. వారి సమస్యల గురించి చర్చించే / మద్దతుగా నిలిచే వాతావరణం కరువవుతోంది. ఈ పరిస్థితి ఒక్కోసారి ఆత్మహత్యలకు కారణమవుతోంది. 

భారతీయ విశ్వవిద్యాలయాలపై 2016లో జరిగిన సర్వే ప్రకారం... 37.7 శాతం మంది విద్యార్థులు ఒక మోస్తరు డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. 13.1% మంది ఈ సమస్యతో తీవ్రంగా,  2.4% మంది మరింత తీవ్రంగా సతమతమవుతున్నారు. యువకుల కంటే యువతుల్లో డిప్రెషన్‌ బాధితులు ఎక్కువగా ఉన్నారు. కుటుంబంలో కొంత సంతోషకర వాతావరణం ఉన్న చోట డిప్రెషన్‌ చాలా తక్కువగా ఉంది. పరీక్షల్లో తప్పడం, పాఠాలను అవగాహన చేసుకోలేకపోవడం విద్యార్థుల డిప్రెషన్‌కు, ఆత్మహత్యలకు ప్రధాన కారణమవుతున్నాయని ఈ అధ్యయనంలో భాగస్వామి అయిన ఎన్‌ఫోల్డ్‌ ఇండియా కో–ఫౌండర్‌ షైబ్యా సల్దనా చెప్పారు. వీరి బలవన్మరణాల వెనుక నిస్సహాయత, విపరీతమైన నైరాశ్యం ఉందని ఆమె వివరించారు. విజయానికి నిర్ణీత కొలమానాలను ఏర్పరచడం, సామాజికంగా వేరుపడిపోవడం, విభిన్న సంస్కృతుల వైవిధ్యాన్ని అంగీకరించకపోవడం, పట్టణీకరణ పెరిగిపోవడం వంటి అంశాలు కుంగుబాటుకు, ఆత్మహత్యలకు కారణమని మానసిక వైద్య నిపుణులు డాక్టర్‌ అచల్‌ భగత్‌ అన్నారు. 

గంటకొక విద్యార్థి.. 
మానసిక వైద్య నిపుణులు, కౌన్సెలర్లు అందిస్తున్న వివరాల ప్రకారం.. పరీక్షల విషయం లో విపరీతమైన ఒత్తిడి, ఉద్యోగం పొందలేకపోవడం, తమ ఆకాంక్షలకు అనుగుణంగా జీవితాన్ని మలచుకోలేకపోవడం వంటి అంశాలు డిప్రెషన్‌కు.. ఒక్కోసారి ఆత్మహత్యకు దారితీస్తున్నాయి. కుటుంబాల నుంచి, విద్యా సంస్థల నుంచి తగిన మద్దతు లభించకపోవడం, కౌన్సెలింగ్‌ ఇచ్చే వాతావరణం కరువవడంతో యువతలో ఆత్మహత్యల రేటు పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. చదువు ఒత్తిళ్లతో దేశంలో ప్రతి గంటకో విద్యార్థి మరణిస్తున్నట్లు 2015 ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు చెబుతున్నాయి.  2011–15 మధ్య..  40,000 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. 2014లో సిక్కింలో నమోదైన ఆత్మహత్యల్లో 27 శాతం ఉపాధి రాహిత్యంతో ముడివడినవేననీ ఒక అధ్యయనం చెబుతోంది. మధ్యప్రదేశ్‌లో ఉద్యోగం లేక ఆత్మహత్యలకు పాల్పడిన వారి శాతం దశాబ్ద కాలం(2005 –15)లో 2000% పెరిగినట్లు ఎన్‌సీఆర్‌బీ లెక్కలు చెబుతున్నాయి. ఉపాధి లేమి తాలూకూ కుంగుబాటు యువత జీవితాలను మింగేస్తుందనడానికి ఇవి బలమైన ఉదాహరణలు.

ఏం చేయాలి? 
- మానసిక ఆరోగ్య సమస్యలు సర్వసాధారణం అనుకునే అనుకూల వాతావరణం చాలా ముఖ్యం. 
పాఠశాలలు, కాలేజీల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచాలి. మానసిక ఆరోగ్యం, వెల్‌నెస్‌ అంశాల్ని పాఠ్య ప్రణాళికల్లో చేర్పాలి.  
తల్లిదండ్రుల పెంపకంలో మార్పు రావాలి. కుటుంబం అండగా ఉంటే పిల్లలు మానసిక సంక్షోభాల నుంచి బయటపడతారు. 
పాఠశాలలు, కళాశాలల్లో లైంగికత, జీవన నైపుణ్యాల విజ్ఞానాన్ని అందించాలి. 
ఉన్నత విద్యా సంస్థల్లో కౌన్సెలింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలి. సుశిక్షతులైన సైకాలజిస్టులు, కౌన్సెలర్లను నియమించాలి. బాధిత విద్యార్థులకు తగిన సాయమందించాలి. 
బడ్జెట్‌లో మానసిక ఆరోగ్య అవసరాలకు వెచ్చించే మొత్తాన్ని పెంచాలి.

ఒత్తిడి గుప్పెట్లో..  
దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి డిప్రెషన్, గుండెపోటు సహా అనేక శారీరక అనారోగ్యాలకు కారణమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రమాదకర ఒత్తిడి నుంచి బయటపడటం సాధ్యం కావడం లేదని సిగ్నా టీటీకే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఇటీవల జరిపిన సర్వేలో 95 శాతం భారతీయ యువతీయువకులు చెప్పారు. భారత్, అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, చైనా, బ్రెజిల్, ఇండోనేసియా సహా 23 దేశాలపై జరిగిన ఈ సర్వే ప్రకారం.. మన దేశ యువతీ యువకుల్లో (18–34 ఏళ్ల వయోశ్రేణి) 95 శాతం మంది ఒత్తిడికి గురవుతున్నామని చెప్పారు. 
50 శాతం మంది స్నేహితులతో తగినంత సేపు గడపలేకపోతున్నారు. దాదాపు 75 శాతం మంది తమ సమస్యను డాక్టర్‌తో చెప్పుకునేందుకు ఇబ్బందిపడుతున్నారు. వైద్య సాయం తీసుకునేందుకు ఆర్థిక పరిస్థితులు పెద్ద అడ్డంకిగా ఉన్నాయి.  ‘పని–పైసలు’.. ఈ రెండు అంశాలే వారి ఒత్తిడికి ప్రధాన కారణాలవుతున్నాయి. 
50 శాతం మంది ఉద్యోగులు పని ప్రదేశాల్లో జరుగుతున్న వెల్‌నెస్‌ ప్రోగ్రాంల్లో పాల్గొంటున్నట్లు సర్వే స్పష్టం చేసింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా