జిల్లాలో మావోల ప్రాభల్యం లేదు

8 Jul, 2015 01:38 IST|Sakshi

 పెద్దవూర : జిల్లాలో మావోయిస్టుల ప్రాభల్యం లేదని ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ అన్నారు. మంగళవారం ఆయన పెద్దవూర పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులు, క్రైం రేటు, సిబ్బంది వివరాలను తెలుసుకుని పోలీస్ స్టేషన్ భవనం, క్వార్టర్లను పరిశీలించారు. పోలీసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండటానికి గాను గ్రామాల్లో జనమైత్రి పోలీస్‌లను నియమించినట్లు తెలిపారు. వారి పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. జిల్లాలో ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగరాదనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే బెల్టు దుకాణాలు, సారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. సారా, అక్రమ మద్యం విక్రేతలను కనీసం రూ.లక్ష పూచీకత్తుపై బైండోవర్ చేయాలన్న తలంపుతో ఉన్నట్లు పేర్కొన్నారు.
 
 యువతకు ఓరియంటేషన్
 గ్రామాల్లోని యువతను సన్మార్గంలో నడిపించేందుకు కళాజాత కార్యాక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 150 మంది నిరుద్యోగ గ్రాడ్యుయేట్‌లకు  పోటీ పరీక్షలపై తనతోపాటు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, తహసీల్దార్‌లతో ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించినట్లు వివరించారు. సబ్ డివిజన్ స్థాయిలో ఈ తరగతులు ఏర్పాటు చేయటానికి ప్రణాళికలు రూపొందించామని, హరితహారం కార్యక్రమం ముగియగానే మిర్యాలగూడెం సబ్ డివిజన్‌లో మూడు రోజుల వర్క్‌షాప్ నిర్వహించటానికి గ్రాడ్యుయేట్ల పేర్లను సైతం నమోదు చేసినట్లు తెలిపారు. మిషన్ కాకతీయ, జనమైత్రి కార్యక్రమంలో కష్టపడి పనిచేసే వారిని గుర్తించి ప్రోత్సాహక బహుమతులతో పాటు రివార్డును అందిస్తామన్నారు. అలాగే పోలీస్ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠినంగా శిక్షిస్తామన్నారు.
 
 ప్రయోగాత్మకంగా షీ టీములు
 జిల్లాలో ప్రయోగాత్మకంగా రెండు షీ టీములు ఏర్పాటు చేశామని, ప్రస్తుతం రహస్యంగా  25 నుంచి 30 షీ టీములు పనిచేస్తున్నట్లు తెలిపారు. బాలికల కళాశాలలు, పాఠశాలకు వెళ్లి వారికి అవగాహన కల్పిస్తారని అన్నారు. సిబ్బంది కొరతతో పోలీసులకు వారాంతపు సెలవులు సమస్యగా మారాయని, ప్రణాళిక ప్రకారం విధులకు ఎలాంటి ఆటంకం లేకుండా చూస్తామని అన్నారు. ఆయన వెంట మిర్యాలగూడెం డీఎస్పీ గోనె సందీప్, హాలియా సీఐ కె.పార్థసారథి, ఎస్‌ఐ బి. ప్రసాదరావులు ఉన్నారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు