‘ఆపరేషన్‌ సమాధాన్‌’పై మావ్చోల పోరు

28 Jan, 2019 07:44 IST|Sakshi
చర్ల మండలం ఆర్‌.కొత్తగూడెం–కుదునూరు గ్రామాల మధ్య మావోయిస్టుల పోస్టర్లు

సాక్షి, కొత్తగూడెం: మావోయిస్టులకు, బలగాలకు మధ్య సుదీర్ఘకాలంగా పోరు జరుగుతోంది. కొన్ని నెలలుగా మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్‌ సమాధాన్‌’ పేరుతో ప్రత్యేక ఆపరేషన్‌ ప్రారంభించింది. ఆంగ్ల అక్షరమాలలోని ‘ఎస్‌ ఏ ఎం ఏ డీ హెచ్‌ ఏ ఎన్‌’ (ఎస్‌–స్మార్ట్‌ లీడర్‌షిప్‌), (ఏ–అగ్రెసివ్‌ స్ట్రాటజీ), (ఎం–మోటివేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌), (ఏ–యాక్షనబుల్‌ ఇంటెలిజెన్సీ), (డి–డాష్‌బోర్డ్‌ బేస్డ్‌ కీ), (హెచ్‌–హార్నెసింగ్‌ టెక్నాలజీ), (ఏ–యాక్షన్‌ ప్లాన్‌), (ఎన్‌–నో యాక్సెస్‌ టు ఫైనాన్సింగ్‌) లక్ష్యంతో ఈ ఆపరేషన్‌ను చేపడుతోంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా పోలీసులను సమన్వయపర్చుకుంటూ కేంద్ర బలగాలను దండకారణ్యంలోకి కేంద్ర ప్రభుత్వం ముందుకు నడిపిస్తోంది.

ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ, సుక్మా, బీజాపూర్, బస్తర్, కాంకేర్, నారాయణపూర్‌ జిల్లాల్లో సీఆర్‌పీఎఫ్‌ బేస్‌ క్యాంపులు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. ఫలితంగా, మావోయిస్టులకు భారీగా నష్టం వాటిల్లుతోంది. మొన్నటి శాసనసభ ఎన్నికలకు ముందు నుంచే ‘ఆపరేషన్‌ సమాధాన్‌’కు కేంద్రం పదును పెట్టింది. మరో రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలున్నాయి. వీటి నిర్వహణకు మావోయిస్టుల నుంచి ఎటువంటి ఆటంకాలు ఎదురవకుండా చూసేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలను పోలీసులు గట్టిగానే నియంత్రించగలిగారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణలోకి ప్రవేశించేందుకు మావోయిస్టులు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు.
 
సభలు–సమావేశాలు, బంద్‌... 
పై పరిణామాలన్నింటి నేపథ్యంలో, ‘ఆపరేషన్‌ సమాధాన్‌’కు వ్యతిరేకంగా మావోయిస్టులు ఈ నెల 25 నుంచి 30 వరకు సభలు–సమావేశాలకు, 31న భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. వీటి ప్రచా రంలో భాగంగా శుక్రవారం భద్రాచలం బస్టాండులో కరపత్రాలు, అశ్వాపురం మండలంలోని మల్లెలమడుగు–నెల్లిపాక బంజర గ్రామాల మధ్యలో బ్యానర్లు, చర్ల మండలంలోని ఆర్‌.కొత్తగూడెం–కుదునూరు మధ్య ప్రధాన రహదారిపై కనిపించాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలంలోని సూరవీడు వద్ద బ్యానర్లు, ఆంధ్రప్రదేశ్‌లోని చింతపల్లి మండలం అంతర్లా గ్రామ వద్ద కరపత్రాలు, భద్రాచలం నుంచి అశ్వారావుపేట వెళ్లే ప్రధాన రహదారి పక్కన పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం మారేడుబాక, ఉప్పేరు, వెంకటాపురం గ్రామాల వద్ద బ్యానర్లు, పోస్టర్లు కనిపించాయి. జయశంకర్‌ జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు వద్ద కామినిచెరువు పనులు చేస్తున్న జేసీబీని ఈ నెల 24న మావోయిస్టులు తగులబెట్టారు. ‘సమాధాన్‌’కు వ్యతిరేకంగా బ్యానర్లు, కరపత్రా లు వదిలారు. పాక్షిక మైదాన ప్రాంతంగా పేరుపడిన అశ్వాపురం మండలంలోని మల్లెలమడుగు–నెల్లిపాక బంజర ప్రాంతంలోనూ మావోయిస్టుల బ్యానర్లు కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది.

రెచ్చిపోతున్న మావోయిస్టులు... 
మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. బాంబులు పెడుతున్నారు, పేలుస్తున్నారు. ఈ నెల 22న చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో ప్రెషర్‌ బాంబు పేలడంతో నలుగురు ఆర్‌ అండ్‌ బీ ఉద్యోగులు గాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఎల్‌డబ్ల్యూఈ నిధులతో పెదమిడిసీలేరు నుంచి చెన్నాపురం వరకు గతంలో రోడ్డు నిర్మాణం పూర్తియింది. దీని పక్కన కిలోమీటర్‌ రాళ్లను పాతేందుకు ఆర్‌ అండ్‌ బీ ఉద్యోగులు మార్కింగ్‌ చేస్తుండగా ప్రెషర్‌ బాంబు పేలింది.

  •  2018 డిసెంబర్‌ 31న చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్‌ సమీపంలోని తిప్పాపురం రోడ్డులో మావోయిస్టులు అమర్చిన రెండు మందుపాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. 
  •  2018 డిసెంబర్‌ 11న చర్ల మండలంలోని బోదనెల్లి సమీపంలో ప్రధాన రహదారిపై మావోయిస్టులు అమర్చిన మందుపాతరను పోలీసులు గుర్తించారు. బయటకు తీస్తుండగా అది పేలింది. ఒక జావానుకు తీవ్ర గాయాలయ్యాయి.
  • 2018 డిసెంబర్‌ 7న చర్ల మండలం పెదమిడిసిలేరు సమీపంలోని తిప్పాపురం మార్గంలోగల పగిడివాగు చప్టాను మందుపాతరతో మావోయిస్టులు పేల్చివేశారు. 
  •  2017 జూలైలో చర్ల మండలంలోని లెనిన్‌ కాలనీకి వెళ్లే మార్గంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరను పోలీసులు నిర్వీర్యం చేశారు. 
  •  2018 మే 5న చర్ల మండలంలోని సత్యనారాయణపురం ప్రధాన రహదారిలోగల ప్రధాన కల్వర్టును మావోయిస్టులు మందుపాతరలతో పేల్చివేశారు. 
  •  2018 మే నెలలో చర్ల బస్టాండ్‌ అవుట్‌ గేట్‌ వద్ద మావోయిస్టులు బ్యాగులో ఉంచిన ప్రెషర్‌ బాంబును పోలీసులు గుర్తించారు. దానిని స్వాధీనపర్చుకుని, సమీపంలోని చెరువు వద్ద నిర్వీర్యం చేశారు.

 
‘సమాధాన్‌‘మిస్తున్న బలగాలు 
దాడులు, బాంబులతో రెచ్చిపోతున్న మావోయిస్టులకు ‘ఆపరేషన్‌ సమాధాన్‌’ పేరుతో బలగాలు గట్టిగానే సమాధానమిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దండకారణ్యం నుంచి తెలంగాణలోని సరిహద్దు జిల్లాల్లోకి చొచ్చుకొచ్చేందుకు మావోయిస్టులు సాగించిన ప్రయత్నాలను మన పోలీసులు గట్టిగానే తిప్పికొట్టారు. దీనికి ప్రతీకారంగా, మావోయిస్టులు దాడులకు, విధ్వంసానికి దిగుతున్నారు. పోలీసు బలగాలే లక్ష్యంగా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు దాటి వస్తున్నారు. భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం మండలాల్లో అనేకచోట్ల మందుపాతరలు, ప్రెషర్‌ బాంబులు ఏర్పాటు చేశారు.

వీటి నుంచి బలగాలు చాకచక్యంగా తప్పించుకుని దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాడులకు మావోయిస్టు పార్టీ యాక్షన్‌ టీములు రంగంలోకి దిగినట్టు పోలీసులు గుర్తించారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక యాక్షన్‌ టీం ఏర్పాటైనట్టు, ఇన్‌చార్జిగా దామోదర్‌ నియమితులైనట్టు ఇంటెలిజెన్స్‌ వర్గాలు గుర్తించాయి. ఈ సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు, పకడ్బందీగా వ్యవహరించారు. గత నవంబర్‌ 28న మావోయిస్టు పార్టీ మణుగూరు–పాల్వంచ ఏరియా కార్యదర్శి సుజాతక్కను అరెస్ట్‌ చేశారు. మావోయిస్టు పార్టీ ఈమె తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, భద్రాద్రి కొత్తగూడెం–తూర్పుగోదావరి జిల్లాల కార్యదర్శి కొయ్యడ సాంబయ్య అలియాస్‌ ఆజాద్‌ భార్యనే ఈ సుజాతక్క. యాక్షన్‌ టీం వివరాలను ఈమె నుంచి పోలీసులు సేకరించారు.
 
సరిహద్దుల్లో ఉద్రిక్తత
ఒకవైపు, మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. మరోవైపు, బలగాలు–పోలీసులు గట్టిగానే ‘సమాధాన్‌’మిస్తున్నారు. ఇంకోవైపు, మరో మూడు నెలల్లో పార్లమెంట్‌ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో... ‘ఆపరేషన్‌ సమాధాన్‌’ను ఓడించాలంటూ మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌ పేరుతో వారు తీవ్ర హింసకు దిగే ప్రమాదముంది. ‘సమాధాన్‌’ పేరుతో బలగాలు–పోలీసులు కూడా అప్రమత్తంగా, సర్వసన్నద్ధంగా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే... సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం, తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

మరిన్ని వార్తలు