ఖానాపూర్‌లో నేటికీ చెదరని జ్ఞాపకాలు

15 Oct, 2019 09:04 IST|Sakshi

సాక్షి, ఖానాపూర్‌ : ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో నేటికి చెదరని నెత్తుటి చేదుజ్ఞాపకాలు.. తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది.  ఎటుచూసిన అన్నల అలజడి... తుపాకీ చప్పుళ్లు వినబడుతుండేవి. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట నక్సలైట్లు విధ్వంస చర్యలు జరుగుతూనే ఉండేవి. తరుచూ ఎన్‌కౌంటర్లు జరుగుతుండేవి... నక్సలైట్ల కవ్వింపు చర్యలు తిప్పికొట్టే ప్రయత్నాల్లో ప్రాణాలర్పించిన పోలీసుల సేవలు మరువలేనివి. ఈ క్రమంలోనే ఎన్నో సంఘటనలు జరిగాయి. దాదాపు 1983 నుంచి అప్పటి ఆదిలాబాద్‌లో ఉన్న నిర్మల్‌ జిల్లా పరిధిలో మెల్లమెల్లగా నక్సలైట్ల ప్రభావం పెరుగుతూ వచ్చింది. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ సర్కిల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విధి నిర్వహణలో నక్సలైట్ల తూటాలకు 19 మంది పోలీసులు బలి అయ్యారు. ఖానాపూర్‌ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండడంతో నక్సలైట్లు స్థావరాలు ఎర్పరచుకున్నారు. జిల్లాలో మొదటిసారిగా ఇక్కడి నుంచే విద్రోహ చర్యలకు శ్రీకారం చుట్టారు.

సంఘటనల వివరాలివే..

  • 1987 ఆగస్టు 18న కడెం మండలం అల్లంపల్లి క్యాంపునకు పోలీసులు నడిచి వెళ్తుండగా అద్దాల తిమ్మాపూర్‌ వద్ద 30 మంది నక్సలైట్లు పకడ్బందీ పథకం ప్రకారం మాటువేసి విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఇద్దరు ఎస్సైలు, ఒక హెడ్‌ కానిస్టేబుల్, ఏడుగురు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు కానిస్టేబుళ్లు తప్పించుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. 
  • 1989 పిభ్రవరి ఒకటిన జరిగిన సంఘటకు ఒక రోజు ముందు ఖానాపూర్‌ మండలంలోని రాజూరా గ్రామంలో నక్సలైట్లు దోపిడికి పాల్పడ్డారు. దోపిడి నేపథ్యంలో పోలీసులు ఆ గ్రామానికి వెళ్తుండగా కడెం మండలం సింగాపూర్‌ గ్రామ సమీపంలో పకడ్బందీ వ్యూహంతో నక్సలైట్లు పోలీసుల జీపును పేల్చివేశా రు. ఎస్‌ఐ ఖాదర్‌ఉల్‌హక్, ఆరుగురు కానిస్టేబుళ్లు జీ. బాపురావు, ఎండీ జలీల్, షేక్‌హైదర్, వేణుగోపాల్, బోజరావు, ఎస్‌. మోహన్‌దాస్‌లు ప్రాణాలు కోల్పోయారు. ఒకే కానిస్టేబుల్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. 
  • 1999 డిసెంబర్‌ ఐదున కడెం మండలంలో బందోబస్తుకు వెళ్లి వస్తుండగా ఖానాపూర్‌ మండలం తర్లపాడ్‌ గ్రామసమీపంలో నక్సలైట్లు రిమోట్‌కంట్రోలర్‌ సహాయంతో పోలీసు జీపును పేల్చివేశారు. ఎస్‌ఐ మల్లేశ్‌తో పాటు కానిస్టేబుల్, జీపు డ్రైవర్‌ దుర్మరణం చెందారు.

​ఖానాపూర్‌లో అమరుల స్థూపం
ఖానాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో అమవీరుల స్మారాకర్థం స్థూపం లేకపోవడంతో స్టేషన్‌ ఆవరణలోని ఓ వేపచెట్టు కింద శిలాఫలకంపై పేర్లు రాసి ఉంచేవారు. అనంతరం 2008 సంవత్సరంలో అప్పటి సీఐ, ఎస్‌ఐలు స్మారక స్థూప నిర్మాణానికి కృషి చేశారు. ప్రస్తుత సీఐజయరాంనాయక్‌తో పాటు ఎస్‌ఐ గోగికారి ప్రసాద్‌లు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. 

మరిన్ని వార్తలు